ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ration problems: రేషన్‌ కావాలంటే.. 8 కి.మీ. వెళ్లాలి

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:54 PM

Ration shop distance గిరిజన ప్రాంతాల్లో రేషన్‌ సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్‌ దుకాణాలు దూరంగా ఉండడంతో కొండపై నుంచి కిందకు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.

కొండపై ఉన్న అడ్డివాడ గ్రామానికి రేషన్‌ సరుకులు తీసుకెళ్తున్న గిరిజనులు (ఫైల్‌)
  • కొండపై ఉన్న గిరిజనులకు తప్పని కష్టాలు

  • సిగ్నల్స్‌ సక్రమంగా లేక అవస్థలు

  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి

  • మెళియాపుట్టి మండలం అడ్డివాడ గ్రామంలో 36 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బందపల్లి జీసీసీ డిపోలో రేషన్‌ సరుకులు అందించేవారు. ప్రస్తుతం ఈ డిపో భవనం శిథిలావస్థకు చేరడంతో.. మరో కిలోమీటరు దూరంలో ఉన్న రామచంద్రపురం పాత రైతుభరోసా కేంద్రంలో రేషన్‌ సరుకులు అందజేస్తున్నారు. గత నెల నుంచి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ రద్దు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని అడ్డివాడ గిరిజనులు పేర్కొంటున్నారు. కొండపై ఉన్న తమ గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి నర్సింగపల్లి చేరుకుని, అక్కడి నుంచి ఆటోలో మరో నాలుగు కిలోమీటర్లు వెళ్లి రేషన్‌ సరుకులు తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. అక్కడ కూడా సిగ్నల్స్‌ సక్రమంగా లేకపోవడంతో రోజంతా నిరీక్షిస్తున్నామని పేర్కొంటున్నారు.

  • మెళియాపుట్టి మండలం కేరాశింగి, గూడ గ్రామాల్లో 83 కుటుంబాలు ఉన్నాయి. వీరు సైతం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డబారు జీసీసీ డిపోకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. రేషన్‌ బియ్యంతో కాలినడకన కొండలు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు.

  • మెళియాపుట్టి జూలై 9(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో రేషన్‌ సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్‌ దుకాణాలు దూరంగా ఉండడంతో కొండపై నుంచి కిందకు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ సరుకుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీని రద్దు చేసింది. డిపోల్లో రేషన్‌ డీలర్ల ద్వారా సరుకులు అందజేస్తోంది. మారుమూల గిరిజన గ్రామాల్లో జీసీసీ డిపోల ద్వారా రేషన్‌ సరుకులు ఇస్తోంది. కాగా, అక్కడ సిగ్నల్‌ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెట్లు, కిటికీలకు సెల్‌ఫోన్లు వేలాడదీసి.. అక్కడ నుంచి వైపై ద్వారా బయోమెట్రిక్‌ వేయిస్తున్నారు. కొన్ని సందర్భాలో సర్వర్‌ పనిచేయకపోవడంతో రోజంతా నిరీక్షణ తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 16 మండలాల్లో 676 గ్రామాలు ఉన్నాయి. మెళియాపుట్టి మండలంలో అడ్డివాడ, కేరాశింగి, గూడ, చందనగిరి, దబ్బగూడ తదితర గ్రామాలు కొండపై ఉన్నాయి. ఆయా గ్రామ గిరిజనులంతా రేషన్‌ సరుకుల కోసం కొండ దిగి ఆరేడు కిలోమీటర్లు రాకపోకలు సాగించాల్సిందే. హిరమండలం మండలంలో కిరిడివలస, బోంగిగూడ, మిర్రిగూడ గ్రామాలు కొండపై ఉన్నాయి. సారవకోట మండలంలో అశోకం, బురుజువాడ, గూడ, బోంతుగూడ గ్రామాల గిరిజనులు కూడా కొండపైనే జీవనం సాగిస్తున్నారు. కొత్తూరు మండలంలో అడ్డంగి, ఆర్తీతోపాటు మందస మండలంలో భావనసాయి, గుడ్డికోల, లతితపురం, మదనగుడ్డియాలి, కొండమేర గ్రామాలు కొండపై ఉన్నాయి. ఆయా గ్రామస్థులంతా రేషన్‌ సరుకులు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని, కొండపైనే రేషన్‌ సరుకులు అందించాలని కోరుతున్నారు.

  • ఈ విషయమై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద ప్రస్తావించగా.. ‘రేషన్‌ దుకాణాలు దూరంగా ఉండడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. వచ్చే నెల నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామ’ని తెలిపారు.

  • నిరీక్షిస్తున్నాం

  • రేషన్‌ సరుకుల కోసం కొండ దిగి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రాపురం జీసీసీ డిపోకు వెళ్లాం. ఉదయమంతా సర్వర్‌, సిగ్నల్‌ సమస్య కారణంగా నిరీక్షించాం. సాయంత్రానికి భోజనాలు లేక ఇబ్బంది పడుతూ కొండపై ఉన్న మా గ్రామానికి చేరుకున్నాం.

    - సవర గౌరమ్మ, అడ్డివాడ, మెళియాపుట్టి

  • బరువుతో ఎక్కలేక పోతున్నాం

  • కొండ పైకి రేషన్‌ సరుకులతో ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నాం. గ్రామం నుంచి కొండపై నాలుగు కిలోమీటర్లు నడిచి ఎక్కాల్సి వస్తోంది.

    - ఎస్‌.జమ్మయ్య, అడ్డివాడ

  • వాహనాల ద్వారా ఇవ్వాలి

  • కొండపై గ్రామాలకైనా వాహనాలు ద్వారా రేషన్‌ సరుకులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

    - గనేష్‌, అడ్డివాడ

  • చర్యలు తీసుకుంటాం

  • జీసీసీ డిపోలో సర్వర్‌తోపాటు సిగ్నల్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గిరిజన గ్రామాల్లోకి రేషన్‌ సరుకులు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశిస్తే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం.

    - నర్శింహులు, జీసీసీ మేనేజర్‌, పాతపట్నం

Updated Date - Jul 09 , 2025 | 11:54 PM