Gold price : పైపైకి.. బంగారం
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:51 PM
Gold rate hike.. Bullion market బంగారం ధర మరో మారు లక్ష మార్కు దాటింది. ఇటీవల తగ్గినట్టు తగ్గిన బంగారం ధర.. గత నాలుగురోజులుగా మళ్లీ పెరుగుతోంది. దీంతో ధర మరింత తగ్గుతుందని.. ఆషాడంలో కొనుగోలు చేయవచ్చనునుకునే వినియోగదారుల ఆశలు అడియాశలయ్యాయి.
10 గ్రామలు రూ.లక్షా 3వేలు
తగ్గినట్టే తగ్గి.. పెరుగుతున్న ధరలు
అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులే కారణం
నరసన్నపేట, జూన్ 16(ఆంధ్రజ్యోతి): బంగారం ధర మరో మారు లక్ష మార్కు దాటింది. ఇటీవల తగ్గినట్టు తగ్గిన బంగారం ధర.. గత నాలుగురోజులుగా మళ్లీ పెరుగుతోంది. దీంతో ధర మరింత తగ్గుతుందని.. ఆషాడంలో కొనుగోలు చేయవచ్చనునుకునే వినియోగదారుల ఆశలు అడియాశలయ్యాయి. సోమవారం నరసన్నపేట బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బిస్కెట్ ధర రూ.లక్షా మూడు వేలు పలికింది. ఈ లెక్కన తులం బంగారం రూ.లక్షా 19వేలు ఉంది. ఇదే ఆల్‌టైం రికార్డు అని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం బాటలో వెండి కూడా పరుగులు పెడుతోంది. వెండి కిలో సోమవారం నాటికి రూ.లక్షా పదివేలు పలికింది. ఇక ఆర్నమెంట్ బంగారం కూడా గ్రాము ధర రూ.9,215కి చేరింది. గతేడాది ఇదే నెలలో ఆర్నమెంట్ ఆభరణాలు గ్రాము ధర రూ.6వేల లోపు ఉండేది. ఏడాదిలో గ్రాముకు రూ.3వేలు పైన అంటే.. 50శాతం వరకు బంగారం ధరలు పెరిగినట్టే. ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయింది. స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ట్రంప్ అవలంభించిన పన్నుల విధానంపై ఇంకా స్పష్టత లేకపోవడం తదితర కారణాలతో బంగారం ధర పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆషాడ, శ్రావణమాసాలకు బంగారం గ్రాము ధర రూ.11వేలు చేరే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత నెలలో పది గ్రాముల బంగారం ధర లక్ష నుంచి రూ.92వేలకు పడింది. ఆర్నమెంట్ బంగారం కూడా 85వేలు పలికింది. ఆ సమయంలో కొంతమంది కొనుగోలు చేసి కాస్త లబ్ధి పొందారు. ఇంకా ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన వారు మాత్రం ప్రస్తుతం నిరాశ చెందుతున్నారు. ధరలు పెరగడంతో నరసన్నపేట, శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ, సోంపేట, టెక్కలి తదితర ప్రాంతాల్లో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి.
Updated Date - Jun 16 , 2025 | 11:51 PM