Population day: జనాభా వృద్ధి తగ్గుతోంది
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:06 AM
Population Growth జిల్లాలో జనాభావృద్ధి రేటు తగ్గుతోంది. ఆలస్యంగా వివాహాలు కావడం.. ఒత్తిడి జీవన విధానాలతో పిల్లలు కనేందుకు దంపతులు అంత ఆసక్తి చూపడం లేదు.
14 ఏళ్లలో 4.5శాతం మాత్రమే..
మానవవనరులకు పొంచిఉన్న ముప్పు
నేడు ప్రపంచ జనాభా దినం
నరసన్నపేట, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనాభావృద్ధి రేటు తగ్గుతోంది. ఆలస్యంగా వివాహాలు కావడం.. ఒత్తిడి జీవన విధానాలతో పిల్లలు కనేందుకు దంపతులు అంత ఆసక్తి చూపడం లేదు. 2001 జనాభా లెక్కల ప్రకారం 25,37,593 మంది ఉండగా, వారిలో పురుషులు 12,60020 మంది, సీ్త్రలు 12,77,573 మంది ఉన్నారు. అప్పట్లో యువత జిల్లా జనాభాలో 36 శాతం నుంచి 40 శాతం వరకు ఉంది. 2011 జనాభా లెక్కలు పరిశీలిస్తే 27,03,114 మంది జనాభా ఉండగా, వీరిలో పురుషులు 13,41,738 మంది, స్త్రీలు 13,61,376 మంది ఉన్నారు. 2001 జనాభాతో పోలిస్తే 2011లో 6.52శాతం మార్పు చెందగా, ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే జిల్లాలో జనాభా గణనీయంగా తగ్గింది. 2011 నుంచి ఇప్పటివరకూ 4.5 మాత్రమే జనాభా వృద్ధి కనిపిస్తోంది. టెక్నాలజీ పెరిగినా.. జనాభా వృద్ధి తగ్గితే రాబోయే రోజుల్లో మానవ వనరుల లభ్యత లేక ఆర్థికవ్యవస్థకు ప్రమాదం ఏర్పడవచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంక్షోభం చైనాలో ఉన్నందున అక్కడి ప్రభుత్వం పిల్లలను కనేవారికే ప్రోత్సాహకాలను అందిస్తోందని పేర్కొంటున్నారు. ‘దేశ ఆర్థికాభివృద్ధిలో యువత పాత్ర కీలకం. ప్రస్తుతం అత్యధికంగా యువత ఉన్న మన దేశం ఆర్థికపరంగా నాల్గో స్థానంలో నిలిచింది. జిల్లాలో 2001 లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 35 శాతం నుంచి 40శాతం మేరకు యువత ఉంది. 2011 నాటికి కూడా జనాభాలో 40శాతం మేరకు యువత ఉంది. ప్రస్తుత జనాభాలో 42శాతం యువత ఉన్నా.. పిల్లలు సంఖ్య తగ్గింది. దీంతో భవిష్యత్‌లో యువత సంఖ్య కూడా తగ్గనుంద’ని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
తగ్గిన శిశువృద్ధి రేటు
గ్రామాల్లో ఒకప్పుడు ఆరుగురు నుంచి పది మంది వరకు పిల్లలను కనేవారు. కానీ జిల్లాలో 1991 నుంచి శిశువృద్ధి రేటు తగ్గుతూ ఉంది. గతంలో జనాభా తగ్గుదలకు ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ విధానాలు అమలుచేసేవి. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనేవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలకు అన్హరులుగా ప్రకటించడంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. మరోవైపు అధిక జనాభాతో నిరుద్యోగం, పేదరికం, ఆహార కొరత వంటి సమస్యలు ఉంటాయని భావించి.. ప్రజలు జనాభా నియంత్రణ విధానాన్ని అవలంభించారు. ప్రస్తుతం సమాజంలో దంపతులు ఒకరిని కని సరిపెట్టుకుందామని భావిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ స్థానంలో.. చిన్నకుటుంబ వ్యవస్థ నెలకొంది. ఫలితంగా జనాభావృద్ధి ప్రస్తుతం బాగా తగ్గింది. నాడు 21 ఏళ్లకు ముందే పెళ్లిళ్లు జరిగేవి. ప్రస్తుతం పురుషులకు 28-35 ఏళ్ల మధ్యలో వివాహమవుతోంది. పిల్లలను కనేందుకు చాలామందికి ఆసక్తి సన్నగిల్లడంతో శిశువృద్ధి రేటు తక్కువగా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. నాటి రోజుల్లో పిల్లలను పోషించే బాధ్యత ఇంట్లో కుటుంబ పెద్దలు చూసుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేక.. పిల్లలను సంరక్షించేవారు కరువయ్యారు. మరోవైపు ఉపాధి కోసం గ్రామాలు నుంచి పట్టణాలకు తరలివెళ్లడం.. వివాహం, కుటుంబ వ్యవస్థల్లో కూడా మార్పులు రావడం జనాభావృద్ధికి ఆటంకంగా మారింది.
ఆర్ధికాభివృద్ధికి మానవ వనరులే కీలకం
దేశ ఆర్థికవ్యవస్థకు మూలం మానవ వనరులే. మానవ వనరులు కొరత ఏర్పడితే.. ఆర్థిక మాంధ్యం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే మళ్లీ ప్రభుత్వాలు జనాభా వృద్ధికి కోసం ప్రకటనలు చేస్తున్నాయి. సాంకేతిక ఎంత అభివృద్ధి చెందినా.. మానవ వనరులు లేకుండా నిరర్థకం అవుతుంది.
- సత్యనారాయణ, అర్ధశాస్త్ర అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల
అప్పట్లో ఎక్కువ మందిని కనేవారు
నాకు ఎనిమిది మంది పిల్లలు. మా రోజుల్లో శిశుమరణాలు ఎక్కువగా ఉండేవి. ఆ భయంతో ఎక్కువ మందిని కనేవారు. మగబిడ్డ కోసం ఎన్ని కాన్పులైనా ఎదురుచూసేవాళ్లం. ప్రస్తుతం ఆసుపత్రులు పెరిగాయి. శిశుమరణాలు తగ్గాయి.
వెలమల నీలమ్మ, జమ్ము
అప్పటి సమస్యలు లేవు
ఆహారం, వైద్య సదుపాయాలపై ప్రస్తుత రోజుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనాభా పెరిగితే నిరుద్యోగం, ఆహారం వంటి సమస్యలు ఏర్పడతాయనే భయం కొందరిలో ఉండేది. నేడు సాంకేతికత పెరిగింది. అధిక దిగుబడి పంటలు పండిస్తున్నాం. వైద్య సదుపాయాలు పెరిగాయి. సమాచార వ్యవస్థలో మార్పులతో సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చును. అయితే ప్రజలకు కష్టపడే తత్వం ఉండాలి. అది లేకుంటే అధిక జనాభాతో అనర్థమే.
- జ్యోతిఫెడ్రరిక్, గణాంక నిపుణులు, రిటైర్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
శిశువృద్ధి రేటు తగ్గుతోంది
వైద్య సదుపాయాలు పెరిగినా.. ఇద్దరి కంటే ఎక్కువ బిడ్డలను కనేందుకు చాలామంది దంపతులు ఆసక్తిచూపడం లేదు. కుటుంబ నియంత్రణపై భాగా అవగాహన పెరిగింది. యాంత్రీకరణ జీవన విధానంతో పిల్లలను సరిగా చూసుకోలేమనే భావన కూడా ఉండటంతో శిశువృద్ధి తగ్గుతోంది.
- ఆర్. సంధ్యారాణి, గైనకాలజిస్టు, నరసన్నపేట
Updated Date - Jul 11 , 2025 | 12:06 AM