విత్తన ఎంపికే కీలకం
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:17 AM
జిల్లాలో ప్రస్తుతం వర్షాలు దండిగా కురుస్తున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ కోసం సన్నద్ధమవుతున్నారు.
- నకిలీ విత్తనాలతో జాగ్రత్త
- కొనుగోలుపై అవగాహన తప్పనిసరి
- ఖరీఫ్‌నకు సమాయత్తమవుతున్న రైతులు
హిరమండలం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రస్తుతం వర్షాలు దండిగా కురుస్తున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ కోసం సన్నద్ధమవుతున్నారు. పొలాలకు ఎరువులు తోలడం, దుక్కులు దున్నడం ప్రారంభించారు. వాతావరణం పూర్తిస్థాయిలో అనుకూలిస్తే నెల రోజుల్లో విత్తనాలు జల్లే పనులు చేపట్టనున్నారు. అయితే, పంట బాగుండాల న్నా.. అధిక దిగుబడులు రావాలన్నా.. తెగుళ్లు తట్టుకోవాలన్నా విత్తన ఎంపికే కీలకం అంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఈ సీజన్‌లో కొందరు వ్యాపారులు తక్కువ ధరలో ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనాలు తమ వద్ద లభిస్తాయంటూ రైతులను మభ్యపెడు తుంటారు. దీంతో రైతులు ఆకర్షితులై వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ విత్తనాలు చాలా వరకు మొలకలు రావు. ఒకవేళ మొలకలు వచ్చినా గింజలు పొల్లిపోవడం, సరైన దిగుబడి రాకపోవడం జరిగి రైతులు నష్టపోతున్నారు. ఏటా నకిలీ విత్తనాల బారిన పడి అధిక సంఖ్యలో రైతులు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజనల్ విత్తనాలు కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయా ధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల నకిలీ విత్తనాలను ముందే గుర్తించవచ్చు. నష్టపోయినా పరిహారం సైతం పొందవచ్చని పేర్కొంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వ్యవసాయ శాఖ అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొన్నిచోట్ల ప్రభుత్వ అనుమతి లేకుండా కొందరు వ్యాపారులు తెల్ల సంచుల్లో నకిలీ విత్తనాలను విక్రయించే అవకాశం ఉంది. వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ.. వారి సమాచారాన్ని తక్షణమే అధికారులకు తెలియజేయాలి.
- ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల నుంచే సర్టిఫైడ్ విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లుపై రైతు చిరునామా, గడువు తేదీ, విత్తనం ధర, కంపెనీ పేరు, అమ్మినవారి సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
- విత్తన బస్తాపై ముద్రించిన ధ్రువపత్ర బిల్లును పంట చేతికి వచ్చేంత వరకు రైతులు భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొన్న వెంటనే మొలక శాతం పరీక్షించుకోవాలి. కనీసం 75శాతం మొలకలు ఉంటేనే వాటిని విత్తనంగా వినియోగించుకోవాలి. విత్తన సంచులను నమూనా వివరాల కోసం పంట కోతకు వచ్చే వరకు రైతులు దాచుకోవాలి.
నకిలీ విత్తనాలపై ఫిర్యాదు చేయొచ్చు.
ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వ్యాపారుల వద్దే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు నకిలి విత్తనాలతో మోసపోతే వెంటనే వ్యవసాయాధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. విత్తనాలు నాణ్యమైనవి కాకపోవడం వల్ల దిగుబడి రాలేదని గుర్తిస్తే సదరు విత్తన కంపెనీపై మండల వ్యవసాయాధికారి ద్వారా జిల్లా వ్యవసాయ సంచాలకులకు ఫిర్యాదు చేసి పరిహారం పొందేందుకు వీలుంటుందని చెబుతున్నారు. దీని కోసం రైతులు విత్తన కొనుగోలు బిల్లును భద్రపరుచుకోవాల్సి ఉంటుందంటున్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:17 AM