Karif: ఖరీఫ్‌నకు సన్నద్ధం
ABN, Publish Date - May 10 , 2025 | 11:54 PM
Agricultural planning జిల్లాలో వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసింది. విత్తనాల నుంచి ఎరువుల దాకా ఎంతమేర అవసరమో అంచనాలు రూపొందించింది. రైతులకు ఇబ్బందులు రాకుండా రైతుసేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
వ్యవసాయశాఖ ముందస్తు ప్రణాళికలు
41,120 క్వింటాళ్ల విత్తనాలు.. 13వేల మెట్రిక్‌టన్నుల ఎరువులు సిద్ధం
టెక్కలి/ ఇచ్ఛాపురం, మే 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసింది. విత్తనాల నుంచి ఎరువుల దాకా ఎంతమేర అవసరమో అంచనాలు రూపొందించింది. రైతులకు ఇబ్బందులు రాకుండా రైతుసేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇప్పటికే 41,120 క్వింటాళ్ల విత్తనాలు.. జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంది. అక్కడ నుంచి రైతుసేవా కేంద్రాలకు తరలించి.. త్వరలో రైతులకు అందించనుంది. అలాగే 13వేల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాక్ సిద్ధం చేసింది.
జిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్‌లో 4.25 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. వరి, ఇతర ఆహార పంటలతోపాటు ఆయిల్‌పామ్, పత్తి, గోగు తదితర పంటలను వేలాది ఎకరాల్లో పండిస్తారు. వరి విత్తనాలకు సంబంధించి 41,120 క్వింటాళ్లు, పచ్చిరొట్ట, వేరుశనగ 30, కందులు 30, మినుములు 50, పెసలు 50 క్వింటాళ్లు చొప్పున సిద్ధం చేశారు. ముందుగా పచ్చిరొట్ట విత్తనాలు 50 శాతం రాయితీపై రైతులకు అందించనున్నారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి జిల్లా యంత్రాంగం ముందే మేల్కోంది. విత్తన ఎంపికపైనా దృష్టిపెట్టింది. గతంలో రైతులు తమ ప్రాంతాలు, భూమికి అనుగుణంగా విత్తనాలు అవసరమని అడిగారు. కానీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈ ఏడాది ఆ పరిస్థితి రాకుండా అన్నిరకాల విత్తనాలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఈ ఏడాది సన్నరకం విత్తనాలు రైతాంగానికి అందజేయాలని, పంట దిగుబడులు శాతం ఎకరాకు 15శాతం పెంచాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గత ఏడాది ఖరీఫ్‌లో ఎకరాకు 28 బస్తాల వరి దిగుబడులు రాగా, ఈ ఏడాది 32 బస్తాలు ఎకరాకు వరి దిగుబడులు పెంచాలని భావిస్తున్నారు. అలాగే భూమిలో నత్రజని, పొటాష్ సారం పెంచేందుకు 2.300 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం చేశారు.
ఎరువులు ఇలా..
జిల్లాలో ఖరీఫ్ నాటికి 42,225 మెట్రిక్‌టన్నుల యూరియా, 17.206 మెట్రిక్‌టన్నుల డీఏపీ, 4,174 మెట్రిక్‌టన్నుల పొటాష్, 5,149 మెట్రిక్‌టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 297 మెట్రిక్‌టన్నుల సూపర్‌పాస్ఫేట్ ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా మే నాటికే 13వేల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్‌స్టాక్ సిద్ధం చేసింది. జూన్ నాటికి 15వేల మెట్రిక్‌టన్నుల ఎరువులు రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ గోదాముల్లో సిద్ధం చేయాలని సంకల్పించింది. జిల్లాలో వ్యవసాయశాఖ సబ్‌డివిజన్ల వారీ టెక్కలిలో 12,283 మెట్రిక్‌టన్నులు, శ్రీకాకుళంలో 8,500 మెట్రిక్‌టన్నులు, సోంపేటలో 10,223 మెట్రిక్‌టన్నులు ఎరువులు అవసరమని అధికారులు గుర్తించారు. అలాగే రణస్థలంలో 9,531 మెట్రిక్‌టన్నులు, పలాసలో 8,372 మెట్రిక్‌టన్నులు, నరసన్నపేటలో 8,705 మెట్రిక్‌టన్నులు, కొత్తూరులో 11,235 మెట్రిక్‌టన్నుల ఎరువులు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో ఎరువుల వినియోగంలో జి.సిగడాం, నందిగాం మొదటి రెండు స్థానాలు కాగా, చివరి స్థానాల్లో నరసన్నపేట, బూర్జ మండలాలు ఉన్నాయి.
విత్తనాల సిద్ధం ఇలా.. (క్వింటాళ్లలో)
-----------------
1061(ఇంద్ర) - 8,700
1064(అమర) - 3,250
ఎంటీయూ1121 - 8,320
7029 స్వర్ణ - 3,800
ఎంటీయూ 1,318 - 2,050
ఆర్‌జీఎల్ 2537(శ్రీకాకుళం సన్నాలు) - 2,900
3291(సోనామసూరి) - 2,000
5204(సాంబమసూరి) - 660
ఎంటీయూ1224(మార్టూరు సాంబ)- 3,500
కందులు ఎల్‌ఆర్జీ-52 రకం - 30
వేరుశనగ కే6 రకం - 30
మినుము ఐసీయూ2-43 రకం - 50
పెసర ఐపీఎం 2-14 రకం - 50
.................
కొరత రానీయం :
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు ఎరువులు, వితనాల కొరత రానీయం, ఇప్పటికే బఫర్‌స్టాక్ సిద్ధం చేశాం. రైతుసేవా కేంద్రాలు ద్వారా రైతులకు అందజేస్తాం
- బీవీ తిరుమలరావు, వ్యవసాయశాఖ ఏడీ, టెక్కలి
..................
అంతా సిద్ధం
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రణాళిక సిద్ధమైంది. ఈ నెల చివరి వారం లేదా, జూన్ మొదటి వారంలోపు విత్తనాలు రైతు సేవా కేంద్రాలకు పూర్తిస్థాయిలో చేరుకుంటాయి. పీఏసీఎస్‌లతోపాటు ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి. రైతులకు సాగు సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్‌లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
- టి.భార్గవి, మండల వ్యవసాయశాఖ అధికారి, ఇచ్ఛాపురం
Updated Date - May 10 , 2025 | 11:54 PM