Rain: వానొచ్చె.. వరదొచ్చె
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:51 PM
Heavy Rainfall జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాలీవాన బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం కురవడంతో శ్రీకాకుళంలో రహదారులు జలమయమయ్యాయి.
జిల్లాలో గాలీవాన బీభత్సం
అరసవల్లి/ హరిపురం, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాలీవాన బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం కురవడంతో శ్రీకాకుళంలో రహదారులు జలమయమయ్యాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణలో నీరు చేరి.. చెరువును తలపించింది. పీఎస్‌ఎన్‌ఎం పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోయింది. శ్రీకాకుళం నగరం, గుజరాతీపేట నుంచి తోటపాలెం వెళ్లే రోడ్డు బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కొన్నిచోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అలాగే ఈదురుగాలుల ప్రభావానికి ప్రకటనల హోర్డింగులు నేలకొరిగాయి. మామిడికాయలు నేలరాలి రైతుల ఆశలను నీరుగార్చాయి.
కూలిన వందేళ్లనాటి వృక్షం
మందస మండలం కొత్తపల్లి పంచాయతీ ముకుందపురం వద్ద మందస- కొత్తపల్లి రోడ్డులో సుమారు వందేళ్లనాటి వృక్షం కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి వీచిన గాలులకు ఈ చెట్టు కూలిపోగా.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్‌అండ్‌బీ అధికారులు స్థానికులతో కలిసి కూలిన వృక్షాన్ని తొలగించారు.
Updated Date - Apr 30 , 2025 | 11:51 PM