housing: గృహహక్కు లేదు.. నగదూ లేదు!
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:08 AM
Housing Scheme Delay కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇళ్ల మంజూరుకు చర్యలు చేపడుతోంది. అయితే వైసీపీ హయాంలో ఇల్లు, ఇళ్ల పట్టా మంజూరైందని చూపుతూ చాలామంది దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి.
వైసీపీ హయాంలో ఓటీఎస్ పేరిట మోసం
శాశ్వత హక్కు అంటూ డబ్బుల వసూలు
నాలుగేళ్లు అవుతున్నా అతీగతీ లేని వైనం
ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
ఇచ్ఛాపురం, జూలై 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇళ్ల మంజూరుకు చర్యలు చేపడుతోంది. అయితే వైసీపీ హయాంలో ఇల్లు, ఇళ్ల పట్టా మంజూరైందని చూపుతూ చాలామంది దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపు వైసీపీ హయాంలో రూ.10వేలు కట్టిన చాలామంది లబ్ధిదారులు ఓటీఎస్(వన్‌టైమ్ సెటిల్‌మెంట్) పత్రం కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వరకూ గృహ నిర్మాణ పథకంలో భాగంగా మంజూరైన ఇళ్లకు వైసీపీ సర్కారు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తీసుకొచ్చింది. దశాబ్దాల కిందట నిర్మించిన ఇళ్లకు కొలతలు తీసి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామని అధికారులు నమ్మబలికారు. చాలామంది వద్ద డబ్బులు కట్టించుకున్నారు. ఇది జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా దానికి సంబంధించి సంపూర్ణ గృహహక్కు పత్రాలు ఇంతవరకూ మంజూరు చేయలేదు. తమ డబ్బులైనా తిరిగి ఇవ్వాలని.. లేదంటే ధ్రువపత్రాలైనా అందించాలని కోరుతున్నారు.
నాలుగు కేటగిరీలుగా..
అప్పట్లో లబ్ధిదారులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ‘కేటగిరి- ఏ’ కింద లబ్ధిదారుడు గృహనిర్మాణ సంస్థ నుంచి అప్పుగా తీసుకొని ఉండి మృతిచెందితే.. వారి వారసులకు పట్టా అందిస్తారు. ఓటీఎస్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఉంటే రూ.10వేలు, మునిసిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌లో రూ.20వేలు చొప్పున వసూలు చేశారు. ‘కేటగిరి-బి’ కి సంబంధించి రుణం తీసుకున్న వ్యక్తి నుంచి ఇతరులు ఆ ఇంటిని కొనుగోలు చేసినా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశమిచ్చారు. ఇందుకుగాను గ్రామీణ ప్రాంతాల్లో రూ.20వేలు, మునిసిపాలిటీల్లో రూ.30వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.40వేలు వసూలు చేపట్టారు. ‘కేటగిరి - సి’కి సంబంధించి ప్రభుత్వ రుణం పొందకుండా.. సొంతంగా ఇంటిని నిర్మించుకున్నవారి నుంచి రూ.10వేలు చొప్పున వసూలు చేశారు. ‘కేటగిరి- డి’ కింద ప్రభుత్వం పట్టా ఇచ్చిన తరువాత.. దానిని అమ్ముకుంటే కొనుగోలు చేసిన వారి దగ్గర... గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, మునిసిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌లో రూ.20వేల వంతున వసూలు చేశారు.
ఇదీ పరిస్థితి..
జిల్లావ్యాప్తంగా అధికారులు, సచివాలయ సిబ్బంది బలవంతంగా వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలో 1983-2011 మధ్య 4 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులు ఉన్నట్టు అప్పట్లో గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.120 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ చాలామంది ఓటీఎస్‌పై ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ లబ్ధిదారులపై ఒత్తిడి చేసి.. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.10 కోట్లు వసూలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఓటీఎస్ విషయంలో లబ్ధిదారులే కాదు.. అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ బాధ్యులే. ఇంతవరకూ లబ్ధిదారులకు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేదు. పేదల పింఛన్లు తొలగిస్తామని, సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని అప్పట్లో బెదిరించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ముడిపెట్టారు. రుణాలు తీసుకున్నవారు తప్పకుండా రిజిస్ర్టేషన్ చేసుకోవాల్సిందేనని ఒత్తిడి పెంచారు. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నవారితో రుణాలు ఇప్పించి మరీ రిజిస్ర్టేషన్లు చేయించారు. అయితే ఇలా రిజిస్ర్టేషన్లు చేసుకున్నా చాలామందికి ఇప్పటికీ డాక్యుమెంట్లు ఇవ్వలేదు. మరికొందరికి ఇచ్చినా అందులో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. అప్పట్లో టార్గెట్లు పూర్తిచేయని సచివాలయ సిబ్బందిపై వేటు కూడా వేసిన సందర్భాలున్నాయి. ఇంత చేసినా లబ్ధిదారులకు మాత్రం న్యాయం చేయలేకపోయారు. ఆయా బాధితులంతా తమకు న్యాయం చేయాలంటూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ‘మీ-కోసం’ కార్యక్రమంలో చాలామంది వినతులు అందజేస్తున్నారు.
Updated Date - Jul 11 , 2025 | 12:08 AM