వంశధార కాలువ కబ్జా
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:17 AM
మండలంలోని మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతుండడంతో దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు ఎక్కడాలేని డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా అక్రమార్కులు బరితెగిస్తున్నారు.
-లేఅవుట్‌గా మార్చేసిన వైనం
- ఓ రియల్టర్ బరితెగింపు
- అడిగితే మాజీ ఎమ్మెల్యే మనవడినంటూ బెదిరింపులు
సంతబొమ్మాళి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతుండడంతో దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు ఎక్కడాలేని డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా అక్రమార్కులు బరితెగిస్తున్నారు. చెరువులు, సాగునీటి కాలువలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి లేఅవుట్లగా మార్చేస్తున్నారు. వాటిని ప్రజలకు విక్రయిస్తూ కోట్లు దోచుకుంటున్నారు. ఓ రియల్టర్ మూలపేట పోర్టుకు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇజ్ఞవరం పంచాయతీలో వంశధార పిల్ల కాలువను కబ్జా చేసి లేఅవుట్‌గా మార్చేశాడు. దీనికి సుడా అనుమతులు కూడా లేవు. నౌపడ-టెక్కలి ప్రధాన రహదారిలోని నౌపడ రైల్వే గేటు సమీపంలో సర్వే నెంబరు 355-1ఈ, 355-1ఎఫ్‌లో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌వేసి అమ్మేసుకుంటున్నాడు. మెయిన్ రోడ్డు నుంచి లేఅవుట్‌లోకి రావడానికి మధ్యలో ఉన్న వంశధార పిల్ల కాలువను కబ్జా చేసి లేఅవుట్‌లో కలిపేశాడు. అంతటితో ఆగకుండా సాగునీరు ప్రవహించే కల్వర్టును కూడా కప్పేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో తమ పొలాలకు నీరెలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సదరు రియల్టర్‌ను అడిగితే తాను టెక్కలి మాజీ ఎమ్మెల్యే మనవడినంటూ బెదిరిస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్ వేసి దర్జాగా అమ్ముకుంటున్నా ఇటు పంచాయతీ అధికారులు గాని అటు సుడా అధికారులు గాని పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్టర్ మాజీ ఎమ్మెల్యే తాలుకా అని బెదిస్తుండంతో అధికారులు కూడా భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కలెక్టర్ స్పందించి అక్రమ లేఅవుట్‌పై చర్యలు తీసుకొని వంశధార కాలువను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
ఇజ్జవరం పంచాయతీలో వంశధార పిల్ల కాలువను కబ్జా చేయడంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. సంబంధిత రియల్టర్‌పై చర్యలు తీసుకుంటాం. ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం.
-శ్రీధర్, డీఈఈ, వంశధార, టెక్కలి
Updated Date - Jul 03 , 2025 | 12:17 AM