Former Minister Seediri Appalaju: పోలీస్ స్టేషన్‌లో సీదిరి హల్‌చల్
ABN, Publish Date - May 27 , 2025 | 12:12 AM
Former Minister Seediri Appalaju: వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివారం సాయంత్రం హల్‌చల్ చేశారు.
-సీఐ తిరుపతిరావుతో వాగ్వాదం
- అరుపులు, కేకలతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు
- మాజీ మంత్రి తీరుపై విమర్శలు
వజ్రపుకొత్తూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివారం సాయంత్రం హల్‌చల్ చేశారు. ఓ విషయమై సీఐ తిరుపతిరావుతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆయనకు తోడుగా వైసీపీ శ్రేణులు అరుపులు, కేకలతో రెచ్చిపోయారు. మండలంలోని గరుడుభద్ర గ్రామంలో ఆవుల శాల విషయమై స్థానిక టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తగదా చోటుచేసుకుంది. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు టీడీపీ, వైసీపీ నేతలను విచారిస్తుండగా, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అప్పలరాజు వైసీపీ నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న సీఐ తిరుపతిరావుతో వాగ్వాదానికి దిగారు. సీఐ కూడా మంత్రికి దీటుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు కూడా అరుపులు, కేకలతో రెచ్చిపోయారు. ఓ చిన్న విషయమై మాజీ మంత్రి సీదిరి పోలీసు స్టేషన్‌కు వచ్చి సీఐతో గొడవకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ చీపురుపల్లి పంచాయతీకి చెందిన వైసీపీ సోషల్ మీడియాకు చెందిన యువకుడ్ని పోలీసుస్టేషన్‌కు విచారణకు పిలవగా, అప్పుడు కూడా అప్పలరాజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. తాజాగా, సీఐ తిరుపతిరావుతో గొడవకు దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.
Updated Date - May 27 , 2025 | 12:12 AM