punjab: బిక్కుబిక్కుమంటూ..
ABN, Publish Date - May 10 , 2025 | 11:50 PM
Punjab students Return to hometown భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పంజాబ్‌లోని ఓ ప్రైవేటు యూనివర్శిటీ విద్యార్థులు స్వగ్రామాలకు బిక్కుబిక్కుమంటూ శనివారం బయలుదేరారు.
పంజాబ్ నుంచి స్వగ్రామాలకు బయలుదేరిన విద్యార్థులు
పలాస, మే 10(ఆంధ్రజ్యోతి): భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పంజాబ్‌లోని ఓ ప్రైవేటు యూనివర్శిటీ విద్యార్థులు స్వగ్రామాలకు బిక్కుబిక్కుమంటూ శనివారం బయలుదేరారు. నాలుగురోజులుగా పీఓకేలోని టెర్రరిస్టు స్థావరాలపై మన బలగాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రతిచర్యగా పాకిస్థాన్ కూడా దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని యూనివర్శిటీ యాజమాన్యం విద్యార్థులను అప్రమత్తం చేసింది. స్వస్థలాలకు వెళ్లిపోవాలని, ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని, సొంత పూచీకత్తుపై ఉండాలనుకుంటే ఉండొచ్చని స్పష్టం చేసింది. దీంతో అక్కడున్న విద్యార్థులంతా స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు పంజాబ్ నుంచి ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు శనివారం సాయంత్రం బయలుదేరారు. అక్కడ నుంచి విమానశ్రయానికి చేరుకుని విశాఖ, హైదరాబాద్ వచ్చేందుకు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. ఇదే అదనుగా విమాన టిక్కెట్ ధరలు అమాంతంగా పెంచినట్లు విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కూడా టిక్కెట్ రేట్లు పెంచితే సాధారణ విద్యార్థుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు రూ.5,500 టిక్కెట్ ధర ఉండగా ప్రస్తుతం రూ.7వేల వరకూ పెంచినట్లు విద్యార్థులు చెబుతున్నారు. గంటగంటకు టిక్కెట్ ధరలు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున ్న యూనివర్శిటీలో మొత్తం 30వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో సింహభాగం మన ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులు ఉండడం విశేషం.
సొంతూర్లకు వస్తున్నాము
రెండు రోజుల కిందట దూరంగా బాంబులు వెళ్తుండడాన్ని గుర్తించి భయపడ్డాం. మంటలు రావడాన్ని ప్రత్యక్షంగా చూశాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెలవులు ఇవ్వడంతో స్వగ్రామాలకు వస్తున్నాం.
-పి.చెన్నకేశవరెడ్డి, ఇంజనీరింగ్ విద్యార్థి, పంజాబ్‌లోని ప్రైవేటు యూనివర్శిటీ
Updated Date - May 10 , 2025 | 11:50 PM