Water grid : రూ.1,204 కోట్లతో వాటర్ గ్రిడ్
ABN, Publish Date - May 29 , 2025 | 11:54 PM
Water grid : టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల ప్రజల తాగునీటి కష్టాలను తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
- పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మాణానికి శ్రీకారం
- టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలకు చెక్
- ఇప్పటికే మొదలైన సర్వే
టెక్కలి, మే 29 (ఆంధ్రజ్యోతి): టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల ప్రజల తాగునీటి కష్టాలను తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే సదుద్దేశంతో రూ.1,204 కోట్లతో వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రధానమంత్రి జల్‌జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు చేపట్టారు. పూణేకు చెందిన ఛాయిస్ సంస్థ టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో అవసరమైన వాటర్ లెవల్స్, పంపులు, సంపులతో పాటు పైపులైన్ల ఏర్పాటుకు సర్వే చేస్తోంది. గొట్టాబ్యారేజీ డెత్ స్టోరేజ్ వాటర్ పాయింట్ వద్ద ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్ ద్వారా సుమారు 900 ఎంఎం పైపులైన్ డయాస్‌తో బొంతు జంక్షన్ కొండపై నిర్మించనున్న వాటర్‌గ్రిడ్‌కు నీరు చేరనుంది. ఇక్కడ వాటర్ ప్యూర్‌ఫై జరిగిన తరువాత నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి చల్లపేట మీదుగా పైపులైన్ ద్వారా 411 గ్రామాలకు, టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి వయా జర్జంగి మీదుగా కొత్తపేట కొండపైకి నీరు చేరుతుంది. ఇక్కడ నుంచి ఇంటర్నల్ పైపులైన్ల ద్వారా టెక్కలి నియోజకవర్గంలో 497 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వాటర్ గ్రిడ్‌ను నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడులు చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
టెక్కలి ప్రజలకు మాటిచ్చా
ప్రతి గ్రామంపై నాకు అవగాహన ఉంది. వారి ప్రధాన సమస్యలు గుర్తించాను. ఎన్నికల్లో మాటిచ్చినట్లు ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం. ఇందుకు సంబంధించి రూ.1,204 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులకు ప్రతిపాదన చేశాం. మంజూరు కాగానే పనులు జరిపిస్తాం.
- కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి
క్షేత్రస్థాయిలో వాటర్ లెవల్స్ సర్వే
వాటర్‌గ్రిడ్ ద్వారా టెక్కలి నియోజకర్గంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు చేశాం. పూణేకు చెందిన ఛాయిస్ కంపెనీ క్షేత్రస్థాయిలో వాటర్ లెవల్స్‌పై సర్వే చేస్తోంది. టెక్కలి నియోజకవర్గ పరిధిలోని 497 గ్రామాలకు తాగునీరు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశాం.
- ఎస్.రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ, టెక్కలి
Updated Date - May 29 , 2025 | 11:54 PM