Keerthi chakra: సిక్కోలు మేజర్‌కు అపూర్వ గౌరవం
ABN, Publish Date - May 23 , 2025 | 12:37 AM
Indian Army Rare Honour సిక్కోలు మేజర్‌కు అపూర్వ గౌరవం దక్కింది. సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన ఆర్మీ మేజర్ మళ్ల రామ్‌గోపాలనాయుడుకు.. దేశ రక్షణ చరిత్రలోనే రెండో అత్యుత్తమ పురస్కారమైన ‘కీర్తి చక్ర అవార్డు’ లభించింది. గురువారం రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు.
కీర్తిచక్ర అవార్డుకు రామ్‌గోపాలనాయుడు ఎంపిక
రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
సంతబొమ్మాళి, మే 22(ఆంధ్రజ్యోతి): సిక్కోలు మేజర్‌కు అపూర్వ గౌరవం దక్కింది. సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన ఆర్మీ మేజర్ మళ్ల రామ్‌గోపాలనాయుడుకు.. దేశ రక్షణ చరిత్రలోనే రెండో అత్యుత్తమ పురస్కారమైన ‘కీర్తి చక్ర అవార్డు’ లభించింది. గురువారం రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. 2023లో ఉగ్రవాదులతో విరోచితంగా చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ.. ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌లో పనిచేస్తున్న రామ్‌గోపాలనాయుడు కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మోహరించిన పెట్రోలింగ్ బృందానికి లీడర్‌గా వ్యవహరించారు. 2023 అక్టోబర్26న ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారని సమాచారం అందిన వెంటనే రామ్‌గోపాలనాయుడు రంగంలోకి దిగారు. జవాన్‌లకు మార ్గనిర్దేశం చేస్తూ.. ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు చేయడంతో తన దళాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఒక ఉగ్రవాదిని హతమర్చారు. దాడిని దైర్యంగా ఎదుర్కొని తన సైనికులను కాపాడుకుంటూ.. ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ధైర్యసాహసాలను మెచ్చి.. కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేశారు.
రైతు కుటుంబంలో పుట్టి..
నగిరిపెంటకు చెందిన సన్నకారు రైతు మళ్ళ అప్పలనాయుడు, హేమమాలిని దంపతులకు 1995 జూన్16న రామ్‌గోపాలనాయుడు జన్మించారు. రామ్ గోపాలనాయుడుకు ఇద్దరు తమ్ముళ్లు లక్ష్మీనారాయణ, అజిత్ కుమార్‌తోపాటు భార్య ఐశ్వర్య, కుమార్తె ఐరా ఉన్నారు. విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఆరు నుంచి పదోతరగతి వరకు రామ్‌గోపాలనాయుడు చదివారు. 2012లో స్టాప్ సెలక్షన్ బోర్డు పరీక్ష రాసి పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడ మూడేళ్లు అభ్యసించి 2015-16లో డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలట్రీ అకాడమీ క్యాడెట్‌గా చేరారు. అక్కడ శిక్షణ తీసుకున్న 900 మందిలో గోల్డ్‌మెడలిస్ట్‌గా నిలిచారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. లెఫ్ట్‌లెంట్‌గా రెండేళ్లు పనిచేసి 2018లో కెప్టెన్‌గా పదోన్నతి సాధించారు. 2022లో మేజర్‌గా పదోన్నతి పొందారు. రైతు కుటుంబం నుంచి వచ్చి పిన్నవయస్సులో ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగారు. దేశ రక్షణ వ్యవస్థలో రెండో అత్యున్నత పురస్కారమైన కీర్తిచక్ర అవార్డుకు ఎంపికైన తొలి తెలుగువాడిగా చరిత్రలో నిలిచారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా తన కుమారుడు కీర్తిచక్ర అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని రామ్‌గోపాలనాయుడు తండ్రి అప్పలనాయుడు తెలిపారు. ఈ అవార్డు తమ కుటుంబంతోపాటు గ్రామ, జిల్లాప్రజలకు ఎంతో గర్వకారణమన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:37 AM