APECET: ఏపీఈసెట్‌లో సిక్కోలు సత్తా
ABN, Publish Date - May 16 , 2025 | 12:07 AM
Engineering Entrance Exam పాలిటెక్నిక్ కోర్సును పూర్తిచేసి ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్ -2025 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.
92.97 శాతం ఉత్తీర్ణత
శ్రీకాకుళం/ ఎచ్చెర్ల/ పొందూరు/ ఆమదాలవలస/ జలుమూరు/ కంచిలి, మే 15(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కోర్సును పూర్తిచేసి ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్ -2025 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ‘జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ’ ఏపీఈసెట్‌ను నిర్వహించింది. జిల్లా నుంచి 1,671 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బాలురు 1,178 మంది, బాలికలు 493 మంది ఉన్నారు. పరీక్షకు 1,621 మంది మాత్రమే హాజరయ్యారు. గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. 1049 మంది బాలురు, 458 మంది బాలికలు మొత్తం 1507 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 92.97 శాతం ఉత్తీర్ణత లభించింది.
శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇన్‌స్ట్రిమెంటేషన్ విభాగానికి చెందిన సీపాన హేమప్రియ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు, రంగల హేమలత ఏడో ర్యాంకు, ఫార్మసీ విభాగంలో కె.భార్గవి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు దక్కించుకున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో వై.ప్రవళ్లిక 36వ ర్యాంకు, ఇ.తనూజ 42వ ర్యాంకు సాధించారు. విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ టి.విక్టర్‌బాబు, వివిధ కోర్సుల విభాగాధిపతులు ఆర్డీఎల్సీ క్రిస్టియన్, పి.కవిత, జి.గోవిందనాయుడు అభినందించారు.
కుశాలపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చెందిన విద్యార్థులు కూడా ప్రతిభ చూపారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో గ్రంధి జ్ఞానేశ్వర్‌లో 68వ ర్యాంకు, బరాటం సిరి 100వ ర్యాంకు, పి.తపన్ సిద్ధార్థ 109వ ర్యాంకు, ఎం.బాలరాజు 146వ ర్యాంకు సాధించారు.
హేమప్రియ.. 2వ ర్యాంకు
పొందూరు మండలం గోకర్ణపల్లికి చెందిన సీపాన హేమప్రియ.. తండ్రి లేకపోయినా తల్లికష్టాన్ని గుర్తించి బాగా చదువుకుంది. పాలిటెక్నిక్ చదివినా.. ఉన్నత కొలువే లక్ష్యంగా ఇంజనీరింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈసెట్ రాసింది. ఎలకా్ట్రనిక్ అండ్ ఇనిస్ట్రిమెంటేషన్ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. హేమప్రియ తండ్రి ప్రభాకరరావు కొన్నేళ్ల కిందట మృతి చెందాడు. తల్లి జ్యోతి టైలర్ వృత్తి చేస్తూ.. హేమప్రియను చదివించింది. 1 నుంచి 5వ తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం సాగింది. 6 నుంచి పదో తరగతి వరకు విజయనగరం జిల్లా మెంటాడలోని కేజీబీవీలో చదివింది. పదోతరగతిలో 550 మార్కులు సాధించింది. ప్రస్తుతం శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఆమె ఈసెట్ రాయగా.. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ రావడతో తల్లి జ్యోతి ఆనందానికి అవధుల్లేవు. హేమప్రియను గ్రామస్తులు అభినందించారు..
భార్గవి.. 3వ ర్యాంకు
ఆమదాలవలసలోని ఐజే నాయుడు కాలనీకి చెందిన కూన భార్గవి ఈసెట్‌లో.. డీ-ఫార్మసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో మూడోర్యాంకు సాధించింది. ఈమె పట్నంలోని లక్ష్మీనగర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. ప్రస్తుతంలో శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. తండ్రి నర్సింగరావు పూల వ్యాపారి. తల్లి రమణమ్మ గృహిణి. భార్గవికి వివాహమైంది. భర్త రమేష్‌కుమార్, అత్తమామల ప్రోత్సాహంతో తాను చదువును కొనసాగిస్తున్నానని భార్గవి తెలిపింది. ఉత్తమ ర్యాంకు సాధించినందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆమెను అభినందించారు.
శరత్‌కుమార్.. 9వ ర్యాంకు
కంచిలి మండలం బసవపుట్టుగ గ్రామానికి చెందిన కాండ్రెడ్డి శరత్‌కుమార్ ఈసెట్‌లోని సీఎస్‌సీ విభాగంలో రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. తండ్రి రాజారావు ఎలక్ర్టీషియన్. తల్లి ఢిల్లమ్మ గృహిణి. శరత్‌కుమార్ పెద్ద అక్క నీలవేణి తెలంగాణలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. రెండో అక్క దివ్య డీఎస్సీకి సిద్ధమవుతున్నారు. శరత్‌కుమార్ కృష్ణాజిల్లాలోని పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తాజాగా ఈసెట్‌లో ఫలితాల్లో 164 మార్కులతో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ.. 10వ ర్యాంకు
జలుమూరు మండలం గొటివాడ గ్రామానికి చెందిన గురువు బాలకృష్ణ ఈసెట్‌లోని గణితం విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి గౌరమ్మ గృహిణి. బాలకృష్ణ 1వ తరగతి నుండి 5 వరకు గొటివాడ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. 6 నుంచి 10వ తరగతి వరకు కరవంజ మోడల్ స్కూల్‌లో చదివాడు. ఎచ్చెర్లలోని ప్రైవేటు కళాశాలలో డిప్లమో చేసిన బాలకృష్ణకు మంచి ర్యాంకు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - May 16 , 2025 | 12:07 AM