రక్షకా.. మారవా?
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:33 PM
జిల్లాలో కొందరు పోలీసులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు.
- కొంతమంది సిబ్బందిపై అవినీతి ఆరోపణలు
- మద్యం దుకాణాలు, క్వారీల నుంచి వసూళ్లు
-కుటుంబ వ్యవహారాల్లోనూ తలదూర్చుతున్న వైనం
-వారిపై వేటు వేస్తున్నా మారని తీరు
శ్రీకాకుళం, జూలై 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు పోలీసులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. మద్యం దుకాణాలు, బార్‌లు, క్వారీల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. రౌడీ షీటర్లతో కూడా లింకులు పెట్టుకొని బెదిరింపులకు దిగుతున్నారు. సివిల్ వ్యవహారాల్లో సైతం తలదూర్చుతున్నారు. పంచాయితీలు చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు కూడా సహకరిస్తున్నారు. ఎవరైనా ముడుపులు ఇవ్వకపోయినా, ప్రశ్నించినా కేసులు పెడతామంటూ భయపెడుతున్నారు. ఆదాయ మార్గాలపైనే దృష్టి సారించి సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారివల్ల పోలీసు శాఖకు మచ్చ ఏర్పడుతోంది. ఎస్పీ మహేశ్వరరెడ్డి సొంతంగా నిఘా వ్యవస్థ ఏర్పరచి అవినీతి పోలీసుల సమాచారం తెప్పించుకుంటూ వారిపై వేటువేస్తున్నారు. అయినా వారి తీరు మారడం లేదు. ఎస్పీ కంట పడకుండా జాగ్రత్తగా అక్రమాలకు పాల్పడుతున్నారు.
కొన్ని ఉదాహరణలు..
-ఎచ్చెర్ల మండలంలో పాలిటెక్నిక్ చదువుకున్న ఓ యువకుడు తెలివిగా దొంగతనాలు చేసేవాడు. ఇళ్లల్లో చొరబడి డబ్బు, బంగారాన్ని కొద్ది మొత్తంలోనే దోచుకునేవాడు. అంటే ఆ ఇంటిలో ఎన్ని తులాల బంగారు ఆభరణాలు ఉన్నా అందులో తులం లేదా రెండు తులాలనే చోరీ చేసేవాడు. దీనివల్ల ఆభరణాలు కనిపించకపోయినా.. అది ఇంటి దొంగల పని అని.. భర్తపై భార్యకు.. భార్యపై భర్తకు లేదా ఇతర కుటుంబ సభ్యులపై అనుమానం కలిగేలా చోరీలకు పాల్పడుతూ తన వరకు సేఫ్‌గా ఉండేవాడు. ఇలాంటి దొంగతనాలు ఎచ్చెర్ల నియోజకవర్గంతో పాటు పక్క జిల్లాలోనూ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. కొద్దిరోజుల కిందట ఆ యువకుడ్ని పట్టుకుని తమదైన విచారణ చేపట్టి భారీమొత్తంలో బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలిసింది. అయితే, రికవరీ కొద్దిగానే చూపించి మిగతా బంగా రాన్ని మూడు వాటాలు వేసుకుని పోలీసులు పంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరి పైఅధికారులకు కూడా వాటా ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అంతర్గత విచారణకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
- ఇచ్ఛాపురం నియోజకవర్గం ఒడిశా రాష్ట్రానికి సరిహద్దుగా ఉంది. ఇక్కడ గతంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగేవి. ఇక్కడ పోస్టింగ్ కోసం పోలీసులు పోటీ పడేవారు. సిఫారసులు చేసుకుని మరీ గతంలో ఇక్కడకు వచ్చేవారు. అయితే, అక్రమాల వ్యవహారం ఎస్పీకి తెలియడంతో ప్రక్షాళన చేసేశారు. అయినా ఓ ఎస్‌ఐ మాత్రం తన తీరు మార్చుకోలేదు. తాను ఏడాది కాలంలో అందుకునే వేతనాన్ని ఒక్క నెలలోనే తీసుకోవాలన్న అత్యాశకు పోయి ఎస్పీ దృష్టిలో పడిపోయారు. ఆ ఎస్‌ఐ అక్రమాలు తెలుసుకుని వెంటనే అక్కడ నుంచి వీఆర్‌కు పంపేశారు.
-కొన్ని నెలల కిందట గార సబ్ ఇన్‌స్పెక్టర్ వ్యవహారం ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో విచారణ నిర్వహించి అక్కడ నుంచి ఎస్‌ఐను వీఆర్‌కు పంపేశారు.
- ఓ రౌడీషీటర్‌తో శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఉన్న లింకులు, వారి మధ్య జరిగిన సంభాషణ ఆడియో ఇటీవల బయటపడింది. ఇది పోలీసులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్‌పై వేటు పడింది. ఎస్‌ఐపై విచారణ జరుగుతోంది.
- జి.సిగడాంలో విగ్రహాల ధ్వంసం కేసులోనే కాకుండా.. ఇతర విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారన్న కారణంతో అక్కడి ఎస్‌హెచ్‌వోను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపేశారు.
- టెక్కలి నియోజకవర్గంలో ఓ ఎస్‌ఐ టీడీపీకి చెందిన ఓ ద్వితీయ స్థాయి నాయకుడి కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చారు. కేసు నమోదు విషయంలో ఆ నాయకుడి నుంచి భారీగా నగదు డిమాండ్ చేసినట్లు ఎస్‌ఐపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
-జిల్లా సరిహద్దు నుంచి ఇసుక దాటవేసే విషయంలో ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. సివిల్ వ్యవహారాల్లో కూడా తెలివిగా తలదూర్చి.. అందులోనూ పెత్తనం చూపిస్తున్నారు కొందరు పోలీసులు. బాధితుల తరఫున కంటే కేసుల్లో స్థాయి.. వాటి విలువ ఆధారితంగా కొన్ని స్టేషన్లలో ముడుపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- పలాస నియోజకవర్గంలో ఓ మండలానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసు లేకుండా చేసేందుకు ఓ ఎస్‌ఐ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌ఐ అడిగినంత ఇచ్చి ఆ యువకులు కేసు నుంచి బయటపడ్డారు. ఇటువంటి ఘటనలు కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చి సంబంధిత పోలీసులపై వేటు పడుతుంది. ఇంకా చాలా వ్యవహారాల్లో పోలీసులు తలదూర్చి డబ్బులు వసూలు చేస్తున్నా అవి బయటపడడం లేదు. ఇప్పటికైనా పోలీసులు తీరు మారుకొని అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు.
మద్యం దుకాణాల నుంచి ముడుపులు
మద్యం దుకాణాల నుంచి పోలీసు స్టేషన్లకు ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలాల్లోని ఒక్కొక్క మద్యం దుకాణం నుంచి రూ.20వేలు, పట్టణాల్లో ఉన్న షాపుల నుంచి రూ.30 నుంచి రూ.40 వేలు, శ్రీకాకుళం నగరంలో బార్‌ల నుంచి రూ.50వేలు ఇలా నెలవారీగా పోలీసు స్టేషన్లకు మామ్మూళ్లు చేరుతున్నట్లు సమాచారం. శ్రీకాకుళం నగరంలో కొన్ని బార్‌ల వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించకుండా ఉండేందుకు స్టేషన్‌కు రూ.50వేలు పైబడి ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక బెల్ట్ దుకాణాలు ఉంటే.. వాటికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Updated Date - Jul 16 , 2025 | 11:33 PM