Tower problems: కొత్త టవర్లు.. పాత కష్టాలు!
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:36 AM
Problems for signals గిరిజన ప్రాంతాల్లో సెల్‌టవర్లు ఉన్నా.. నెట్‌వర్క్ సమస్యలు వెంటాడుతున్నాయి. సిగ్నల్స్ సక్రమంగా అందక ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు
సిగ్నల్స్ కోసం పాట్లు
పట్టించుకోని అధికారులు
మెళియాపుట్టి మండలం పెద్దకేదారి గ్రామ సమీపంలో 700 మెగా హెడ్ ప్రీక్వెన్సీతో ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్మించారు. దీని సామర్థ్యం ప్రకారం 3.5కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో సైతం నెట్‌వర్క్ ఉండాలి. కానీ అక్కడ 4జీ, 5జీ సెల్‌ఫోన్లు లేనివారికి నెట్‌వర్క్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గడపలో, ఇంటి బయట ప్రాంతాల్లో ఇతర నెట్‌వర్క్ సిగ్నల్స్ కూడా రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
...................
మెళియాపుట్టి మండలం మూలనేలబొంతు, రింపి, గొట్టిపల్లి, కేరాశింగి బందపల్లి గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త టవర్లు నిర్మించారు. ఇక్కడ కూడా 700 మెగా హెడ్ ఫ్రీక్వెన్సీతో టవర్లు ఏర్పాటు చేయగా.. నెట్‌వర్క్ రాక ఇబ్బందులు పడుతున్నారు. నెట్‌వర్క్ సమస్యతో సచివాలయ సిబ్బందికి, ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
మెళియాపుట్టి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో సెల్‌టవర్లు ఉన్నా.. నెట్‌వర్క్ సమస్యలు వెంటాడుతున్నాయి. సిగ్నల్స్ సక్రమంగా అందక ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట సెల్‌టవర్లు మంజూరు చేసింది. స్థల సమస్య కారణంగా అధికంగా టవర్లు ఏర్పాటు పూర్తికాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరించి.. టవర్లు ఏర్పాటు చేసింది. కానీ, ప్రస్తుతం సిగ్నల్ సమస్య వెంటాడుతోంది.
టవర్లు ఉన్నా.. ప్రయోజనమేదీ
సీతంపేట ఐటీడీఏ పరిధిలో రెండేళ్ల కిందట 64 సెల్‌టవర్లు మంజూరయ్యాయి. వాటికి అవసరమైన స్థలసేకరణ బాధ్యతను ఐటీడీఏకు ప్రభుత్వం అప్పగించింది. టవర్ల నిర్మాణానికి ట్రెకార్ నిధులు సైతం మంజూరు చేసింది. సీతంపేట మండలంలో 42, మెళియాపుట్టి మండలంలో 15, నందిగాం, భామిని, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం మండలాల్లో ఒక్కో టవర్ నిర్మించారు. కాగా అన్నిచోట్లా నెట్‌వర్క్ సమస్యలు కనిపిస్తున్నాయి. సిగ్నల్ సమస్య కారణంగా ప్రభుత్వ పథకాలు అందడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ సరుకులు, పింఛన్లకు సంబంధించి బయోమెట్రిక్ నమోదు కావడం లేదని వాపోతున్నారు. సాంకేతిక సమస్య పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకునే నాథులు కరువయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ నెల నుంచి డీలర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా.. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ డిపోల వద్దకు నెట్‌వర్క్ అందడం లేదు. దీంతో చెట్ల కొమ్మల వద్ద ఓ బాక్స్‌లో సెల్‌ఫోన్లు ఉంచి.. అక్కడి నుంచి వైపై ద్వారా చెరువు గట్టు వద్ద బయోమెట్రిక్ వేయిస్తున్నారు. అలాగే సచివాలయాలకు నెట్‌వర్క్ అందక సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిటికీలు, బయట ప్రాంతాల్లో బాక్సులు అమర్చుతున్నారు. అందులో ఫోన్ ఉంచి సిగ్నల్స్ కోసం పాట్లు పడుతున్నారు. నెట్‌వర్క్ సమస్య పరిష్కారం కావాలంటే 2100 మెగా హెడ్ ప్రీక్వెన్సీ టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
ఆగస్టు నాటికి..
మారుమూల ప్రాంతాల్లో ఉన్న టవర్లకు సైతం.. ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో సిగ్నల్స్ అందుబాటులోకి వస్తాయి. సుమారు 15 టవర్లకు సాంకేతిక పనులు జరుగుతున్నాయి. అలాగే పైబర్‌నెట్ పనులు చేస్తున్నాం. సిగ్నల్స్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.
- సెల్‌టవర్ ఇంజనీర్ రమణరావు, టెక్కలి
Updated Date - Jun 09 , 2025 | 12:36 AM