accidents: హైవే నెత్తురోడుతోంది
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:35 AM
accidents: జాతీయ రహదారి-16 ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రతిరోజూ ఏదోఒక చోట ప్రమాదాలు సంభవించి ప్రజలు మృత్యువాత పడుతున్నారు.
- జాతీయ రహదారిపై పెరుగుతున్న ప్రమాదాలు
- జేఆర్‌పురం సర్కిల్‌లో అధికం
- ఐదు నెలల్లో 20 మంది మృతి
- వంతెనలు, సర్వీసు రోడ్ల వద్ద కానరాని సూచికలు
- చాలా చోట్ల వెలగని విద్యుత్ దీపాలు
గత నెల 10న రణస్థలం మండలం పైడిభీమవరం నుంచి లావేరు మండలం బెజ్జిపురం మధ్య జాతీయ రహదారిపై మూడు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు.
గత నెల 3న ఎచ్చెర్ల బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో టీడీపీ నాయకుడు అడపా శ్రీను మృతిచెందాడు. ద్విచక్ర వాహనంపై సింహాచలం అనే వ్యక్తితో కలిసి ఇంటికి వెళుతుండగా ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో శ్రీను ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. సింహాచలం చికిత్సపొందుతూ మరుసటి రోజు ఆస్పత్రిలో కన్నుమూశాడు.
మార్చి 15న లావేరు మండలం బుడుమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. కారు టైరు పేలడంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రణస్థలం, మే 31 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి-16 ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రతిరోజూ ఏదోఒక చోట ప్రమాదాలు సంభవించి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా రణస్థలం మండలం పైడిభీమవరం నుంచి ఎచ్చెర్ల మధ్య అధికంగా ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జేఆర్‌పురం సర్కిల్ పరిధిలోనే ప్రమాద కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ రోడ్డు ప్రమాదాల్లో 20 మంది చనిపోయారు. జిల్లాలో సుదీర్ఘ జాతీయ రహదారి ఉంది. రణస్థలం మండలం పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకూ 197 కిలోమీటర్ల మేర హైవే విస్తరించి ఉంది. పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకూ ఆరులైన్ల రహదారి 57 కిలోమీటర్ల మేర ఉంది. నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకూ విస్తరించాల్సి ఉంది. రహదారి విస్తరణలో భాగంగా పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకూ 30 వంతెనలు నిర్మించారు. పరిమిత సంఖ్యలో యూటర్న్‌లు ఏర్పాటు చేశారు. ఈ యూటర్నుల వద్ద గ్రామాల పేర్లను సూచించే బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు అయోమయానికి గురై ముందుకు వెళ్లిపోతున్నారు. కొంతదూరం వెళ్లిన తరువాత దారి తప్పిపోయామని గుర్తించి రాంగ్ రూట్‌లో వెనక్కి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు.
57 ప్రమాద స్పాట్లు..
ప్రమాదాలు నియంత్రించడానికి, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకే జాతీయ రహదారిని విస్తరించారు. కానీ, రోడ్డు విస్తరణ తరువాత ప్రమాదాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాహనాల అతివేగం, వేగ నియంత్రణ చర్యలు, పోలీసుల తనిఖీలు లేకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో జాతీయ రహదారిపై 57 ప్రమాద స్పాట్లను గుర్తించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులు సైతం గుర్తించారు. సర్వీసు రోడ్లు ప్రారంభం, ముగింపుల వద్ద భారీ బోర్డులు కనిపించేలా ఏర్పాట్లు చేయడం లేదు. చిన్నపాటి బోర్డులు ఏర్పాటు చేయడంతో వాహనదారులు గుర్తించడం లేదు. అందుకే జిల్లా వ్యాప్తంగా హైవేపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
వెలగని విద్యుత్ దీపాలు
జిల్లాలో జాతీయ రహదారికి సంబంధించి నరసన్నపేట వరకూ మాత్రమే ఆరు లైన్లగా విస్తరించారు. దాదాపు 30 వంతెనల వద్ద, గ్రామాలకు వెళ్లే సర్వీసు రోడ్ల వద్ద దాదాపు 900 విద్యుత్ స్తంభాలను ఏర్పాటుచేశారు. వాటికి ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఇవి బాగానే వెలిగాయి. తరువాత నిర్వహణ బాగా లేకపోవడంతో వెలగడం మానేశాయి. రణస్థలంలో అయితే రోడ్డు మధ్యలో వేసిన విద్యుత్ స్తంభం పక్కను ఒరిగిపోయింది. ఎప్పుడు రోడ్డుపై పడుతుందో తెలియని పరిస్థితి. బుడుమూరు, సుభద్రాపురం, తాళ్లవలస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం సింహద్వారం, పెద్దపాడు, సింగుపురం, మడపాం వద్ద పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. చాలాచోట్ల ఈ ధీపాలకు సంబంధించి ఏర్పాటుచేసిన ఫ్యూజు బాక్సులు సైతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికైనా జాతీయ రహదారి విభాగం అధికారులు స్పందించి వంతెనలు, సర్వీసు రోడ్ల వద్ద సూచికబోర్డులు, విద్యుత్ దీపాలు వేయాల్సిన అవసరంఉంది.
ప్రత్యేక దృష్టి సారించాం
జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. పెట్రోలింగ్ పెంచుతున్నాం. స్వీయ రక్షణ, భద్రతతోనే ప్రమాదాలు నియంత్రించగలుగుతాం. ఈ విషయంలో ప్రజల సహకారం కూడా ఉండాలి. అప్పుడే ప్రమాదాలు నియంత్రణలోకి వస్తాయి. పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదు. మద్యం తాగి వాహనాలు నడుపరాదు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
-ఎం.అవతారం, సీఐ, జేఆర్‌పురం సర్కిల్
Updated Date - Jun 01 , 2025 | 12:36 AM