ఈ అక్షయపాత్ర.. మహిమగలదంట!
ABN, Publish Date - May 31 , 2025 | 12:13 AM
Fraud gang వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన పది మంది సభ్యులు. వారు ముఠాగా ఏర్పడి.. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా కొంతకాలం రైస్‌పుల్లింగ్ బిట్‌కాయిన్స్ పేరిట మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఓ అక్షయపాత్ర(ఇత్తడి చెంబు)ను చూపించి.. అది మహిమగలదని చెబుతూ.. ఇంట్లో ఉంటే సంపద మరింత పెరుగుతుందని ఆశ చూపి.. దానిని రూ.లక్షల్లో విక్రయిస్తూ బురిడీ కొటిస్తున్నారు. కొంతకాలంగా సాగుతున్న వారి ఆటలకు ఎట్టకేలకు చెక్ పడింది.
రైస్‌పుల్లింగ్ పేరిట మోసాలు
పోలీసులకు పట్టుబడిన 10 మంది నిందితులు
రూ.5లక్షల నగదు, మూడు కార్లు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం
సరుబుజ్జిలి, మే 30(ఆంధ్రజ్యోతి): వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన పది మంది సభ్యులు. వారు ముఠాగా ఏర్పడి.. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా కొంతకాలం రైస్‌పుల్లింగ్ బిట్‌కాయిన్స్ పేరిట మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఓ అక్షయపాత్ర(ఇత్తడి చెంబు)ను చూపించి.. అది మహిమగలదని చెబుతూ.. ఇంట్లో ఉంటే సంపద మరింత పెరుగుతుందని ఆశ చూపి.. దానిని రూ.లక్షల్లో విక్రయిస్తూ బురిడీ కొటిస్తున్నారు. కొంతకాలంగా సాగుతున్న వారి ఆటలకు ఎట్టకేలకు చెక్ పడింది. సరుబుజ్జిలి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానందతో కలిసి వెల్లడించారు. ‘సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస నుంచి రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో కుడివైపున పాడుపడిన బంగ్లా వద్ద పురాతన రైస్‌పుల్లింగ్ అక్షయపాత్ర(ఇత్తడి చెంబు) క్రయవిక్రయాలు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఈ మేరకు సరుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి గురువారం తన సిబ్బందితో అక్కడ వెళ్లి దాడులు చేశారు. ఆ సమయంలో ఓ అక్షయపాత్రతో బియ్యాన్ని ఆకర్షించేలా చేసి.. అది మహిమ గలదంటూ ముఠా సభ్యులు చెప్పి.. రూ.23లక్షలకు దానిని విక్రయించేందుకు బేరసారాలు చేస్తున్నారు. అడ్వాన్స్‌గా రూ.5లక్షలు తీసుకున్నారు. అదే సమయంలో పోలీసులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ పదిమందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించాం. అక్షయపాత్రతోపాటు రూ.5లక్షల నగదు, సెల్‌ఫోన్లు, కార్లు సీజ్ చేశామ’ని ఏఎస్పీ కేవీ రమణ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఆమదాలవలస సీఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐ ఎస్.బాలరాజు, సరుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి, పోలీస్ సిబ్బందిని అభినందించారు.
నిందితులు వీరే..
జిల్లాకు సంబంధించి రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన పూని భద్రయ్య, పూణేరాజు, నరసన్నపేట మండలం కిల్లాడ గ్రామానికి చెందిన నెక్కిన రఘునాఽథరావు, ఎల్.ఎన్.పేట మండలం బొర్రంపేట గ్రామానికి చెందిన కుప్పిలి భాస్కరరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు విశాఖపట్నంలో మఽధురవాడకు చెందిన పచ్చితల రవిశంకర్, రుద్రరాజు వెంకట రంగరాజు, పెద్దగంట్యాడకు చెందిన రౌతు కనకరాజు, తిరుపతి జిల్లా చెట్టివారిపాలెం గ్రామానికి చెందిన గట్టెక్కల మురళీకృష్ణ, హైదరాబాద్‌కు చెందిన గరికి శ్రీను, పీఠాపురానికి చెందిన కొండ శ్రీ వెంకటనాగ సత్యనారాయణను కూడా రైస్‌పుల్లింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా సరుబుజ్జిలి సమీపంలో రైస్ పుల్లింగ్ ముఠా సంచరిస్తున్న విషయం బయటపడడంతో గ్రామీణప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, రణసలం మండలాలతో పాటు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, హైదరాబాద్ మహా పట్టణాలకు చెందిన వ్యక్తులు కూడా ఇక్కడ ముఠాగా ఏర్పడి ఇటువంటి చర్యలు చేపడుతున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - May 31 , 2025 | 12:13 AM