Storage Issues: గోదాములున్నా.. ప్రయోజనమేదీ?
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:46 PM
Food Grains Management రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ యార్డు(ఏఎంసీ)ల పరిధిలో గోదాములు ఉన్నా.. ప్రయోజనం లేకపోతోంది.
సక్రమంగా అమలుకాని రైతుబంధు పథకం
నిరుపయోగంగా మార్కెట్ యార్డులు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతుల ఆశలు
నరసన్నపేట, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ యార్డు(ఏఎంసీ)ల పరిధిలో గోదాములు ఉన్నా.. ప్రయోజనం లేకపోతోంది. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేవరకూ గోదాముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గోదాములో నిల్వ ఉంచిన పంట విలువలో 75 శాతం డబ్బులను రైతులు రైతుబంధు పథకం ద్వారా రుణంగా తీసుకోవచ్చు. గరిష్ఠంగా రూ.లక్ష వరకూ రుణం పొందవచ్చు. మొదటి 3 నెలలు కాలానికి వడ్డీ వర్తించదు. ఆ తరువాత 5వేలకు 5శాతం, 10వేలకు 6శాతం, 15వేలకు 8శాతం, 50వేలు లోపు 10శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. కానీ జిల్లాలో మార్కెట్ కమిటీ పరిధిలో ఈ పథకం నామమాత్రంగా సాగుతోంది. కొన్ని మార్కెట్ యార్డుల్లో గత పాలకులు బినామీ పేర్లతో రుణాలు పొందినట్టు తెలుస్తోంది. అలాగే అవగాహన లేక ఈ గోదాముల్లో రైతులెవరూ పంటను నిల్వ చేసుకోని దుస్థితి నెలకొంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పొందూరు, కోటబొమ్మాళి, పాతపట్నం, హిరమండలం, ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, జలుమూరు, ఎచ్లెర్లలో వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. 11 మార్కెట్ యార్డుల గోదాములు ఉన్నాయి. కొన్ని యార్డుల్లో గోదాములు నిరూపయోగంగా.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. జలుమూరు మార్కెట్ కమిటీకి సంబంధించి భవనాలను నిర్మించాల్సి ఉంది. కాగా.. పంటలను మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉన్నా.. అధికారులు అవగాహన కల్పించడం లేదు. దీంతో దళారీలు ఇచ్చిన ధరకు రైతులు పంటలను అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇటీవల రబీలో మొక్కజొన్న పంటకు మొక్కజొన్న ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారారు. దీంతో రైతులు తక్కువ ధరకు పంటను విక్రయించుకోవాల్సి వచ్చింది. అలాగే వరిలో సన్నరకాలకు కూడా దళారీలు తక్కువ ధరకే కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మార్కెట్ యార్డుల చైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే. వారికి పదవీ బాధ్యతలు అప్పగించడంలో జాప్యమవుతోంది. వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యేల సహకారంతో వ్యవసాయ మార్కెట్ యార్డులను అభివృద్ధికి కృషి చేస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో మార్కెట్ కమిటీకి రూ.20లక్షలు
రైతుబంధు పథకం ద్వారా ఒక్కో మార్కెట్ కమిటీకి రూ.20లక్షలు చొప్పున రుణాలు అందజేస్తాం. గత ప్రభుత్వ హయాంలో సీఎఫ్‌ఎంఎస్ విధానంలో ఈ పథకం ద్వారా రుణాలు మంజూరులో జాప్యమైంది. దీంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. మార్కెట్ కమిటీలను వినియోగించేందుకు రైతు ఉత్పాదిక సంఘాలను బలోపేతం చేస్తాం. రైతులకు మద్దతు ధర కల్పించి.. వారి ఆర్థికాభివృద్ధికి కమిటీలు దోహదపడుతున్నాయి.
- రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్ శాఖ, శ్రీకాకుళం
Updated Date - Jun 24 , 2025 | 11:46 PM