ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

cesareans: అమ్మ కడుపు ‘కోత’

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:19 AM

Cesarean Deliveries జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు ధనర్జానే ధ్యేయంగా సిజేరియన్లు చేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి వీలున్నప్పటికీ కాసుల కోసం గర్భిణుల కడుపు కోసేస్తున్నారు. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డంగా తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకొట్టోందని గర్భిణులను, వారి కుటుంబ సభ్యులను భయపెడుతున్నారు.

  • జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్ల సంఖ్య

  • తగ్గుతున్న సాధారణ ప్రసవాలు

  • ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే అధికం

  • కాసుల కోసం అవసరం లేకున్నా ఆపరేషన్లు

  • అరసవల్లి, ఏప్రిల్‌ 22 (ఆంద్రజ్యోతి): జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు ధనర్జానే ధ్యేయంగా సిజేరియన్లు చేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి వీలున్నప్పటికీ కాసుల కోసం గర్భిణుల కడుపు కోసేస్తున్నారు. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డంగా తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకొట్టోందని గర్భిణులను, వారి కుటుంబ సభ్యులను భయపెడుతున్నారు. దీంతో వారు శస్త్రచికిత్సకు అంగీకరిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం మంచి ముహూర్తాలు చూసుకుని కోరుండి సిజేరియన్‌ చేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం లేక చాలామంది గర్భిణులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా అవసరం లేకపోయినా వారికి ఆపరేషన్లు చేసేస్తున్నారు. మరోపక్క జిల్లాలో ఆడపిల్లల జననాల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్కానింగ్‌ సెంటర్లలో ఏమైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • జిల్లాలో ఇదీ పరిస్థితి..

  • జిల్లాలో 2024-2025 ఏడాదికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 28,993 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,289, ప్రైవేటు ఆసుపత్రుల్లో 18,704 నిర్వహించారు. సాధారణ ప్రసవాలకు సంబంధించి ప్రభుత్వాసుపత్రుల్లో 4,717 (46శాతం), ప్రైవేటులో కేవలం 2,466 (13శాతం) మాత్రమే జరిగాయి. సిజేరియన్లకు సంబంధించి ప్రభుత్వాసుపత్రుల్లో 5,605 (54శాతం), ప్రైవేటు ఆసుపత్రుల్లో 16,058 (87శాతం) నిర్వహించారు. సకల సదుపాయాలు, ఎంతో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉండే ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక శాతం సాధారణ ప్రసవాలు జరగాల్సి ఉంది. కానీ, కాసుల కోసం సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వచ్చే గర్భిణులను, వారి సహాయకులను ముందుగానే వైద్యులు సిజేరియన్‌ కోసం మానసికంగా సిద్ధం చేస్తున్నారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందనో.. లేదా ఆపరేషన్‌ చేయకపోతే తల్లి, బిడ్డ ప్రాణాలకు ప్రమాదకరమనో...ఇలా భయపెడుతూ ఆపరేషన్‌ చేసి మరీ ప్రసవాలు కానిచ్చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి కేవలం రూ. 15వేలు మాత్రమే వసూలు చేస్తే, అదే సిజేరియన్‌ చేస్తే రూ. 50వేల నుంచి రూ.80వేల వరకు రోగులకు ఖర్చవుతుంది. భయంతోనో, వైద్యునిపై నమ్మకంతోనో, అధిక శాతం ఇటువంటి ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే, కొందరు తల్లిదండ్రులు ముందుగానే ముహూర్తాలు నిర్ణయించుకుని, ఆ సమయంలోనే ఆపరేషన్‌ చేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వైద్యులు సిజేరియన్‌ చేసి శిశువులను బయటకు తీస్తున్నారు. అదే విధంగా కొందరు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆర్‌ఎంపీలు కమీషన్లకు ఆశ పడి గర్భిణులను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళుతున్నారు. దీంతో ఎక్కువ ప్రసవాలు సిజేరియన్‌ పద్ధతిలోనే జరుగుతున్నాయి.

  • ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకమేదీ?

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంచుమించుగా సగానికి సగం ప్రసవాలు సాధారణంగానే జరుగుతున్నాయి. పేదలు, సామాన్యులు, అలాగే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు ప్రసవాల కోసం ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అటువంటి కేసుల్లో కూడా సగం ప్రసవాలు సాధారణ పద్ధతిలోనే జరుగుతుండడం విశేషం. అయినా సరే అధిక శాతం ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీనికి ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై నమ్మకం లేకపోవడమే కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించి, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామాలు, పట్టణాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నమోదు చేస్తున్న గర్భిణుల డేటాను జిల్లా కేంద్ర ఆసుపత్రి, సీహెచ్‌సీలు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయాలతో అనుసంధానించి, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. సాధారణ ప్రసవాల గురించి, వైద్యులు అందించే సేవలపై ప్రజలకు పూర్తిగా తెలియజేసి, వారిలో నమ్మకం కలిగిస్తే, రానున్న రోజుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దిశగా అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • తగ్గుతున్న ఆడపిల్లల జననాలు..

  • జిల్లాలో గత ఏడాది ఆడపిల్లల జననాల సంఖ్య తక్కువగా నమోదైంది. 2024-25 సంవత్సరానికి గాను మగపిల్లలు 15,457 మంది, ఆడపిల్లలు 13,536 మంది జన్మించారు. అంటే ఆడ శిశువులు 1921 తక్కువగా ఉన్నాయి. సుమారు 9 శాతం తక్కువగా నమోదైంది. ఒక దశాబ్ద కాలంపాటు ఈ సంఖ్య ఇలాగే కొనసాగితే రానున్న తరానికి ఇబ్బందులు తప్పవు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆడపిల్లల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటిస్తూ ‘బేటీ బచావో...బేటీ పడావో’ అంటుంటే, జిల్లాలో మాత్రం ఆడశిశువుల జననాలు తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి గల కారణాలను అధికారులు విశ్లేషించాలని, స్కానింగ్‌ కేంద్రాల్లో ఏమైనా లింగనిర్థారణ పరీక్షలు చేస్తున్నారా? అన్నది తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:19 AM