ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పూడిక .. పిచ్చిమొక్కలు

ABN, Publish Date - Jun 26 , 2025 | 12:00 AM

వంశధార ప్రధాన ఎడమ కాలువ అధ్వానంగా ఉంది. ఎటుచూసినా పూడికలు, పిచ్చిమొక్కలు, రాళ్లతో కాలువ దర్శనమిస్తోంది.

టెక్కలి సమీపంలో వంశధార కాలువ ఇలా..

- ఇదీ వంశధార ఎడమ కాలువ పరిస్థితి

- ఖరీఫ్‌ ప్రారంభమైనా కానరాని పనులు

- శివారు ప్రాంతాలకు సాగునీరు ప్రశ్నార్థకం?

టెక్కలి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): వంశధార ప్రధాన ఎడమ కాలువ అధ్వానంగా ఉంది. ఎటుచూసినా పూడికలు, పిచ్చిమొక్కలు, రాళ్లతో కాలువ దర్శనమిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా ఇంత వరకు అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో శివారు ప్రాంతాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వరకు 104.71 కిలోమీటర్ల పొడవునా వంశధార ప్రధాన ఎడమకాలువ ఉంది. సుమారు 12 మండలాల్లోని 1.48లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అలాగే 25 ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 29,247 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఏటా జూలై మొదటి, రెండో వారాల్లో ఎడమ కాలువ వెంబడి సాగునీరు విడిచిపెడుతుంటారు. దీనికి ముందే కేటగిరి-ఏ పనుల కింద కాలువలో పూడికలు, పిచ్చిమొక్కలు, రాళ్లు వంటివి తొలగించాల్సి ఉంది. కానీ, ఈ ఏడాది అటువంటి పనులు పెద్దగా జరగలేదు. ఎడమ కాలువ నుంచి 2,460 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టాల్సి ఉన్నా గట్లు బలహీనత, షట్టర్లు లేకపోవడం, అండర్‌పాసేజ్‌ సమస్యలు, సర్‌ప్లస్‌వైర్ల ఇబ్బందులు, పూడికలు తొలగించకపోవడం వంటి కారణాలతో పూర్తిస్థాయిలో సాగునీరు వదలడం లేదు. టెక్కలి ప్రాంతానికి 860 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉన్నా 600 క్యూసెక్కులు కూడా చేరడం లేదు. గొల్లూరు వద్ద ఎడమ కాలువపై వంతెన నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో శివారు ప్రాంత రైతాంగంలో ఆందోళన నెలకొంది. శివారు ప్రాంతానికి సాగునీరు చేరాలంటే టెక్కలి, నరసన్నపేట డివిజన్‌ యంత్రాంగాలు తీవ్రంగా కష్టపడాల్సి ఉంది. కాగా, నీటి విడుదలకు సంబంధించి ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమై నీటి విడుదల తేదీలను నిర్ణయించాలి. కానీ, జూన్‌ పూర్తవుతున్నా ఇంతవరకు ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు సమావేశం జరగలేదు. ఈ సమావేశం కోసం ఎడమ కాలువ పరిధిలోని 11మంది డిస్ట్రిబ్యూటరీకమిటీ చైర్మన్లు ఎదురుచూస్తున్నారు. అదే విధంగా వంశధారలో అరకొరా సిబ్బంది, లస్కర్ల నియామకం పూర్తిగా జరగకపోవడంతో కాలువల పరిస్థితిని గమనించే వారే కరువయ్యారు. దీనిపై వంశధార ఈఈ బి.శేఖరరావును వివరణ కోరగా.. ‘గొల్లూరు వద్ద వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పది, పదిహేను రోజుల్లో పూర్తిచేస్తాం. శివారు ప్రాంతాలకు సాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

Updated Date - Jun 26 , 2025 | 12:00 AM