No Normal deliveries: గర్భిణులకు.. కోతలే
ABN, Publish Date - Jul 27 , 2025 | 11:51 PM
C-section increase ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు తగ్గుముఖం పడుతున్నాయి. నెలలు నిండిన గర్భిణులు ఆస్పత్రికి వెళ్తే చాలు.. సాధారణ ప్రసవం కోసం ఎదురుచూడకుండా ఆపరేషన్ చేసేయడమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు సగం ఇదే పరిస్థితి ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ప్రసవం అంటేనే ‘సిజేరియన్’ తప్పనిసరి అన్నట్టు పద్ధతి మార్చేశారు.
జిల్లాలో తగ్గుతున్న సాధారణ ప్రసవాలు
ప్రైవేటు ఆస్పత్రుల్లో 90 శాతం సిజేరియన్లు
ప్రభుత్వ ఆస్పత్రులోనూ దాదాపు సగం మందికి ఆపరేషన్లు
కానరాని అధికారుల పర్యవేక్షణ
‘మిడ్‌వైవ్స్’తోనైనా మార్పు వచ్చేనా?
శ్రీకాకుళం, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు తగ్గుముఖం పడుతున్నాయి. నెలలు నిండిన గర్భిణులు ఆస్పత్రికి వెళ్తే చాలు.. సాధారణ ప్రసవం కోసం ఎదురుచూడకుండా ఆపరేషన్ చేసేయడమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు సగం ఇదే పరిస్థితి ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ప్రసవం అంటేనే ‘సిజేరియన్’ తప్పనిసరి అన్నట్టు పద్ధతి మార్చేశారు. ‘బిడ్డ అడ్డం తిరిగింది.. పరిస్థితి విషమించింది.. సిజేరియన్ చేయాల్సిందే’నంటూ వైద్యులు చెప్పడంతో చేసేదేమీ లేక గర్భిణుల కుటుంబ సభ్యులు ఆపరేషన్‌కు అంగీకరిస్తున్నారు. ఏడాదికోసారైనా పర్యవేక్షించేవారు లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ఆపరేషన్ల పేరిట బిల్లుల రూపంలో రూ.వేలల్లో దోచుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో దశాబ్దం కిందట సాధారణ ప్రసవాలే జరిగాయి. తల్లీబిడ్డ ఆరోగ్యమే లక్ష్యంగా ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమిచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ గర్భిణులకు ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. వెయ్యి మంది గర్భిణుల్లో 495 సాధారణ ప్రసవాలు.. 505 సీజిరేయన్లు ఉంటున్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో దాదాపు 90శాతం మందికి ఆపరేషన్లు చేస్తూ కోత కోసేస్తున్నారు. 2024-25 సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 28,846 ప్రసవాలు జరిగాయి. ఇందులో సాధరణ ప్రసవాలు.. 7,183 కాగా.. 21,663 మంది గర్భిణులకు సిజేరియన్ చేశారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 6,288 ప్రసవాలు అయ్యాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 1,535 మాత్రమే. మిగిలిన 4,753 సిజేరియన్ డెలివరీలే. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొంతమంది గర్భిణుల కుటుంబ సభ్యులు కూడా ముహూర్తం చూసుకుని.. సి-సెక్షన్(సిజేరియన్) చేయించేస్తున్నారు. ఈక్రమంలో ఆపరేషన్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
‘మిడ్‌వైవ్స్’ పేరిట శిక్షణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేలా.. వైద్యసిబ్బంది, స్టాఫ్‌నర్శులకు ప్రభుత్వం ‘మిడ్‌వైవ్స్’ పేరిట శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్శులను ఎంపిక చేయనుంది. అతిత్వరలో మిడ్‌వైవ్స్ అందుబాటులోకి రానుంది. ఒక్కో ‘మిడ్‌వైవ్’ కోసం సుమారు రూ.2.50 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ విధానంతోనైనా జిల్లాలో ఆపరేషన్ల సంఖ్య తగ్గి.. సాధారణ ప్రసవాలు పెరుగుతాయోమో.. వేచిచూడాలి.
కానరాని తనిఖీలు
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు.. ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీచేసి.. గర్భిణులకు నిజంగా సిజేరియన్ అవసరమా.. అన్నది స్వయంగా పరీక్షిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. కానీ ప్రైవేటు ఆస్పత్రులవైపు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెళ్లడంలేదు. పైగా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులే అత్యధికంగా ప్రైవేటు ఆసుపత్రిల్లో ఉంటూ.. సొంత క్లినిక్‌లు నడుపుతున్నారు. వీరిజోలికి వెళ్లే ధైర్యం ఉన్నతాధికారులు కూడా చేయట్లేదు. ఇప్పటికైనా కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న సిజేరియన్లు.. వాటి స్థితిగతులపై సమీక్ష నిర్వహించి.. ప్రైవేటు ఆసుపత్రిల్లో జరుగుతున్న ‘సి-సెక్షన్’ ర్యాండమ్‌గానైనా ప్రత్యేక బృందంతో పరిశీలన చేస్తే అనవసరపు కడుపుకోతలకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు భావిస్తున్నారు.
జిల్లాలో 2024-25లో ప్రసవాలు ఇలా ==========================================
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో
నెల సాధారణం సిజేరియన్ సాధారణం సిజేరియన్
==========================================
ఏప్రిల్ 319 365 133 1,048
మే 406 536 207 1,385
జూన్ 465 490 215 1,361
జూలై 434 458 184 1,298
ఆగస్టు 419 463 200 1,400
సెప్టెంబరు 441 500 210 1,411
అక్టోబరు 439 548 230 1,560
నవంబరు 454 503 243 1,433
డిసెంబరు 388 504 237 1,449
జనవరి 357 461 232 1,413
ఫిబ్రవరి 294 390 173 1,172
మార్చి 301 387 202 1,128
==========================================
మొత్తం 4,717 5,605 2,466 16,058
=============================================
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు
==========================================
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో
నెల సాధారణం సిజేరియన్ సాధారణం సిజేరియన్
==========================================
ఏప్రిల్ 304 335 170 1040
మే 344 434 212 1,317
జూన్ 319 413 186 1,214
==========================================
మొత్తం 967 1,182 568 3,571
==========================================
Updated Date - Jul 27 , 2025 | 11:51 PM