ఎంతపని చేశావమ్మా..!
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:57 PM
భర్త మీద కోపంతో ఆమె విచక్షణ కోల్పోయింది. తన రెండున్నరేళ్ల కొడుకును చంపేసింది. బాలుడి బంగారు భవిష్యత్తు ఆలోచించకుండా నాగావళి నదిలో ముంచి ప్రాణాలు తీసింది.
భర్తపై కోపంతో రెండేళ్ల బాబుని చంపేసిన తల్లి
నదిలో ముంచేసి ప్రాణం తీసిన వైనం
తరువాత అదే నదిలో మునిగి ఆత్మహత్యాయత్నం
ఆమెను కాపాడిన స్థానికులు
శ్రీకాకుళం నగరంలో ఘటన
శ్రీకాకుళం క్రైం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): భర్త మీద కోపంతో ఆమె విచక్షణ కోల్పోయింది. తన రెండున్నరేళ్ల కొడుకును చంపేసింది. బాలుడి బంగారు భవిష్యత్తు ఆలోచించకుండా నాగావళి నదిలో ముంచి ప్రాణాలు తీసింది. తరువాత అదే నదిలో మునిగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. ఈ ఘటన శ్రీకాకుళం నగరంలో శనివారం చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని యాతపేటకు చెందిన తుమ్ముల మోషుబా బుతో పెద్దరెల్లివీధికి విమల (వరుసకు మేనకో డలు)కు నాలుగున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. మోషుబాబు సెప్టిక్ క్లీనింగ్ ట్యాం క్‌ను తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు వరుణతేజ ఉన్నాడు. మోషుబాబు నిత్యం మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం రాత్రి కూడా పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో అర్ధరాత్రి వరకూ గొడవపడ్డాడు. దీంతో విమల తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్తపై కోపంతో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తన కుమారుడితో కలిసి గుడివీధి ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయ వద్ద ఉన్న నాగావళి నదీ ఘాట్‌కు చేరుకుంది. అక్కడ నదిలోని నీటిలో వరుణతేజను ముంచి చంపేసింది. అనంతరం ఆమె కూడా నదిలో మునిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నదిలో నీరు పెద్దగా లేకపోవడంతో స్థానికులు ఆమెను కాపాడారు. కాసేపటికి అక్కడే బాలుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు వన్‌టౌన్ ఎస్‌ఐ రామారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, గత ఏడాదిన్నర నుంచి విమల మానసిక పరిస్థితి బాగోలేదని, చికిత్సకోసం మందులు వాడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
తల్లి విమలను విచారిస్తున్న పోలీసులు
Updated Date - Jun 21 , 2025 | 11:57 PM