విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:47 AM
జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. స్కూళ్లు ప్రారంభంరోజే ప్రతి విద్యార్థికి రూ.2,279 విలువైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్‌ను ఉచితంగా అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
- నేడు పంపిణీ చేయనున్న అధికారులు
- జిల్లాకు చేరిన 1,60,120 కిట్లు
మెళియాపుట్టి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. స్కూళ్లు ప్రారంభంరోజే ప్రతి విద్యార్థికి రూ.2,279 విలువైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్‌ను ఉచితంగా అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరిట కిట్లు అందించేవారు. అయితే, విద్యాసంవత్సరం ప్రారంభమైన కొన్ని నెలల వరకు కూడా విద్యార్థులకు పూర్తిస్థాయిలో కిట్లు అందేవి కావు. సగం సగం మాత్రమే పంపిణీ చేసేవారు. అవి కూడా నాసిరకంగా ఉండేవి. పైగా వైసీపీ రంగును పోలిన విధంగా ఉండేవి. కొందరు విద్యార్థులకు బూట్లు పెద్దవిగా, మరికొందరికి చిన్నవిగా ఉండేవి. యూనిఫారాంల విషయంలో కూడా అదే పరిస్థితి. కొలతల ప్రకారం ఉండేవి కావు. దీంతో వాటిని ధరించేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. బ్యాగులు రెండు రోజులకే చిరిగిపోయేవి. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యా కిట్లు అందించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి విద్యార్థికీ వాటిని అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కిట్లు ఎంఆర్‌సీల నుంచి నుంచి పాఠశాలలకు తరలించారు. గురువారం అన్ని పాఠశాలల్లో కిట్లు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కిట్‌లో ఒక్కో విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్, వర్క్ బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, మూడు జతల యూనిఫారం, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్ అందించనున్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియర్ డిక్షనరీ ఇవ్వనున్నారు. ఎలాంటి రాజకీయ రంగులు, బొమ్మలు లేకుండా వీటిని పంపిణీ చేయనున్నారు. కిట్లను స్కూళ్లకు సకాలంలో సరఫరా చేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండల, స్కూల్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. కిట్‌లో ఉన్న వస్తువులను పర్యవేక్షించేందుకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు. నాణ్యతను పరిశీలించేందుకు క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో సర్వశిక్ష అభియాన్ ఒప్పందం చేసుకుంది. ప్రతి వస్తువును మూడంచెల్లో తనిఖీ చేసిన తరువాతే విద్యార్థులకు అందించనున్నారు. జిల్లాలో 1,74,015 విద్యామిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారికి తరువాత అందించనున్నారు.
Updated Date - Jun 12 , 2025 | 12:47 AM