Fire station : అగ్నిమాపకశాఖలో సమస్యలెన్నో
ABN, Publish Date - May 19 , 2025 | 12:11 AM
Fire department Operational issues జిల్లాలో అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత వేసవి వేళ రోజూ ఏదోఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా జీడితోటల్లో చిన్నపాటి నిప్పు పెను ప్రమాదానికి కారణమవుతోంది.
అరకొరగా సిబ్బంది కొరత
హోంగార్డులతోనే సర్దుబాటు
శిథిల భవనాల్లోనే కేంద్రాలు
పాత వాహనాలతో తప్పని ఇబ్బందులు
వేసవిలో వెంటాడనున్న ప్రమాదాలు
ఇచ్ఛాపురం, మే 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత వేసవి వేళ రోజూ ఏదోఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా జీడితోటల్లో చిన్నపాటి నిప్పు పెను ప్రమాదానికి కారణమవుతోంది. కాగా.. అగ్నిప్రమాదాల నివారణ దిశగా అగ్నిమాపక శాఖ సన్నద్ధత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆ శాఖకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, ఆమదాలవలస, కొత్తూరు, రణస్థలం, మందస, పొందూరులో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. వైసీపీ హయాంలో పదవీ విరమణ చెందినా.. కొత్తగా నియామకం చేపట్టలేదు. దీంతో అగ్నిమాపక కేంద్రాలను అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. మందస, పొందూరులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుశిక్షితులైన సిబ్బంది లేకపోవడంతో పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం అగ్నిమాపక కేంద్రంలో 29 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 21 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ పోలీస్ శాఖ 8 మంది హోంగార్డులను సర్దుబాటు చేసింది. ఇచ్ఛాపురంలో 16 మందికిగాను 8 మంది మాత్రమే ఉన్నారు. పోలీస్‌శాఖ 8 మంది హోంగార్డులను సర్దుబాటు చేసింది. సోంపేటలో 16 మందికిగాను 8 మంది మాత్రమే ఉన్నారు. ఇద్దరు హోంగార్డులను సర్దుబాటు చేశారు. టెక్కలిలో 16 మందికి ఆరుగురు ఉన్నారు. నలుగురు హోంగార్డులను పోలీస్ శాఖ సర్దుబాటు చేసింది. కోటబొమ్మాళిలో 16 మందికిగాను ఐదుగురే ఉన్నారు. నలుగురు హోంగార్డులను సర్దుబాటు చేశారు. నరసన్నపేటలో 16 మందికిగాను ఏడుగురు మాత్రమే ఉన్నారు. ముగ్గురు హోంగార్డులను సర్దుబాటు చేశారు. ఆమదాలవలసలో 16 మందిగాను ఏడుగురు ఉన్నారు. ఐదుగురు హోంగార్డులను సర్దుబాటు చేశారు. కొత్తూరులో 15 మందికిగాను ఐదుగురు ఉన్నారు. ఆరుగురు హోంగార్డులను సర్దుబాటు చేశారు. రణస్థలంలో 16 మందికిగాను ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఆరుగురు హోంగార్డులను సర్దుబాటు చేశారు.
సొంత భవనాల్లేవ్
జిల్లాలో చాలాచోట్ల అగ్నిమాపక కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. అత్యవసర సేవలు అందించే విభాగాలకు వాహనాలు సమకూర్చాల్సి ఉన్నా, గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దీంతో ఇప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. పొందూరులో మార్కెట్ యార్డులో కార్యాలయం నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్‌లో వాహనాన్ని నిలుపుతున్నారు. సోంపేట, కొత్తూరు, ఇచ్ఛాపురంలో అగ్నిమాపక కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని స్టేషన్ల వద్ద నీరు నింపేందుకు బోర్లు లేవు. సమీపంలోని కాలువలు, చెరువుల్లో నీటిని నింపాల్సి వస్తోంది. చాలాకేంద్రాల వద్ద సిబ్బందికి కనీసం మరుగుదొడ్లు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాల నాటి వాహనాలు కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు సిబ్బందిని నియామకం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇబ్బందులు లేకుండా..
అగ్నిమాపక శాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తున్నాం. సిబ్బంది కొరత వాస్తవమే. ఫైర్‌మెన్లతోపాటు డ్రైవర్ల కొరత ఉంది. అయినా సరే ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తున్నాం. కొత్త ఫైరింజన్లతోపాటు కొత్త భవనాలకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో నిధుల విడుదలకు అవకాశం ఉంది. వేసవి దృష్ట్యా అప్రమత్తంగానే ఉన్నాం.
- మోహనరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, శ్రీకాకుళం
Updated Date - May 19 , 2025 | 12:11 AM