Ration distribution: పొలాల గట్లపై రేషన్
ABN, Publish Date - Jul 11 , 2025 | 11:49 PM
Public distribution system (PDS) రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటు చేసినా.. సిగ్నల్ సక్రమంగా లేక అవస్థలు పడుతున్నారు. పొలాల గట్లు, బహిరంగ ప్రదేశాల్లో సిగ్నల్స్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
వెంటాడుతున్న సిగ్నల్స్ సమస్య
గిరిజనులకు తప్పని ఇబ్బందులు
మెళియాపుట్టి, జూలై 11(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటు చేసినా.. సిగ్నల్ సక్రమంగా లేక అవస్థలు పడుతున్నారు. పొలాల గట్లు, బహిరంగ ప్రదేశాల్లో సిగ్నల్స్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అక్రమాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసింది. గత రెండు నెలలుగా డిపోల్లో డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి 15లోగా రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. కాగా, మెళియాపుట్టి మండలం పోలూరు జీసీసీ డిపోలో మాత్రం ఈ నెల 9 నుంచి రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభించారు. ఒకవైపు సిగ్నల్ లేక బయోమెట్రిక్ కోసం ఇబ్బందులు పడుతుండగా.. ఇక్కడ పనిచేస్తున్న సేల్స్‌మెన్ దేవిడ్‌ను పాతపట్నం జీసీసీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో అల్లూరిసీతారామరాజు జిల్లా జీసీసీ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న కేశవరావును ఈ నెల 10న ఇక్కడ నియమించారు. దీంతో రేషన్ పంపిణీ ఆలస్యమైంది. డిపో పరిధిలో సుమారు 381 రేషన్‌కార్డులు ఉన్నాయి. గ్రామంలో సిగ్నల్ సక్రమంగా లేకపోవడం, రేషన్ సరుకుల పంపిణీకి గడువు సమీపిస్తుండడంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. సిగ్నల్స్ కోసం పొలాల గట్ల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ వేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. సిగ్నల్ సమస్య కారణంగా రోజుకు 20 మంది లబ్ధిదారులకు కూడా సరుకులు అందడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి గిరిజన ప్రాంతాల్లో రేషన్ సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
Updated Date - Jul 11 , 2025 | 11:49 PM