No rain falls: చినుకు రాలదు.. సాగు సాగదు
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:09 AM
Drying crops .. Nursery damage ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో కొన్నిచోట్ల అడపాదడపా వర్షాలు కురుస్తున్నా, ఎండలు మాత్రం వేసవిని తలపిస్తున్నాయి. చాలాచోట్ల చినుకుజాడ లేక వరిఎదలు, నారుమళ్లు ఎండిపోతున్నాయి.
ఎండిపోతున్న వరిఎదలు. నారుమళ్లు
వర్షం కోసం రైతుల ఎదురుచూపు
నరసన్నపేట, ఇచ్ఛాపురం, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో కొన్నిచోట్ల అడపాదడపా వర్షాలు కురుస్తున్నా, ఎండలు మాత్రం వేసవిని తలపిస్తున్నాయి. చాలాచోట్ల చినుకుజాడ లేక వరిఎదలు, నారుమళ్లు ఎండిపోతున్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలో నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సారవకోట మండలాల్లో ఈ ఏడాది 16వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. 90 శాతం మేరకు ఎదలు వేయగా.. 10శాతం మాత్రమే వరినారు మళ్లు వేశారు. రెండు వారాలుగా వర్షం కురవకపోవడంతో నరసన్నపేట, పోలాకి మండలాల్లో వరి ఎదలు ఎండిపోతున్నాయి. నారుమళ్లు రాగి రంగులో మారుతున్నాయి. వంశధార కాలువల ద్వారా కూడా తగినంత స్థాయిలో నీరు రాకపోవడంతో పొలాల్లోకి వెళ్లడం లేదు. నరసన్నపేట మండలం కామేశ్వరిపేట, లుకలాం, నర్శింగరాయుడు పేట, సుందరాపురం, పారశెల్లి, చోడవరం, ఉర్లాం, చింతువానిపేట, కోమర్తి, మాకివలస, మడపాం, గోపాలపెంట, బాలసీమ, చిక్కాలవలస పోలాకి మండలం జిల్లేడివలస, చీడివలస, ఈదులవలస, సుసరాం, డోల, ఉర్జాం, జడూరు తదితర ప్రాంతాల్లో వరిఎదలు, నారుమళ్లు ఎండిపోయాయి. ఓపెన్ హెడ్‌ఛానెల్స్‌లో నీరు రాక ఉర్లాం, నడగాం, చోడవరం, లుకలాం తదితర ప్రాంతాల్లో పొలాలు బీడుగా కనిపిస్తున్నాయి. దీంతో వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరందించాలని, ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
ఇక్కడ జోరుగా వరినాట్లు..
ఇచ్ఛాపురంలో ఆశించినస్థాయిలో వర్షాలు కురవడంతో జోరుగా వరినాట్లు వేస్తున్నారు. మండలంలో వరిసాగు విస్తీర్ణం సుమారు 8,000 ఎకరాలు కాగా, ఇప్పటికే బూర్జపాడు, బిర్లంగి గ్రామాల్లో 120 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయని వ్యవసాయాశాఖ అధికారి పి.అజయ్‌కుమార్ తెలిపారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 274 మి.మి. కాగా 191 మి.మీ. వర్షపాతం నమోదైంది. 29శాతం లోటు వర్షపాతం ఉన్నా రైతులు వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారని ఏవో తెలిపారు. నాట్లు వేసిన వెంటనే కలుపు నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
Updated Date - Jul 22 , 2025 | 12:09 AM