Tharmal Movement: థర్మల్ ఉద్యమం.. చరిత్రలో నిలిచే పోరాటం
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:52 PM
environmental struggle ‘సోంపేట పరిసర ప్రాంతాల్లో థర్మల్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం. ప్రజావ్యతిరేఖ నిర్ణయాలు తీసుకునేవారికి ఇదొక చెంపపెట్టుగా నిలుస్తుంద’ని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, పలువురు వక్తలు పేర్కొన్నారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలి
329 జీవో రద్దు చేయాలి
సినీనటుడు ఆర్.నారాయణమూర్తి
సోంపేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘సోంపేట పరిసర ప్రాంతాల్లో థర్మల్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం. ప్రజావ్యతిరేఖ నిర్ణయాలు తీసుకునేవారికి ఇదొక చెంపపెట్టుగా నిలుస్తుంద’ని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం బారువలో థర్మల్ అమరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద సినీనటుడు ఆర్.నారాయణమూర్తితో కలిసి ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తదితరులు నివాళి అర్పించారు. మొక్కలు నాటారు. అనంతరం ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘థర్మల్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. థర్మల్ జీవోను రద్దు చేసినా, ఇంకా 329జీవో పేరుతో పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేయత్నం జరుగుతోంది. ప్రభుత్వం ఈ జీవోను కూడా రద్దు చేయాలి. వ్యవసాయానికి ఆమోదయోగ్యమైన భూముల్లో పరిశ్రమలు పెటరాదనే సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలి. థర్మల్ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలి. ఉద్యమాల గెడ్గగా పేర్కొందిన ఉత్తరాంధ్రలో పంటలు సస్యశ్యామలంగా పండేలా ప్రణాళికలు రూపొందించాలి. పోలవరం ఎడమ కాలువ ద్వారా నాగావళి, వంశధార, శబరి, తాండవ, కోస్తని, జంఝావతి నదులు అనుసంధానం చేసి నీరందించాలి. ఇందుకోసం పోలవరం డ్యామ్ ఎత్తు 45 అడుగులకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలి. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయబోమని ప్రకటించాల’ని కోరారు.
ప్రముఖ కవి జయరాజ్ మాట్లాడుతూ సోంపేట ఉద్యమంతో పర్యావరణం ప్రాముఖ్యత ప్రతిఒక్కరికీ తెలిసిందన్నారు. భూమిని కాపాడుకొనేందుకు ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు. హ్యమన్ రైట్స్ ప్రతినిధి వీఎస్ కృష్ణ మాట్లాడుతూ సోంపేట ఉద్యమంతోనే మాలాంటి సంస్థలు ప్రజలు ఎన్నో విషయాలు తెలుసుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణం పేరిట భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే వ్యూహం జరుగుతోందన్నారు. ఎయిర్‌పోర్టు వస్తే.. ఇక్కడ కిడ్నీవ్యాధులు నశిస్తాయా? అని ప్రశ్నించారు. ఈ ప్రాంతవాసులకు సాగు, తాగునీరు అందించాలని కోరారు. అనంతరం పర్యావరణం పరిరక్షణ కోసం అందరూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణసమితి అధ్యక్షుడు వై.కృష్ణమూర్తి, కేవీ జగన్నాథం, బారువ సర్పంచ్ యర్ర రజనీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్ పాల్గొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:52 PM