ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

panchayathi problems: ఆ 25 పంచాయతీలు!

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:23 AM

Panchayat Administration జిల్లాలో పదుల సంఖ్యలో పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు జరగలేదు. జిల్లాలో 912 పంచాయతీలు ఉన్నాయి. వాటికి పాలకవర్గాలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులన్నీ వాటికి సర్దుబాటు అవుతున్నాయి. కానీ 2021లో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం చాలా గ్రామాలకు శాపంగా మారింది.

అభివృద్ధికి నోచుకోని లావేరు మండలం తామాడ గ్రామం
  • నాలుగేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో..

  • ఆర్థిక సంఘం నిధులకు గ్రహణం

  • రూపాయి కూడా విడుదలకాని వైనం

  • వైసీపీ పాలనలో నిర్వాకమే.. శాపం

  • రణస్థలం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి):

  • రణస్థలం మండలం రావాడ పంచాయతీలో రావాడ ఎస్సీ కాలనీ, ఉప్పివలస ఉన్నాయి. వల్లభరావుపేట పంచాయతీలో వెంకట్రావుపేట ఉంది. గతంలో ఉప్పివలస, వెంకట్రావుపేటను ఒక పంచాయతీగా చేయాలని భావించారు. మిగతావాటిని వేర్వేరు పంచాయతీలుగా విభజించాలనుకున్నారు. కానీ రావాడ పంచాయతీలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రావాడ, వల్లభరావుపేట పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. ఫలితంగా దాదాపు ఐదు గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి లేకుండా పోయింది.

    .......................

  • లావేరు మండలంలో బెజ్జిపురం అతిపెద్ద పంచాయతీ. దీని పరిధిలో బొంతుపేట, బోరపేట, శిగిరికొత్తపల్లి గ్రామాలున్నాయి. గతంలో శిగిరికొత్తపల్లి కేంద్రంగా మరికొన్ని గ్రామాలు కలిపి పంచాయతీని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ అభ్యంతరాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఎన్నికలు కూడా నిలిచిపోయాయి. ఈ గ్రామాల్లో పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పారిశుధ్య లోపం, తాగునీటి సమస్యలు వెంటాడుతున్నాయి.

    ...........................

  • లావేరు మండలం తామాడ పంచాయతీ పరిధిలో ఆరు గ్రామాలున్నాయి. తామాడ ఒక్కటే ఒక్క పంచాయతీగా.. కొత్త రౌతుపేట, పాత రౌతుపేట, రాయినింగిరిపేట, నడుపూరుపేట, సూర్యనారాయణపురం గ్రామాలను కలిపి కొత్తగా పంచాయతీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ అప్పట్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో పంచాయతీ విభజన జరగకుండా స్టే వచ్చింది. దీంతో ఎన్నికలు జరగలేదు. ఆయా గ్రామాలను పట్టించుకునేవారు లేకపోయారు.

    ............................

  • ఇలా.. జిల్లాలో పదుల సంఖ్యలో పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు జరగలేదు. జిల్లాలో 912 పంచాయతీలు ఉన్నాయి. వాటికి పాలకవర్గాలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులన్నీ వాటికి సర్దుబాటు అవుతున్నాయి. కానీ 2021లో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం చాలా గ్రామాలకు శాపంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరగడంతో జిల్లావ్యాప్తంగా కొత్తగా 95 పంచాయతీలను ఏర్పాటు చేశారు. ఉన్న పంచాయతీల పరిధిలో గ్రామాలను విడగొట్టి కొత్తగా పంచాయతీలు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఎక్కడికక్కడే స్థానికుల అభ్యంతరాలతో 25 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. ఆయా పంచాయతీల్లో ఉన్న దాదాపు 100 గ్రామాలు ప్రత్యేకాధికారి పాలనలో సాగుతున్నాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఏర్పాటులో తలెత్తిన సమస్యలు పరిష్కరించలేదు. అటు పాలకవర్గాలు లేకపోవడంతో కనీసం పారిశుధ్య పనులు చేపట్టిన వారు కూడా లేకుండా పోతున్నారు. గ్రామాల్లో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతులకుగాను అందించే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి.

  • ఆ మండలాల్లో అధికం..

  • జిల్లాలో ప్రధానంగా రణస్థలం, లావేరు, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, బూర్జ, పోలాకి, కోటబొమ్మాళి, హిరమండలం తదితర మండలాల్లోనే ఎక్కువగా పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంఘం నిధులను వేరే మార్గాలకు మళ్లించేవారు. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. కానీ పాలకవర్గాలకు ఉన్న స్థానిక సంస్థలకు మాత్రమే కేటాయిస్తున్నారు. ఎన్నికలకు జరగని పంచాయతీలకు మొండిచేయి చూపడంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. కనీసం పారిశుధ్య పనులు చేపట్టేందుకు కూడా వీల్లేకుండా పోతోంది. ప్రత్యేకాధికారులుగా మండలస్థాయి అధికారులను నియమించడంతో వారు గ్రామాల వైపు తొంగి చూడడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజల బాధలు వర్ణణాతీతం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీలపై దృష్టిపెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

  • పాలకవర్గాలు ఉంటేనే నిధులు..

  • గత ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రయత్నించింది. కానీ ఎక్కడికక్కడే అభ్యంతరాలు, కోర్టు కేసులు ఉండడంతో ఎన్నికలు నిర్వహించలేదు. అందుకే అక్కడ ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. పాలకవర్గాలు ఉన్న స్థానిక సంస్థలకే ఆర్థిక సంఘం నిధులు జమ అవుతున్నాయి. ఈ విషయం ప్రభుత్వ పరిధిలో ఉంది. ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాలి.

    - కేబీ సౌజన్య జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం

  • సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి

  • మండలంలోనే మా పంచాయతీ అతి పెద్దది. కానీ అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. అది మా పాలిట శాపంగా మారింది. కనీసం న్యాయ చిక్కుముడులు అధిగమించే ప్రయత్నం కూడా చేయలేదు. దాని ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. పారిశుధ్య పనులు లేవు. కనీసం సమస్య చెప్పుకునేందుకు ప్రతినిధి లేకపోవడం ఘోరం.

    - వడ్డిపల్లి శ్రీనివాసరావు, బెజ్జిపురం, లావేరు మండలం

  • మా పాలిట శాపం..

  • గతంలో మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నాలుగేళ్లుగా ఎటువంటి అభివృద్ధి లేకుండా పోయింది. పంచాయతీ ఎన్నికలు జరగకపోవమే కారణం. రావాడ పంచాయతీ నుంచి ఉప్పువలస గ్రామాన్ని విడిదీసే ప్రయత్నం చేశారు. ఉప్పువలస రావాడ పంచాయతీలో ఉంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. పాలకవర్గం లేకపోవడం మా పాలిట శాపంగా మారింది.

    - లంక ప్రభ, రావాడ, రణస్థలం మండలం

  • ఎన్నికలు నిర్వహించాలి

  • కేసులు తొలగించి జిల్లాలోని 25 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఆయా పంచాయతీలపై ఉన్న కేసుల కారణంగా స్టాంప్‌ డ్యూటీ, ఇతరత్రా నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది.కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీలను అభివృద్ధి చేయాలి.

    - పిన్నింటి భానోజినాయుడు, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు

Updated Date - Jun 03 , 2025 | 12:23 AM