plotical Leaders: జనం మధ్యకు నేతలు
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:29 PM
Political Leaders Public Interaction కూటమి పాలన ఏడాదైన నేపథ్యంలో ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు విపక్షాల ప్రజాక్షేత్రం వైపు కదులుతున్నాయి. తాము చేసిన మంచి పనులతోపాటు వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చుతున్న తీరును ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
అభివృద్ధి, సంక్షేమం తెలియజెప్పేందుకు ‘కూటమి’ సన్నద్ధం
‘సుపరిపాలనలో తొలి అడుగు’ ఆరంభం
జిల్లాలో నేటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన
వైసీపీ నేతలు కూడా ఐదువారాలపాటు ఇంటింటికీ..
ఆందోళనల స్పీడ్ పెంచాలని వామపక్షాల యోచన
2014-19 మధ్య కాలంలో చేసిన మంచి పనులను సరిగ్గా చెప్పుకోలేక.. వైసీపీ దుష్ప్రచారం తిప్పుకోలేక పోవడం వల్ల 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. ఇకపై ఆ పరిస్థితి లేకుండా మనం చేసిన మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరించండి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో ఈ నెల 2 నుంచి జనం మధ్యకు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కూటమి నేతలంతా వెళ్లండి.
- ఇటీవల పార్టీ విస్త్రృతస్థాయి సమావేశంలో నాయకులకు సీఎం చంద్రబాబు ఆదేశాలివీ.
................
‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో ఐదు వారాలపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. ఏడాది కాలంలో సీఎం చేసిన మోసాలను, మాట తప్పిన విధానాలను ప్రజలకు వివరించండి. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ చేసిన శపథాలను గుర్తు చేసి ప్రజలకు తెలియజెప్పండి. హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించండి.
- వైసీపీ నాయకులకు మాజీ సీఎం జగన్ ఆదేశం.
.......................
కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించట్లేదు. ఎన్నికల ముందో మాట, తర్వాత ఇంకో మాట. రైతులు నష్టపోతున్నారు. నిర్వాసితులకు, రైతులకు న్యాయం చేసేవరకూ మూలపేట పోర్టు, కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణాలను అడ్డుకుంటాం. ప్రజాపక్షాన ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తాం. ఆమదాలవలస నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామంటున్న మినీ పవర్‌ప్లాంట్‌ను కూడా అడ్డుకుంటాం.
- పార్టీ అంతర్గత సమావేశాల్లో వామపక్షాల సంకేతాలివి.
.......................
శ్రీకాకుళం, జూలై 1(ఆంధ్రజ్యోతి): కూటమి పాలన ఏడాదైన నేపథ్యంలో ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు విపక్షాల ప్రజాక్షేత్రం వైపు కదులుతున్నాయి. తాము చేసిన మంచి పనులతోపాటు వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చుతున్న తీరును ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నియోజకవర్గాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఏడాదిలో అమలుచేసిన పథకాలు, ప్రజలకు లబ్ధి విధానంపై వివరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పర్యటించనున్నారు. కొన్నింటిలో అడ్డం తగులుతున్న వైసీపీ తీరుతెన్నులను ప్రజల ఎదుటే చర్చించనున్నారు. పార్టీ సూచనల మేరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు తమ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఉమ్మడిగానే ప్రజాక్షేత్రంలో పర్యటించి.. ఏడాది పాలన విజయాలను వివరించనున్నారు.
‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట కార్యక్రమం..
కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు ఆరంభించింది. టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. మేమేమి తక్కువ అనే విధంగా వైసీపీ సైతం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఇంటింటా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 3 నుంచి ఐదు వారాలపాటు ఊరూరా ప్రచారం చేయాలని మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఎలా సాగాలో సంకేతాలిచ్చారు. కాగా, ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు బలహీనపడ్డాయి. కన్వీనర్లు చతికిలపడ్డారు. శ్రీకాకుళంలో సగానికి సగం నియోజకవర్గాల్లో ఇదేతీరు. అయినా సరే పార్టీలో మరికొందరు ఇతర పార్టీల వైపు తొంగి చూడకుండానే ఉండేందుకు వైసీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కొనసాగనున్న వామపక్షాల ఆందోళనలు
నిర్వాసితులు, రైతుల సమస్యలపై వామపక్ష నేతలు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల పోర్టు నిర్వాసితులు, రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్నారు. ఆమదాలవలసలో పవర్‌ప్లాంట్, పలాసలో కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ధోరణులను వ్యతిరేకిస్తూనే, మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీరుతెన్నులను ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉద్యమాలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల జిల్లాలో పర్యటించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇలా అన్ని పార్టీలు జనం మధ్య తేల్చుకోవాలని మినీ ఫైట్‌కు సిద్ధమయ్యాయి.
Updated Date - Jul 01 , 2025 | 11:29 PM