Streetlight failure: ఆరు దాటితే చీకటే!
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:55 PM
Power outage in towns జిల్లాలోని పురపాలక సంఘాల్లో ప్రజలకు విద్యుత్ సమస్యలు వెంటాడుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ ఎక్కడా సక్రమంగా పనిచేయడం లేదు. మునిసిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యత పాలకవర్గాలదే. దాదాపు అన్నిచోట్లా వైసీపీ పాలకవర్గాలు ఉండడంతో వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు.
పట్టణాల్లో వెలగని విద్యుత్ లైట్లు
సెంట్రల్ లైటింగ్ సైతం అస్తవ్యస్తం
నిర్వహణపై పాలకవర్గాల నిర్లక్ష్యం
ఇబ్బందులు పడుతున్న జనం
ఇచ్ఛాపురం, జూలై 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పురపాలక సంఘాల్లో ప్రజలకు విద్యుత్ సమస్యలు వెంటాడుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ ఎక్కడా సక్రమంగా పనిచేయడం లేదు. మునిసిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యత పాలకవర్గాలదే. దాదాపు అన్నిచోట్లా వైసీపీ పాలకవర్గాలు ఉండడంతో వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు. దీంతో సాయంత్రం ఆరు గంటలు దాటితే.. పట్టణాలు చీకటిమయంగా మారుతున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటితోపాటు టెక్కలి, నరసన్నపేట తదితర మేజర్ పంచాయతీల్లో సెంట్రల్ లైటింగ్ ఉంది. కానీ నిర్వహణలో మునిసిపాలిటీ పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయి. విద్యుత్‌శాఖ సిబ్బంది కూడా అరకొరగా ఉండడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి.
శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని పాలకొండ రోడ్డులో పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకూ, జీటీ రోడ్డు, రామలక్ష్మణ కూడలి, సింహద్వారం, నాగావళి నదిపై కొత్తవంతెన తదితర ప్రధాన ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్‌లు ఉన్నాయి. కానీ వీటి నిర్వహణ ఆశాజనకంగా లేదు. మొత్తం 50 డివిజన్లకుగాను 12,836 విద్యుత్ దీపాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లైట్లు వెలగడం లేదు. మరికొన్నిచోట్ల పగటిపూట వెలుగుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సిస్టం అస్తవ్యస్తంగా మారుతోంది.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోని 23 వార్డుల పరిధిలో 1,680 విద్యుత్ దీపాలు ఉన్నాయి. 12 సంవత్సరాల కిందట ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహణ బాగుండేది. తరువాత వైసీపీ హయాంలో పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో కొన్ని స్తంభాలు పడిపోయాయి. కొన్నిలైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. ప్రధానంగా మార్కెట్ జంక్షన్, దాసన్నపేట కూడలి, ఆర్టిసీ కాంప్లెక్స్ ప్రాంతం, ఆస్పత్రి రోడ్డు, రథం వీధి, మంగళవారంపేట, వీకే.పేట, రత్తకన్న తదితర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే చీకటి అలుముకుంటోంది. వేలాది వీధిలైట్ల నిర్వహణకుగాను ఉన్నది ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. అటు పాలకవర్గం పట్టించుకోకపోగా... ఇటు సిబ్బంది చాలకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 31 వార్డుల్లో 4,500 విద్యుత్ దీపాలు ఉన్నాయి. కానీ వీటి నిర్వహణకు ఉన్న సిబ్బంది కేవలం నలుగురే. దీంతో వీధిదీపాల ఏర్పాటు, మరమ్మతులు, పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారుతోంది. ఇంత పెద్ద మునిసిపాలిటీలో విద్యుత్ లైట్లు మార్చేందుకు హైడ్రా కూడా లేదు. దీంతో ప్రతి స్తంభం ఎక్కాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, లైట్ల ఏర్పాటులో జాప్యమవుతోంది.
ఆమదాలవలస మునిసిపాలిటీలోనూ అదే పరిస్థితి. 23 వార్డులకుగాను 3,300 విద్యుత్ లైట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ ఉంది. కానీ సిబ్బంది కేవలం ముగ్గురే. దీంతో లైట్లు అమర్చేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ రైల్వేస్టేషన్ ఉండడంతో నిత్యం ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. రాత్రిపూట రైలు దిగేవారు పట్టణంలో అంధకారం చూసి భయపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మునిసిపాలిటీల్లో విద్యుత్ దీపాల నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అనధికార కోతలతో ఇక్కట్లు
జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు పెరుగుతున్నాయి. ఈదురుగాలులు వీచినా, చిన్నపాటి వర్షం కురిచినా చాలు.. ఫీడర్ బ్రేక్‌డౌన్ అంటూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారులు మాత్రం విద్యుత్ కోతలే లేవని చెబుతున్నారు. కానీ రోజులో ప్రతి పూట సరఫరాను నిలిపివేసి ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,500 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 300 మంది మాత్రమే విద్యుత్‌శాఖ సిబ్బంది ఉన్నారు. అరకొరగా సిబ్బంది ఉండడంతో సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది వేసవిలో జిల్లాలోని 110 సబ్‌స్టేషన్ల పరిధిలో జంగిల్ క్లియరెన్స్, విద్యుత్ స్తంభాలు, వైర్లు మార్పులు చేశారు. కానీ ఇప్పుడు అవే సమస్యలుగా చూపుతూ విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిష్కరిస్తున్నాం
జిల్లాలో అధికారిక విద్యుత్ కోతలు లేవు. స్థానికంగా నెలకొన్న సమస్యలతోనే సరఫరా నిలిపివేస్తుంటాం. సిబ్బంది కొరత మాట వాస్తవమే. అయినా ఉన్న సిబ్బందితో పనిచేయిస్తున్నాం. ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరిస్తున్నాం.
- ఎన్.కృష్ణమూర్తి, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ, శ్రీకాకుళం
ప్రత్యేక దృష్టి..
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో విద్యుత్ లైట్ల నిర్వహణపై దృష్టిపెట్టాం. నలుగురు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ విషయంలో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో సైతం ఎప్పటికప్పుడు విద్యుత్ లైట్లకు మరమ్మతులు చేస్తున్నాం. సుడా అధికారులు టెండర్లకు పిలిచారు. టెండర్లు ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త లైటింగ్ పనులు జరుగుతాయి.
- ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం మునిసిపాలిటీ
Updated Date - Jul 06 , 2025 | 11:55 PM