sachivalam tansfers : ఏం చేస్తారో.. ఎలా చేస్తారో!
ABN, Publish Date - Jun 28 , 2025 | 11:58 PM
Secretariat employees transfers గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వేళ.. సిఫారసులు జోరందుకున్నాయి. సచివాలయ ఉద్యోగులకు అధికార పార్టీ నేతల సపోర్టు ఉంటే కోరుకున్న స్థానం దక్కినట్టే. లేదంటే అధికారులు బదిలీ చేసిన చోటుకు వెళ్లాల్సిందే అంటూ ప్రచారం సాగుతోంది.
సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో సిఫారసులు!
ఒకేచోట ఐదేళ్లు పూర్తయి వారికి స్థానచలనం
రెండు రోజుల్లో ముగియనున్న ప్రక్రియ
మెళియాపుట్టి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వేళ.. సిఫారసులు జోరందుకున్నాయి. సచివాలయ ఉద్యోగులకు అధికార పార్టీ నేతల సపోర్టు ఉంటే కోరుకున్న స్థానం దక్కినట్టే. లేదంటే అధికారులు బదిలీ చేసిన చోటుకు వెళ్లాల్సిందే అంటూ ప్రచారం సాగుతోంది. బదిలీల ప్రక్రియ పూర్తిచేసేందుకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి సచివాలయ ఉద్యోగులు.. ఆయా పంచాయతీ నాయకుల సహకారంతో ఎమ్మెల్యేల సిఫారసుల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. నచ్చిన స్థానానికి బదిలీ అయ్యేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. రాజకీయ పలుకుబడి లేనివారు.. ఎక్కడికి బదిలీ చేసినా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో విధులు కేటాయించకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ ఉద్యోగులు రెండు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. సొంతమండలాల్లోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియ ముగియనుండడంతో ఉన్నతాధికారులు ఏమి చేస్తారో.. ఎలా చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి:
జిల్లాలోని 85 వార్డు, 667 గ్రామ సచివాయాలు.. ఉన్నాయి. వీటిలో సుమారు 6,868 మంది వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల్లో భాగంగా సొంత వార్డు కాకుండా వేరే వార్డులో పనిచేసేందుకు అవకాశం ఇచ్చారు. కానీ, గ్రామ సచివాలయ ఉద్యోగులకు మాత్రం సొంత మండలాన్ని వీడాల్సిందేనంటూ బదిలీల మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. దీంతో వారంతా సొంత మండలానికి దగ్గర్లో ఉన్న సచివాలయాలకు బదిలీ చేయించుకునేలా రాజకీయ నేతల సిఫారసు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది లేఖలు తీసుకుని ఉన్నతాధికారులకు ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో కొన్నిశాఖల్లో సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోలేదు. మరికొన్ని శాఖల్లో మాత్రం పరిగణలోకి తీసుకుని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. రెవెన్యూశాఖలో ఒక తహసీల్దార్ బదిలీ కోసం ఓ ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చారు. కాగా, ఆ తహసీల్దార్‌కు పోస్టింగ్ ఇవ్వకపోగా, గతంలో పనిచేస్తున్న పోస్టు కూడా ఇవ్వలేదు. దీంతో సంబంధిత తహసీల్దార్ దీర్ఘకాలిక సెలవు పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సిఫారసు లేఖలు ఇచ్చేందుకు కొంతమంది సచివాలయ ఉద్యోగులు భయపడుతున్నారు.
సర్వీస్ రికార్ధులో చిరునామా ప్రకారం
సచివాలయ ఉద్యోగులకు వారి సర్వీసు రికార్డుల్లో నమోదైన చిరునామా ఆధారంగా సొంత మండలాన్ని అధికారులు గుర్తిస్తున్నారు. ఈ ఏడాది మే 31 నాటికి ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసినవారికి తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. దృష్టిలోపం, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వెసులుబాటు కల్పించనున్నారు. వారు కోరుకున్నచోటుకు బదిలీ చేయనున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే.. వారికి దగ్గర్లో స్థానానికి వెళ్లే వెసులుబాటు కల్పించారు. ఎ- కేటగిరి సచివాలయంలో ఆరుగురు, బి- కేటగిరిలో ఏడుగురు, సి-కేటగిరిలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉండేలా బదిలీలు చేస్తారు. మిగిలిన ఉద్యోగులను బదిలీల తర్వాత ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. నిబంధనల ప్రకారమే బదిలీలు జరుగుతాయని మెళియాపుట్టి ఎంపీడీవో ప్రసాద్‌పండా తెలిపారు. సర్వీసు రికార్డుల ప్రకారం ఐదేళ్లు ఒకే సచివాలయంలో పనిచేసిన వారి వివరాలను ప్రభుత్వానికి పంపించామన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 11:58 PM