Amaravathi: అండగా నిలిచి.. ఆదరించి
ABN, Publish Date - May 02 , 2025 | 12:20 AM
Capital Region Movement అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. తమ భవిత కోసం... ఉనికి కోసం అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం... సాగించిన పోరాటం చరిత్రలో లిఖించదగ్గదే. అందుకు శ్రీకాకుళం జిల్లా కూడా వేదిక కావడం విశేషం. శుక్రవారం అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా రాజధాని పనులు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమకారులకు జిల్లావాసులు మద్దతుగా నిలిచిన వైనం గురించి తెలుసుకుందాం.
అమరావతి ఉద్యమంలో మనం
రాజధాని రైతుల గుండెల్లో సిక్కోలు
అమరావతి టు అరసవల్లికి అడుగడుగునా అడ్డంకులు
వాటిని అధిగమించి సూర్యభగవానుడి ఆలయం చెంతకు..
ఉద్యమకారులకు జిల్లావాసుల ఆత్మీయ స్వాగతం
రణస్థలం, మే 1(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. తమ భవిత కోసం... ఉనికి కోసం అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం... సాగించిన పోరాటం చరిత్రలో లిఖించదగ్గదే. అందుకు శ్రీకాకుళం జిల్లా కూడా వేదిక కావడం విశేషం. శుక్రవారం అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా రాజధాని పనులు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమకారులకు జిల్లావాసులు మద్దతుగా నిలిచిన వైనం గురించి తెలుసుకుందాం. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. నాటి సీఎం చంద్రబాబుపై నమ్మకంతో 32వేల మంది రైతులు తమ భూములను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని కలలు కన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. విశాఖను పాలనా రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా చేసి ..అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేయాలని చూశారు. దీంతో అమరావతి రైతుల గుండె రగిలిపోయింది. భవిష్యత్‌పై వారు పెట్టుకున్న ఆశలు పేకమేడలా కుప్పకూలిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి టీడీపీ, జనసేన, వామపక్షాలు..ఇలా అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి జై కొట్టాయి. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో అమరావతి రైతులు ఓ వైపు ఆందోళనలు... మరోవైపు న్యాయ పోరాటం చేశారు. ఇంకో వైపు ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టారు. ముందుగా అమరావతి టు తిరుపతి దేవస్థానం కార్యక్రమాన్ని నిర్వహించారు. తరువాత అమరావతి టు అరసవల్లి కార్యక్రమాన్ని తలపెట్టారు. 2022 సెప్టెంబరు 13న అమరావతి నుంచి అరసవల్లికి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. కాని దారి పొడవునా వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధుల అడ్డగింపులు, అరెస్టులు, దాడులు కొనసాగాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో యాత్ర నిలిచిపోయింది. తిరిగి 2023 మార్చి 31న ప్రారంభమైంది. మన జిల్లాలోకి ఏప్రిల్ 2న ప్రవేశించింది. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అమరావతి రైతులకు అప్యాయంగా స్వాగతం పలికారు. అది 29 గ్రామాల సమస్య కాదని.. యావత్ రాష్ట్రానిదని గుర్తించారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని ఆశలు కల్పించినా వినలేదు. అమరావతి ఉద్యమ రైతులకు అండగా నిలిచారు. జేఆర్‌పురం వద్ద రైతులకు ప్రస్తుత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అప్పట్లో స్వాగతం పలికారు. వారికి దుస్తులను అందించారు. అమరావతిలో రథయాత్రగా బయలుదేరిన రైతులు అరసవల్లిలో పూజలు చేశారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉండేలా చూడాలని ప్రత్యక్ష భగవానుని కోరుకున్నారు. సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులతోనే నేడు అమరాతి రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నారని జిల్లా ప్రజలు, అమరావతి రైతులు చెబుతున్నారు.
Updated Date - May 02 , 2025 | 12:20 AM