school books: వారికి మినహాయింపా?
ABN, Publish Date - Jul 11 , 2025 | 11:55 PM
Textbook burden Student stress ప్రభుత్వ నిబంధనలను కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థుల శరీర బరువులో రెండో వంతు పుస్తకాల సంచి మోస్తూ బడికి వెళ్లిరావడం అనారోగ్యానికి కారణమవుతుందని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి.
ప్రైవేటు విద్యాసంస్థల్లో తగ్గని పుస్తకాల భారం
ప్రభుత్వ పాఠశాలల్లోనే నిబంధనలు అమలు
టెక్కలి రూరల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనలను కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థుల శరీర బరువులో రెండో వంతు పుస్తకాల సంచి మోస్తూ బడికి వెళ్లిరావడం అనారోగ్యానికి కారణమవుతుందని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. విద్యావ్యవస్థలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పుస్తకాల బ్యాగ్‌ల బరువు తగ్గించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చారు. కాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల సంఖ్య తగ్గినా.. జిల్లాలోని చాలా ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పుస్తకాల బరువు తగ్గడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు, ఐదో తరగతుల విద్యార్థుల పుస్తకాల బ్యాగ్ బరువుపై ఎన్‌సీఈఆర్టీ ఇటీవల సర్వే చేసింది. సాధారణంగా విద్యార్థుల శరీర బరువు 18 నుంచి 22 కిలోలు ఉండగా, ప్రభుత్వ బడుల్లో పుస్తకాల బరువు 10 నుంచి 12 కిలోలు ఉన్నట్టు గుర్తించింది. ప్రైవేటు పాఠశాలల్లో 14 నుంచి 18 కిలోలు ఉన్నట్టు తేలింది. దీంతో ఈ ఏడాది నుంచి సెమిస్టర్ విధానం తీసుకురావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల బరువు ఐదు కిలోల లోపే ఉంది. ప్రైవేటు పాఠశాలలో మాత్రం పుస్తకాల బరువు తగ్గలేదు సరికదా.. ప్రతీ తరగతికీ పెరుగుతూనే ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10 తరగతి విద్యార్థులు(సీబీఎస్) 25 కిలోల నుంచి 35కిలోల వరకు పుస్తకాల బరువు మోస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థులకు ఒక పాఠ్యపుస్తకం, ఒక వర్క్‌బుక్ ఇస్తున్నారు. 3, 4, 5 తరగతులకు మొదటి సెమిస్టర్‌లో భాష సబ్జెక్టులన్నీ కలిపి ఒక పుస్తకం, వర్క్‌బుక్, ఇతర సబ్జెక్టులన్నీ మరో వర్క్‌బుక్‌గా అందజేశారు. అధికంగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ ఒక పుస్తకంగా ముద్రించడం వల్ల విద్యార్థులకు సులువు అయినట్టు చెబుతున్నారు. 6,7 తరగతులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ కలిపి ఒక పాఠ్యపుస్తకంగా అందజేశారు. గణితం, సైన్స్,సోషల్ పాఠ్యపుస్తకంగా ఇచ్చారు. 8,9 తరగతులకు భాషా పాఠ్యాంశం ఒకటి, భౌతిక శాస్త్ర, జీవశాస్తం కలిపి ఒకటి, భూగోళ శాస్త్రం, రాజకీయశాస్త్రం,చరిత్ర కలిపి ఒక పుస్తకంగా చేశారు. 9 వతరగతికి అదనంగా వర్క్‌బుక్ ఇచ్చారు. 10 వతరగతి మాత్రం విడివిడిగా పుస్తకాలు ముద్రించి అందజేశారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల బరువు తగ్గించినా.. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం బరువు తగ్గడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
శారీరక, మానసిక సమస్యలు
బరువైన పుస్తకాల బ్యాగ్ మోస్తే.. పిల్లల్లో వెన్ను, కండరాల నొప్పులకు దారి తీసే ప్రమాదం ఉంది. శారీరక, మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అనారోగ్య కారణంగా చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుంది. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు.
- డా.పావని, వైద్యాధికారి, చాపర ఆరోగ్య కేంద్రం
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచే పుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం ప్రారంభించారు. పుస్తకాల బరువు పెంచిన ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.
- మల్లారెడ్డి పద్మనాభం, ఎంఈవో-2, మెళియాపుట్టి
Updated Date - Jul 11 , 2025 | 11:55 PM