విద్యుత్ కాటా సీలుకు రూ.400 అదనంగా ఇవ్వాల్సిందే!
ABN, Publish Date - May 23 , 2025 | 12:42 AM
Seal charges Extra payment కాశీబుగ్గ సబ్‌డివిజన్‌లో మొత్తం 14 మండలాలు. వేలాది మంది ట్రేడర్లు. వారి వద్ద ఉన్న ధర్మకాటా(విద్యుత్ తూకం)కు కొత్తగా సీలు వేయాలంటే చలానా కన్నా రూ.400 అదనంగా ఇచ్చుకోవాల్సిందే. ఇదీ కాశీబుగ్గలో తూనికలు కొలతలశాఖ అధికారి టి.శ్రీధర్ అవినీతి భాగోతం. ఓ వ్యాపారి ముందుకు వచ్చి ఆయన అవినీతిపై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో గురువారం సాయంత్రం దాడులు చేయగా.. రూ.1.78 లక్షల అవినీతి సొమ్ముతో ఆ అధికారిని పట్టుకున్నారు.
ఆపై అనుమతి పత్రాల మంజూరులో జాప్యం
ఏసీబీని ఆశ్రయించిన వ్యాపారులు
రూ.1.78 లక్షలతో పట్టుబడిన తూనికల కొలతల అధికారి
పలాస, మే 22(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ సబ్‌డివిజన్‌లో మొత్తం 14 మండలాలు. వేలాది మంది ట్రేడర్లు. వారి వద్ద ఉన్న ధర్మకాటా(విద్యుత్ తూకం)కు కొత్తగా సీలు వేయాలంటే చలానా కన్నా రూ.400 అదనంగా ఇచ్చుకోవాల్సిందే. ఇదీ కాశీబుగ్గలో తూనికలు కొలతలశాఖ అధికారి టి.శ్రీధర్ అవినీతి భాగోతం. ఓ వ్యాపారి ముందుకు వచ్చి ఆయన అవినీతిపై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో గురువారం సాయంత్రం దాడులు చేయగా.. రూ.1.78 లక్షల అవినీతి సొమ్ముతో ఆ అధికారిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కాశీబుగ్గ తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీధర్ వ్యాపారుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేయడమే కాకుండా వారిని ఏళ్లతరబడి అనుమతి పత్రాలు ఇచ్చేందుకు తిప్పతున్నారు. కాశీబుగ్గ సబ్‌డివిజన్ పరిధిలో పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం తదితర 14 మండలాలు ఉన్నాయి. వేలాది మంది వ్యాపారులు ఇక్కడి కార్యాలయంలో విద్యుత్ కాటాలకు ఏటా కొత్తగా సీళ్లు వేసి వ్యాపారాలు చేయాలి. దీనికోసం ప్రభుత్వం ఒక్కో కాటాకు రూ.300 చొప్పున రుసుం వసూలు చేస్తుంది. తూనికల కొలతలశాఖ అధికారులు సీళ్లు వేసి వ్యాపారులకు నిరభ్యంతర పత్రాలు ఇవ్వాలి. కాగా.. స్థానిక తూనికల కొలతల అధికారి శ్రీధర్ మాత్రం ప్రభుత్వం నిర్ధేశించిన ధరతో పాటు అదనంగా ఒక్కో కాటాకు రూ.400 డిమాండ్ చేశారు. దీంతోపాటుగా కొంతమందికి కాటాల అనుమతి పత్రాలు ఇవ్వకుండా ఏడాదిన్నరగా తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై ప్రశ్నించినా సమాధానం ఇవ్వకపోవడంతో వ్యాపారులు విసిగి.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. డివిజన్ పరిధిలో 445 మంది వ్యాపారుల వద్ద రూ.1.78 లక్షలు.. డిమాండ్ చేశారు. తూకాల మిషన్లు పరిశీలించే టెక్నీషియన్ ఎన్.సత్యనారాయణ ద్వారా ఈ డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు చేసి శ్రీధర్‌ను పట్టుకున్నారు. ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నగదుతో పట్టుబడిన తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీధర్‌ను విశాఖపట్నం ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. దాడుల్లో సిఐ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడితే ఖబడ్దార్
ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘అవినీతికి ఎవరు పాల్పడినా శిక్ష తప్పదు. చిన్న వ్యాపారుల నుంచి కూడా అదనంగా ఒక్కో తూకం యంత్రానికి రూ.400 వసూలు చేయడం దారుణం. ఉద్దేశపూర్వకంగా కొన్ని కాటాలకు గత ఏడాది అక్టోబరు నుంచి అనుమతులు ఇవ్వలేదని గుర్తించాం. తూనికల కొలతలశాఖ అధికారి శ్రీధర్ గత నేర చరిత్ర కూడా పరిశీలిస్తున్నాం. అవినీతిపరులపై ప్రజలు కూడా ఫిర్యాదు చేయాలి’ అని సూచించారు.
Updated Date - May 23 , 2025 | 12:42 AM