Talliki vandanam: వీరికి నిరాశ
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:58 PM
Talli ki Vandanam scheme.. Beneficiary complaints జిల్లాలో చాలామంది కి అర్హత ఉన్నా తల్లికి వందనం పథకం వర్తించకపోవడంతో ఆయా మహిళలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో తల్లికి వందనం పథకం కింద 2,28,659 విద్యార్థులకు సంబంధించి.. 1,52,563 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఇటీవల రూ.13వేల చొప్పున నగదు జమ చేసింది.
కొంతమందికి అందని ‘తల్లికి వందనం’ డబ్బులు
300 యూనిట్లు విద్యుత్ వినియోగించారంటూ అనర్హత
బిల్లుల రశీదులో 200 యూనిట్లలోపు వినియోగం
ఆధార్ అనుసంధానంతోనే అసలు ఇబ్బందులు
సరిచేయాలని ప్రభుత్వానికి బాధితుల వేడుకోలు
రణస్థలం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన సూరాడ దీప్తికి ఇద్దరు పిల్లలు. కొవ్వాడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకంలో ఆమెను అనర్హులుగా తేల్చారు. ఆమె పేరిట ఉన్న విద్యుత్ మీటరు ద్వారా నెలకు 300 యూనిట్లు వినియోగిస్తుండడంతో అనర్హత వేటు వేశారు. కాగా తాము ఎప్పుడూ అంత విద్యుత్ వినియోగించలేదని ఆమె చెబుతోంది. సచివాలయానికి వెళ్లి అడగ్గా.. విద్యుత్ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. అక్కడికి వెళితే సచివాలయానికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో అర్హత ఉన్నా తమకు పథకం వర్తించడం లేదని ఆమె లబోదిబోమంటోంది.
జీరుపాలేం గ్రామానికి చెందిన అంబటి ఎర్రమ్మ అదే పరిస్థితి. ఆమెకు సైతం తల్లికి వందనం జమకాలేదు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు వినియోస్తున్నట్లు చూపిస్తోంది. కాగా.. తాము రేకులు షెడ్‌లో ఉంటున్నామని, గతంలో అమ్మ ఒడి పథకం వర్తించిందని.. ఇప్పుడు మాత్రం కొర్రీలు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
రణస్థలం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలామంది తల్లులది ఇదే పరిస్థితి. అర్హత ఉన్నా తల్లికి వందనం పథకం వర్తించకపోవడంతో ఆయా మహిళలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో తల్లికి వందనం పథకం కింద 2,28,659 విద్యార్థులకు సంబంధించి.. 1,52,563 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఇటీవల రూ.13వేల చొప్పున నగదు జమ చేసింది. ఈ పథకానికి సంబంధించి ముందుగా సచివాలయాల వారీగా అనర్హుల జాబితా ప్రకటించింది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ఆదాయపు పన్ను కడుతున్నవారు, 300 యూనిట్ల కంటే అదనంగా విద్యుత్ వాడుతున్నవారు, నాలుగు చక్రాల వాహనం కలిగిన వారు, భూములు అధికంగా ఉన్నవారు వంటి కారణాలతో అనర్హులుగా చూపింది. అయితే ఇందులో చాలామంది నిరుపేద, సామాన్యులకు మాత్రం 300యూనిట్ల విద్యుత్ వాడకాన్ని సాకుగా చూపి అధికారులు నిధులు జమ చేయకుండా నిలిపివేశారు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఏడాది కాలంలో తాము చెల్లించిన విద్యుత్ బిల్లులు తీసుకెళ్లి.. సచివాలయ సిబ్బంది వద్ద మొర పెట్టుకుంటున్నారు. తాము అంత విద్యుత్ వినియోగించలేదని చెబుతూ బిల్లులు చూపుతున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారురాలైన తల్లి ఆధార్ నంబర్ వేరొకరి విద్యుత్ కనెక్షన్‌తో అనుసంధానం అయినందునే అధిక యూనిట్లు వినియోగ జాబితాలో చేర్చి ఉంటారని సచివాలయ ఉద్యోగులు అనుమానిస్తున్నారు. దీంతో విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళ్లి అడగ్గా.. ఆధార్ అనుసంధాన ప్రక్రియ తమ వద్ద లేదని చెబుతున్నారు. సచివాలయాల్లో సైతం విద్యుత్ కనెక్షన్‌కు ఆధార్ అనుసంధానం ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో తమ సమస్య ఎలా పరిష్కారమవుతుందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 21నుంచి వారం రోజుల పాటు ఫిర్యాదుల విభాగానికి అవకాశం కల్పించింది. ఫిర్యాదుల విభాగం ద్వారా అయినా తమ సమస్య పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు మహిళలు కోరుతున్నారు.
అంత విద్యుత్ వాడలేదు
నా పేరు మీద విద్యుత్ మీటరు లేదు. మాది సామాన్య కుటుంబం. ప్రతీ నెలా వంద యూనిట్లలోపే విద్యుత్ వినియోగిస్తాం. కానీ, 300 యూనిట్లు వినియోగిస్తున్నట్టు చెప్పి.. నాకు పథకం వర్తించలేదు. అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.
- లావేటి రామాయమ్మ, జేఆర్‌పురం
.............
అధికారులు స్పందించాలి
సాధారణంగా మాకు నెలకు రూ.200 నుంచి రూ.250 వరకూ విద్యుత్ బిల్లు వస్తుంది. అటువంటిది మేము 300 యూనిట్లు వినియోగించామని చెబుతుండడం అన్యాయం. సచివాలయ అధికారులను అడుగుతుంటే సమాధానం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి.. తప్పిదాలను సరిచేయాలి.
- మైలపల్లి పొట్టమ్మ, కొవ్వాడ
Updated Date - Jun 16 , 2025 | 11:58 PM