Cultivation of plants: తీరం..ఇక సురక్షితం!
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:16 PM
Cultivation of plants: తీర ప్రాంత పరిరక్షణపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 973 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున వనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
- కోతకు గురికాకుండా వనాలు
- మొక్కల పెంపకానికి ప్రభుత్వ నిర్ణయం
- రేపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం
- ప్రతి 10 కిలోమీటర్లకు ఒక నర్సరీ
- అటవీ, ఉపాధి హామీ శాఖలకు బాధ్యతలు
రణస్థలం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తీర ప్రాంత పరిరక్షణపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 973 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున వనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. తీరం వెంబడి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీతో పాటు అటవీ శాఖ నిధులతో వీటిని ఏర్పాటుచేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొక్కల పెంపకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో జిల్లాకు మహర్దశ పట్టనుంది.
ఎందుకంటే జిల్లాల విభజన తరువాత సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా మనదే. దీంతో తీర ప్రాంతంలో మొక్కల పెంపకంతో బహుళ ప్రయోజనాలు ఉండనున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో పనులు చేపట్టనుండడంతో మత్స్యకారులకు ఉపయోగపడనుంది. వారికి వేటతో పాటు ఉపాధి పనులు కూడా చేసుకునే వెసులబాటు కలగనుంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న 973 కిలోమీటర్ల తీర ప్రాంతంలో దాదాపు 28.7 శాతం భూభాగం కోతకు గురైనట్టు గత ఏడాది ఆగస్టులో కేంద్ర భూ భౌతిక విజ్ఞాన శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 25.12 కిలోమీటర్ల తీర ప్రాంతం రెడ్ జోన్ లో ఉన్నట్టు తేలడం ఆందోళన కలిగించే విషయం. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ వనాల పెంపునకు నిర్ణయం తీసుకుంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ 193 కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్టు గణంకాలు చెబుతున్నాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో వందలాది మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో బాహుదా, మహేంద్రతనయా, వంశధార, నాగావళి నదులు సముద్రంలో కలుస్తున్నాయి.
నదుల సంగమం వద్ద ఏటా వరదలు పోటెత్తుతుండడంతో తీరం కోతకు గురవుతోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం లేకపోవడం, నీటి స్థిరీకరణకు అవకాశం లేకపోవడం, కరకట్టల నిర్మాణం చేపట్టకపోవడంతో నీటి ప్రవాహ గమనం పెరిగి ఒకేసారి సముద్రంలోకి నీరు పోటెత్తుతోంది. అదే సమయంలో సముద్రం ఉగ్రరూపం దాల్చుతుండడంతో తీరం కోతకు గురవుతోందని సముద్ర నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా సముద్రంలో నదులు కలిసే ప్రాంతంలో తీరం కోతకు గురవుతోంది. శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, పోలాకి, సోంపేట, మందస, ఇచ్ఛాపురం, కవిటి తీరంలోనే కోత అధికంగా కనిపిస్తోంది.
తీర ప్రాంతం కోతకు ఉష్ణ మండల తుఫాన్లు రుతుపవనాల సీజన్లో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, పోర్టులు, హార్బర్ల నిర్మాణం, మడ అడవుల నరికివేత, సముద్ర జలాలు కలుషితం కావడం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల కలయికతో సముద్ర జలాల అమ్లీకరణ వంటివి కారణాలుగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అందుకే వనాల పెంపుతో వాటికి చెక్ చెప్పాలని భావిస్తున్నారు.
మండలానికి ఒక నర్సరీ..
ఏ జిల్లాకు అనుగుణం ఆ జిల్లాలో ఉపాధి, అటవీశాఖ ద్వారా వనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన జిల్లా తీర ప్రాంతం సరుగుడు, నీలగిరికి అనుకూలమని తేలింది. టెక్కలి డివిజన్‌లో తీరంలో కొబ్బరి, జీడి సాగు అధికంగా ఉంది. ఇవి తీరం కోతకు గురికాకుండా రక్షణగా నిలుస్తున్నాయి. అయితే ప్రభుత్వం తాజాగా తీర ప్రాంతంలో ప్రతి 10 కిలోమీటరుకు ఒక నర్సరీని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. జిల్లాలో 11 తీర మండలాలు ఉన్నాయి. ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటిచొప్పున ఏర్పాటుచేయాలంటే 19 నర్సరీలు ఏర్పాటుచేయాలి. కానీ మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
మంచి నిర్ణయం..
కూటమి ప్రభుత్వానిది మంచి నిర్ణయం. తీర ప్రాంత పరిరక్షణకు పెద్దపీట వేయడం శుభ పరిణామం. జిల్లాలో తీర ప్రాంతంలో సరుగుడు, నీలగిరి తోటలు ఉండేవి. ఇవి తీరం కోతకు గురికాకుండా రక్షణ కవచంలా నిలిచేవి. తీరానికి సీఆర్‌జడ్ పరిధి 500 మీటర్ల వరకూ ఉంటుంది. ఇక్కడ చెట్లు పెంచితే అలల ఉధృతి తగ్గుముఖం పడుతుంది. వృక్షాల వేర్లు తీరానికి బలమైన అండగా నిలుస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోట ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. తీరం వెంట రాతికట్టడాలు ఉంటే మరింత శ్రేయస్కరం.
-దన్నాన స్వామినాయుడు, భూగర్భ శాస్త్రవేత్త, రణస్థలం.
శుభ పరిణామం..
తీర ప్రాంత రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం శుభ పరిణామం. సముద్ర జలాల్లో విపరీతమైన వ్యర్థాలు కలుస్తున్నాయి. రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి పైపులైన్ల ద్వారా విడిచిపెడుతున్నారు. జీరో కాలుష్యంగా మార్చి వ్యర్థాలను విడిచిపెట్టాలి. కానీ అలా జరగడం లేదు. అందుకే సముద్రం ఉగ్రరూపం దాల్చుతోంది. మత్స్యసంపద నశిస్తోంది. సముద్రం ఇసుకను అక్రమంగా తరలించడం కూడా కోతకు గురికావడానికి ప్రధాన కారణం.
-కూన రామం, పర్యావరణవేత్త, బుడుమూరు
రెండుశాఖల సమన్వయంతో..
జిల్లాలో తీర ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తీరం వెంబడి 50 వేలు సరుగుడు, 50 వేలు తాటి టెంకలు నాటనున్నాం. ప్రజల జీవనోపాధి పెంచడం, ఆపై తీర ప్రాంతాన్ని విపత్తుల నుంచి రక్షించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. జిల్లాలో 193 కిలోమీటర్ల పరిధిలో మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ విషయంలో అటవీ, ఉపాధి శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతాయి.
- ఎస్.వెంకటేశ్వరరావు, డీఎఫ్‌వో, శ్రీకాకుళం
Updated Date - Jun 03 , 2025 | 11:16 PM