AP Fiber Net: సిగ్నల్స్ నిల్.. సేవలు డల్
ABN, Publish Date - Apr 29 , 2025 | 10:57 PM
AP Fiber Net: జిల్లాలో ఫైబర్ నెట్ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వం ఇంటింటికీ నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నట్టు చెబుతోంది.
- జిల్లాలో ఏపీ ఫైబర్ నెట్ అస్తవ్యస్తం
- తరచూ సిగ్నల్, సాంకేతిక సమస్యలు
- నెలల్లో సగం రోజులే..
- ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వీర్యం
- ఈ ప్రభుత్వం గాడిన పెట్టేనా?
- ఎచ్చెర్ల గ్రామానికి చెందిన ఓ ఉద్యోగి ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకున్నాడు. అటు టీవీలో అన్నిరకాల ఛానళ్లు, ఇంట్లో పిల్లలు వినియోగించుకునేందుకు నెట్ సదుపాయంతో పాటు అన్ లిమిటెడ్ ఫోన్ సౌకర్యం ఉంటుందని భావించి కనెక్షన్ పొందాడు. కానీ నెలలో సగం రోజులు సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. నెట్‌వర్క్ సైతం చాలా నెమ్మదిగా ఉంటోంది. ఒక్కోసారి ప్రసారాలు ఆగిపోతున్నాయి. నెట్ కూడా రోజులో చాలాసార్లు ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రైవేటు సంస్థ ఫైబర్ నెట్‌కు మారేందుకు యోచిస్తున్నాడు.
- జేఆర్‌పురం మండల కేంద్రానికి చెందిన ఎస్.విజయ్‌కుమార్ సాధారణ ప్రైవేటు ఉద్యోగి. ఇంట్లో పిల్లల చదువులకు సంబంధించి ఇంటర్నెట్ అవసరం. అదే సమయంలో ఇంట్లో నాలుగు సెల్‌ఫోన్లు వాడుతున్నారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకుంటే తక్కువ ప్యాకేజీకే మొత్తం అందుతాయని భావించి కనెక్షన్ తీసుకున్నారు. కానీ సిగ్నల్ ఉండడం లేదు. తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో పాత పద్ధతిలోనే డిష్ టీవీ పెట్టుకున్నారు. ఆ పై పిల్లలు ప్రైవేటు నెట్‌వర్క్ నుంచి ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు.
రణస్థలం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫైబర్ నెట్ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వం ఇంటింటికీ నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నట్టు చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఫైబర్ నిర్వీర్యం అయింది. కూటమి ప్రభుత్వం గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలో మాత్రం మెరుగుపడడం లేదు. జిల్లాలో గృహాలకు సంబంధించి 20 వేల ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయి. సచివాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మరో 2 వేల వరకూ సర్వీసులు ఉన్నాయి. అయితే వాటికి కూడా నిరంతరాయంగా సేవలు అందించడంలో ఏపీ ఫైబర్ నెట్ పూర్తిగా విఫలమవుతోంది. దీంతో వినియోగదారులు విసిగిపోయి ప్రైవేటు నెట్‌వర్కులను ఆశ్రయించాల్సి వస్తోంది. దాదాపు అన్ని పట్టణాలు, మునిసిపాల్టీల్లో ఏపీ ఫైబర్ నెట్ సేవలు తగ్గుముఖం పడుతున్నాయి. జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ సంస్థల కనెక్షన్లు పెరుగుతున్నాయి.
2017లో ఏర్పాటు..
ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్..ఇలా మూడు రకాల సేవలను అతి తక్కువ ధరకు ప్రజలకు అందించడమే ధ్యేయంగా 2017లో టీడీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్‌ను ప్రారంభించింది. వాస్తవానికి ఈ మూడు సేవలను విడివిడిగా సర్వీస్ ప్రొవైడర్లు అందించేవారు. అందుకే ఈ మూడు రకాల సేవలను ఫైబర్ నెట్ ద్వారా అందించడం ద్వారా కుటుంబాలకు స్వాంతన చేకూర్చవచ్చని అప్పటి సీఎం చంద్రబాబు భావించారు. విద్యుత్ శాఖతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్ర్టాస్ట్రక్చర్‌ను ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,449 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకొని 24 కిలోమీటర్ల మేర కేబుల్ లైన్‌ను ఏర్పాటు చేశారు. రూ.149కే బేసిక్ ప్లాన్ అందుబాటులోకి తేవడంతో అనతికాలంలో ఏపీ ఫైబర్ నెట్ సేవలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అయితే ఏపీ ఫైబర్ నెట్‌తో తమ కేబుల్ వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటుందోనని ఆపరేటర్లు ఆందోళన చెందారు. ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ల పట్ల విముఖత చూపారు. అందుకే పట్టణాలు, సమీప గ్రామాలకే ఏపీ ఫైబర్ నెట్ పరిమితం అయ్యింది. ఆపై 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ బేసిక్ ప్లాన్‌ను రూ.149 నుంచి ఏకంగా రూ.350కు పెంచింది. పైగా ఫైబర్ నెట్ నిర్వహణను గాలికి వదిలేయడంతో సేవలకు అంతరాయం కలిగింది. ఆపై వినియోగదారుల సంఖ్య తగ్గింది. జిల్లాలో 2020 నాటికి 50 వేల వరకూ కనెక్షన్లు ఉండగా.. 2024 నాటికి వచ్చేసరికి 20 వేలకు పడిపోయాయి.
గణనీయంగా తగ్గిన కనెక్షన్లు..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కనెక్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 4.95 లక్షలకు తగ్గుముఖం పట్టినట్టు సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఏపీ ఫైబర్ నెట్ టారిఫ్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. రూ.349కు సంబంధించి ప్రైవేటు సంస్థలతో పోల్చుకుంటే తక్కువే. 100 ఎంబీబీఎస్ నెట్ స్పీడు ఉంటేనే సేవలు సాధ్యమయ్యేది. కానీ ఏపీ ఫైబర్ నెట్‌కు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నెట్ వర్క్ సక్రమంగా ఉండడం లేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విస్తరించే పనులేవీ చేయలేదు. కేవలం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రవేశపెట్టారన్న కోపంతోనే నిర్లక్ష్యంగా విడిచిపెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గాడిన పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఒక వైపు నెట్ వర్క్ పెంచడం, సాంకేతిక సమస్యలు తగ్గించడం, రూ.149 బేసిక్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు నిర్ణయించడంతో ఏపీ ఫైబర్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందన్న నమ్మకం కలుగుతోంది. జిల్లాలో మాత్రం వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడంతో నెట్‌వర్క్ సమస్యలపై దృష్టిపెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
నిర్వహణ సరిగా లేదు
ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్ సౌకర్యం కలుగుతుందని చెప్పి ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకున్నాం. రూ.149 బేసిక్ ప్లాన్‌ను రూ.350కు పెంచారు. ఆపై నిర్వహణ సరిగా లేదు. నెట్‌వర్క్ సదుపాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ఇప్పుడు సేవలు నిలిచిపోతాయో తెలియడం లేదు. అందుకే గతం మాదిరిగా విడివిడిగా మూడింటి ప్రొవైడర్ సేవలు తీసుకున్నాం.
-మిండ్రాన రామారావు, వినియోగదారుడు, రణస్థలం
సిగ్నల్ సమస్య ఉంది
జిల్లాలో ఏపీ ఫైబర్ నెట్ సేవల్లో ఎటువంటి పురోగతి లేదు. ముఖ్యంగా సిగ్నల్ సమస్యలు వేధిస్తున్నాయి. ఇతర ప్రైవేటు సంస్థల కంటే బేసిక్ ప్లాన్ అందుబాటులో ఉంది. కానీ ప్రైవేటు సంస్థలు ఇస్తున్న నాణ్యత ఇవ్వడం లేదు. నిర్వహణ సైతం బాగుండడం లేదు. ఇప్పటికైనా ఫైబర్ నెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి.
-పిన్నింటి అప్పలనాయుడు, వినియోగదారుడు, పిన్నింటిపేట
సేవలను విస్తరిస్తాం
జిల్లాలో గతంలో కంటే ఏపీ ఫైబర్ నెట్ సేవలు పెరిగాయి. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ఉంది. సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు తక్కువ ధరకు బేసిక్ ప్లాన్ అందుబాటులోకి తేనుంది. ప్రతి గ్రామానికి పైబర్ నెట్ సేవలు విస్తరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- ఎల్.గౌతమ్, జిల్లా బిల్డింగ్ మేనేజర్, ఏపీ ఫైబర్ నెట్, శ్రీకాకుళం
Updated Date - Apr 29 , 2025 | 10:57 PM