‘తల్లికి వందనం’.. అంద‘కొండా’!
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:05 AM
Tribal welfare Government scheme exclusion పలాస మండలం శివారున ఉన్న గిరిజన గ్రామం సవరరామకృష్ణాపురం విద్యార్థుల తల్లులందరిదీ ఇదే పరిస్థితి. గ్రామంలో మొత్తం 10మంది విద్యార్థులు పెదంచల పాఠశాలలో చదువుతుండగా, అందులో కేవలం ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే తల్లికి వందనం పథకం నిధులు జమయ్యాయి.
లేని భూములు రికార్డుల్లో నమోదు
వైసీపీ హయాంలో రీసర్వే తెచ్చిన తంటా
సవరరామకృష్ణాపురంలో గిరిజనులకు వర్తించని పథకం
కొండ స్థలాన్ని చూపి.. అనర్హత వేటు
పలాస మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లులకు బ్యాంకు ఖాతాకు నగదు జమైంది. కానీ, సవర రామకృష్ణాపురానికి చెందిన సవర లావణ్యకు మాత్రం డబ్బులు ఇంకా రాలేదు. సమీపంలోని సచివాలయానికి వెళ్లి ఆరా తీయగా 10 ఎకరాల జిరాయితీ స్థలం ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తోందని, అందుకే ‘తల్లికి వందనం’ పథకానికి అనర్హులని తెలిపారు. తనకు పోరంబోకు స్థలం రెండు ఎకరాలు ఉంటే.. జిరాయితీగా చూపించి మొత్తం పథకాన్ని రద్దు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
..............
సవర రామకృష్ణాపురానికి చెందిన సవర చామంతికి గ్రామంలో 25 సెంట్లు స్థలం ఉండగా.. రికార్డుల్లో 76 ఎకరాలుగా చూపిస్తోంది. దీంతో పిల్లలు అఖిల్, పవిత్రకు రావాల్సిన తల్లికి వందనం పథకం నిధులు జమ కాలేదు. సర్వే సిబ్బంది చేసిన తప్పులకు తాము ప్రభుత్వ పథకాన్ని కోల్పోయామని ఆవే వ్యక్తం చేస్తోంది. దీనిపై విచారణ చేసి గ్రామంలో విద్యార్థుల తల్లులందరికీ పథకం వర్తింపజేయాలని వేడుకుంటోంది.
పలాస/పలాస రూరల్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): పలాస మండలం శివారున ఉన్న గిరిజన గ్రామం సవరరామకృష్ణాపురం విద్యార్థుల తల్లులందరిదీ ఇదే పరిస్థితి. గ్రామంలో మొత్తం 10మంది విద్యార్థులు పెదంచల పాఠశాలలో చదువుతుండగా, అందులో కేవలం ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే తల్లికి వందనం పథకం నిధులు జమయ్యాయి. మిగిలినవారందరికీ భూములు ఎక్కువగా ఉన్నాయని సాకు చూపిస్తూ పథకానికి అనర్హత వేటు వేశారు. వాస్తవానికి ఇక్కడున్న గిరిజన ప్రజలందరికీ కలిపి 50 ఎకరాలు కూడా లేకపోగా, ఒకొక్కరికీ 10 నుంచి 75 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తూ అనర్హత వేటు వేయడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తాము నిరక్ష్యరాస్యులమని, తమకు అధికంగా భూములు ఉన్నట్టు రికార్డుల్లో చూపడం అన్యాయమని గిరిజనులు వాపోతున్నారు. అసలు తల్లికి వందనం పథకం వర్తిస్తుందో? లేదోనని కలవరపడుతున్నారు.
వైసీపీ పాలనలో సరే ్వ తెచ్చిన ముప్పు
సవరరామకృష్ణాపురం గ్రామం మొత్తం సర్వేనెంబరు 527లో ఉన్న గుంపంకొండ దిగువున ఉంది. 207 ఎకరాల్లో విస్తరించిన ఈ కొండపై 25 ఏళ్ల కిందట ఇక్కడ నివాసం ఉంటున్న గిరిజనుల జీవనభృతికి అప్పటి ఐటీడీఏ అధికారులు 37 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందించారు. అందులో పోడు వ్యవసాయం, వర్షాకాలంలో జొన్నలు, చోళ్లు వేసుకొని బతుకుతుంటారు. పల్లం భూములు నామమాత్రంగా ఉండడంతో వాటిలో వరి పండిస్తు వారి అవసరాలకు మాత్రమే వినియోగించుకొని జీవిస్తున్నారు. వైసీపీ పాలనలో (2020 సెప్టెంబరులో) సాధికార సర్వే నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం దీన్ని అప్పట్లో ప్రయోగాత్మకంగా నిర్వహించినా అనేక తప్పులు దొర్లాయి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో ఇటువంటి సర్వేల వల్ల రైతులు చిక్కులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సవరరామకృష్ణాపురంలో సర్వే నిర్వహించినప్పుడు గుంపంకొండ విస్తీర్ణం మొత్తం గ్రామంలో కలబోసి వారికి ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీనిపై గిరిజనుల్లో అవగాహన లేకపోవడంతో తమ భూములు మాత్రమే రికార్డుల్లో ఉన్నాయని, అవి కూడా బంజరు భూములు కావడంతో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని వారంతా భావించారు. చివరకు తల్లికివందనం పథకం అమలులోకి వచ్చింది. వారి వివరాల ప్రకారం స్థానిక సచివాలయ సిబ్బంది రికార్డులు పంపించారు. తీరా అందులో లేని భూముల రికార్డులు గిరిజనుల పేర్లుతో నమోదు కావడంతో మొత్తం పథకానికే అనర్హతగా జాబితాలో కారణం చూపారు. విషయం తెలుసుకొని గిరిజన మహిళలంతా స్థానిక పెదంచల సచివాలయానికి వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో అమ్మవడి పథకం వచ్చినప్పుడు ఇవేవీ తమకు అడ్డురాలేదని పేర్కొంటున్నారు. సంక్షేమ పథకం అమలులో గిరిజనులపై ఎందుకంత కక్షసాధింపో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకం వర్తింపజేసేలా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై సచివాలయం వేల్ఫేర్ అధికారి షేక్‌తాజ్ వద్ద ప్రస్తావించగా.. ‘సర్వే ఏ విధంగా చేశారో మేము పరిశీలించలేదు. రికార్డుల్లో అధిక భూములు ఉన్న కారణంగా సవరరామకృష్ణాపురంలోని గిరిజనులు తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. దీనిపై మేము గ్రీవెన్స్‌లో నమోదు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.
Updated Date - Jun 24 , 2025 | 12:05 AM