NEET: నీట్‌కు పక్కాగా ఏర్పాట్లు
ABN, Publish Date - Apr 29 , 2025 | 10:45 PM
NEET: జిల్లాలో నీట్ పరీక్షను సజావుగా నిర్వహిస్తామని, మే 4వ తేదీన జరిగే ఈ పరీక్షల కోసం పక్కాగా ఏర్పాట్లు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు.
- జిల్లాలో నాలుగు కేంద్రాలు
- జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీట్ పరీక్షను సజావుగా నిర్వహిస్తామని, మే 4వ తేదీన జరిగే ఈ పరీక్షల కోసం పక్కాగా ఏర్పాట్లు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్‌లతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఆర్‌జేయూకేటీ (ఎచ్చెర్ల), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (గుజరాతీపేట), ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (శ్రీకాకుళం), కేంద్రీయ విద్యాలయం (శ్రీకాకుళం) ఉన్నాయని తెలిపారు. మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తెలిపారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్‌లో పొందుపరిచిన నిబంధనలు పాటించాలని సూచించారు. ఫొటోలు వీడియోలు తీయడం నిషేధమన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్తుకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థుల రవాణా కోసం బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ఫర్మేషన్ అధికారి కిరణ్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్, నీట్ సిటీ కోఆర్డినేటర్ సుహాయిబ్ ఆలయం, చీఫ్ సూపరింటెండెంట్ పీవీ రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 10:45 PM