Fisheries development: మత్స్యరంగ అభివృద్ధిని ప్రోత్సహించండి
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:07 AM
Aquaculture growth శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి మరింత తోడ్పాటు, ప్రోత్సాహం అందజేయాలని కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్(లాలన్ సింగ్)ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు.
కేంద్రమంత్రిని కోరిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, జూలై 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి మరింత తోడ్పాటు, ప్రోత్సాహం అందజేయాలని కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్(లాలన్ సింగ్)ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. మంగళవారం ఢిల్లీలోని కార్యాలయంలో కేంద్రమంత్రి లాలన్ సింగ్‌తో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, మత్స్యకారుల అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు తీరంలో 194 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరాన్ని కలిగి ఉందని.. దేశంలోనే ప్రముఖ ‘ఆక్వా హబ్’ గా గుర్తింపు పొందిందని తెలిపారు. జిల్లాలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం, వ్యవస్థీకృత మత్స్యవృద్ధిని అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) కింద పలు ప్రతిపాదనలను కేంద్రమంత్రికి వివరించారు. సముద్ర జీవవైవిద్యాన్ని పెంచేందుకు, సంప్రదాయ మత్స్యకారులకు మద్ధతు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 100 కృత్రిమ రీఫ్‌లను 194 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని 20 తీర గ్రామాలను సీఆర్‌సీఎఫ్‌వీ(క్లయిమేట్ రెసిలియంట్ మత్స్యకార గ్రామాలు) కింద ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు, మత్స్యకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న మత్స్య నిల్వ సామర్థ్యాన్ని వెయ్యి నుంచి 2వేల ఫింగర్‌లింగ్స్ హెక్టార్‌కు పెంచడంతోపాటు, అన్ని గ్రామ పంచాయతీ ట్యాంకుల్లో నిల్వకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. దేశీయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎంఎంఎస్‌వై మార్గదర్శకాల ప్రకారం తాము తెలిపిన అంశాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రిని కలసిన వారిలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా ఉన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 12:07 AM