ఒడిశా టు ముంబాయి
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:56 PM
: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా నుంచి ముంబాయికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులు పోలీసులకు చిక్కారు.
- గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
- ఇచ్ఛాపురంలో పట్టుకున్న పోలీసులు
- 13 కేజీల సరుకు స్వాధీనం
ఇచ్ఛాపురం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా నుంచి ముంబాయికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులు పోలీసులకు చిక్కారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో వారిని అరెస్టు చేసి 13కేజీల 90గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం ఇచ్ఛాపురం సర్కిల్ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నంనాయుడు వెల్లడించారు. ముంబాయికి చెందిన గంజాయి వ్యాపారి అజయ్ ముంబాయిలోనే నివాసముంటున్న చౌరాసియా అనే వ్యక్తిని కలిశాడు. అతని ద్వారా త్రీళోక్ నాధూరామ్ దొల్‌పూరియా అనే వ్యక్తిని కలిసి గంజాయి కావాలని అడిగాడు. దీంతో దొల్ పూరియా తనకు పరిచయమున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఖర్టింగు గ్రామానికి చెందిన సునీల్ పాయక, అతని స్నేహితుడు మహన్ నాయక్‌ను సంప్రదించి గంజాయి కావాలని చెప్పాడు. దీంతో సునీల్ పాయక, మహన్ నాయక్‌లు వారి గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి నంత బీరో నుంచి కేజీ గంజాయి రూ.3వేలు చొప్పున 13కేజీల 90గ్రాములు కొనుగోలు చేశారు. ఆ గంజాయిని త్రిళోక్ నాధూరామ్‌కు అప్పగించారు. ఈ గంజాయిని పట్టుకుని ముంబాయిలోని చౌరాసియాకు కేజీ రూ.8వేలు చొప్పున అప్పగించేందుకు సునీల్ పాయక, త్రిలోక్ నాధూరామ్ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారి కదలికలు అనుమానంగా ఉండడంతో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు పట్టుకుని తనిఖీ చేశారు. వారి బ్యాగుల్లో గంజాయి ఉండడంతో ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయితో పాటు బైక్, మూడు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.
Updated Date - Jul 18 , 2025 | 11:56 PM