Tractor overturn accident: మృత్యువులోనూ వీడని బంధం
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:33 PM
Tractor tragedy వారిద్దరూ అక్కాతమ్ముడు. ప్రతిరోజూ కూలీ పనులకు కలిసే వెళ్తారు.. కలిసే వస్తారు. ఆ వచ్చిన డబ్బులతో తమ కుటుంబాలను పోషించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. అయితే, వారిని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. ట్రాక్టర్ ప్రమాద రూపంలో వారిని బలితీసుకుంది. కామేశ్వరిపేట సమీపంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో లుకలాం గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు చోడి లక్ష్మి(38), గొడ్డు ఆదినారాయణ (35) మృతిచెందగా, డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు.
ట్రాక్టర్ బోల్తాపడి అక్కాతమ్ముడి దుర్మరణం
ప్రాణాలతో బయటపడ్డ మరో నలుగురు
లుకలాంలో విషాదం
నరసన్నపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ అక్కాతమ్ముడు. ప్రతిరోజూ కూలీ పనులకు కలిసే వెళ్తారు.. కలిసే వస్తారు. ఆ వచ్చిన డబ్బులతో తమ కుటుంబాలను పోషించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. అయితే, వారిని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. ట్రాక్టర్ ప్రమాద రూపంలో వారిని బలితీసుకుంది. కామేశ్వరిపేట సమీపంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో లుకలాం గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు చోడి లక్ష్మి(38), గొడ్డు ఆదినారాయణ (35) మృతిచెందగా, డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. లుకలాం గ్రామానికి చెందిన ఆదినారాయణ, లక్ష్మి, జి.బంగారమ్మ, అశోక్, లంక శ్రీనివాసరావు అనే కూలీలు వంట కలపను లోడు చేసేందుకుగాను మంగళవారం ఉదయం 9 గంటలకు స్వగ్రామం నుంచి ట్రాక్టర్‌పై వెంకటాపురానికి బయలుదేరారు. ట్రాక్టర్‌ను స్వామి అనే డ్రైవర్ నడుపుతున్నాడు. ట్రాక్టర్ కొల్లవానిపేట రైల్వేగేటు దాటిన తరువాత కామేశ్వరిపేట గ్రామ సమీపంలోకి వెళ్లే సమయంలో ఒక్కసారిగా ఇంజన్ ముందు టైరు పంక్చరైంది. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు- రైల్వే మార్గానికి మధ్యలో ఉన్న చిన్నలోయలో బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రక్కు కింద చిక్కుకుని ఆదినారాయణ, ఇంజన్ కిందపడి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా కూలీలు బంగారమ్మ, అశోక్, శ్రీనివాసరావుతోపాటు డ్రైవర్ స్వామి ట్రాక్టర్ నుంచి బయటకు గెంతేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న లుకలాం గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదినారాయణ, లక్ష్మి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు రోదించారు. వారి మృతితో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయని తల్లి వరహాలమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆదినారాయణకు భార్య గన్నెమ్మ, బాబు, పాప ఉండగా, లక్ష్మికి భర్త చిన్నారావు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలాకి ఎస్‌ఐ రంజిత్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాతమ్ముడు లక్ష్మి, ఆదినారాయణ మృతి చెందడంతో లుకలాంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Updated Date - Jul 15 , 2025 | 11:33 PM