collecter: పారిశుధ్యం లోపిస్తే కఠినచర్యలు
ABN, Publish Date - May 02 , 2025 | 12:12 AM
Sanitation Issues పారిశుధ్యం లోపిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. గురువారం వాండ్రంగిలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు.
అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
జి.సిగడాం, మే 1(ఆంధ్రజ్యోతి): పారిశుధ్యం లోపిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. గురువారం వాండ్రంగిలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. పలు వీధుల్లో అపరిశుభ్రత కనిపించడంతో సంబంధిత అధికారులపై మండిపడ్డారు. కాలువల్లో ఎన్నాళ్ల నుంచి పూడికలు తీయలేదని పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. ఇలా అయితే ప్రజలు రోగాల బారిన పడతారని, రహదారులపై నిర్మాణాలు చేపడుతుంటే ఏమీ చేస్తున్నారని నిలదీశారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శి గౌరీశంకర్‌కు షోకాజ్ నోటీసులు జారీచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇటువంటి పునరావృతమైతే సస్పెండ్ చేస్తామని పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండి సేవలు అందించాలని స్పష్టం చేశారు. అలాగే వాండ్రంగిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు ద్వారా నిర్మించిన ఇంకుడు గుంతలను కలెక్టర్ పరిశీలించారు. ఇంకుడు గుంతలు నిర్వహణపై అడిగిన ప్రశ్నలకు ఉపాధిహామీ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అవగాహనతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీకాంత్, ఏవో రామకృష్ణ, సర్పంచ్ సాకేటి నాగరాజు, మాజీ సర్పంచ్ బూరాడ వెంకటరమణ, బోట్ల భాస్కరరావు, డబ్బాడ రామారావు, ఏపీవో సత్యనారాయణ, ఏపీఎం రామకృష్ణం నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కుసుమ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 02 , 2025 | 12:12 AM