Congress Party: కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:39 PM
Political Strategy Leadership Goals కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
అణగదొక్కేందుకే నా ఫోన్ ట్యాపింగ్
జగన్‌రెడ్డి అరాచకానికి ఇది పరాకాష్ఠ
ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు చేయించాలి
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
అరసవల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘తెలంగాణలో మాదిరి ఆంధ్రాలో కూడా కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేద్దాం. గతంలో పార్టీలో పదవులు అనుభవించిన కొంతమంది పార్టీకి సహకరించకపోవడం దారుణం. పార్టీలో సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామ’ని షర్మిల తెలిపారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ విషయమై మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తీరుపై మండిపడ్డారు. ‘నా ఫోన్‌ను ట్యాప్ చేసిన ఆడియోను వైవీ సుబ్బారెడ్డి నాకు వినిపించారు. నా బిడ్డలు, బైబిల్‌పై ప్రమాణం చేసి చెబుతున్నా. నన్ను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కేందుకు జగన్మోహన్‌రెడ్డి చేసిన అరాచకాల్లో ఇదీ ఒక భాగం. అధికారం డబ్బు, ఉందని జగన్‌రెడ్డి ఇటువంటి అరాచకాలకు పాల్పడ్డాడు. వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చి మరీ ఇలా చేశారు. నా ఇంటికి వచ్చి నా మాటల ఆడియోను నాకే వినిపిస్తే ఎంత అవమానకరంగా, బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇలా వందల మంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఇది జగన్‌రెడ్డి అరాచకానికి పరాకాష్ఠ. ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. నేను ఎదగకుండా ఉండడానికి ఇంత నీచానికి తెగబడ్డారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలి. అసలు సుబ్బారెడ్డికి ఆ ఆడియో ఎలా వచ్చిందనే విషయాన్ని తేల్చాలి. జగన్ టీమ్ ఒక ఆలీబాబా 40 దొంగల ముఠా. ఆలీబాబా దొంగతనం చేయడమే కాకుండా తన టీమ్‌లో ఉన్న వారందరితో దొంగతనం చేయిస్తాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం జగన్‌రెడ్డికి లేవు. అతను బీజేపీకి దత్తపుత్రుడు. అలాగే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కూడా ప్రశ్నించలేరు. బీజేపీని ఎదిరించగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. తెలంగాణ మాదిరి ఆంధ్రాలో కూడా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామ’ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అంబటి కృష్ణారావు, కేవీఎల్‌ఎన్. ఈశ్వరి, తెంబూరు మధుసూదనరావు, రెల్ల సురేష్, తర్లాన అశోక్, చిట్టిబాబు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 11:39 PM