Agriculture : రైతులకు మరిన్ని సేవలు..
ABN, Publish Date - May 14 , 2025 | 12:16 AM
Farmers Agricultural support క్షేత్రస్థాయిలో రైతులకు మరిన్ని సేవలు అందించేలా వ్యవసాయ, ఉద్యానశాఖల్లో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయాల్లో క్లస్టర్స్‌గా మార్చి.. రైతులు సాగుచేసే పంటల విస్తీర్ణం అనుగుణంగా గ్రామీణ వ్యవసాయ, ఉద్యానశాఖ సహాయకుల్ని నియమించనుంది.
వ్యవసాయ, ఉద్యానశాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది రేషనలైజేషన్
పంటల విస్తీర్ణం ఆధారంగా బాధ్యతలు
టెక్కలి, మే 13(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో రైతులకు మరిన్ని సేవలు అందించేలా వ్యవసాయ, ఉద్యానశాఖల్లో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయాల్లో క్లస్టర్స్‌గా మార్చి.. రైతులు సాగుచేసే పంటల విస్తీర్ణం అనుగుణంగా గ్రామీణ వ్యవసాయ, ఉద్యానశాఖ సహాయకుల్ని నియమించనుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల యూనిట్‌గా హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 6,03,760 ఎకరాల భూములకు తగ్గట్టు 556 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులు, 85 మంది గ్రామీణ ఉద్యానవనశాఖ అధికారులు, ఒక గ్రామీణ సెరీకల్చర్ సహాయకులు, అర్బన్ ప్రాంతాల్లో 18 మంది మండల విస్తరణాధికారులు మొత్తంగా 660 మందిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి పల్లపు ప్రాంతాల్లో గ్రామీణ వ్యవసాయ సహాయకులు, కొండలు, తీరప్రాంతాల్లో గ్రామీణ ఉద్యానవనశాఖ సహాయకులకు క్షేత్రస్థాయి బాధ్యతలు పెరగనున్నాయి. ఒక్కో గ్రామీణ వ్యవసాయ సహాయకులకు సుమారు 940 ఎకరాల వరకు, గ్రామీణ ఉద్యానవనశాఖ సహాయకులకు 600 ఎకరాల వరకు రైతులు పండించే పంటలకు బాధ్యులుగా ఉంచాలని నిర్ణయించారు. అలాగే 1200 ఎకరాల భూమి విస్తీర్ణం దాటిన తరువాత మండల విస్తరణాధికారులను నియమించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇంకా అవసరమైతే 16మంది వరకు మల్టీపర్పస్ విస్తరణాధికారులను తీసుకోనున్నారు. జిల్లా పునర్విభజనకు ముందు 820 సచివాలయాలకు, 18 అర్బన్ సచివాలయాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండగా, తాజాగా రేషనలైజేషన్ ప్రాప్తికి 660 మందికి కుదించనున్నారు. అయితే జిల్లాలో మిగిలిన సిబ్బందిని ఏ రకంగా భర్తీ చేస్తారో వేచిచూడాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 556 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులు ఉండడంతో రేషనలైజేషన్ ప్రక్రియ ఇబ్బందులు లేకుండా జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతిపాదనలపై గ్రామీణ ఉద్యానవన సహాయకులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై టెక్కలి వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు బీవీ తిరుమలరావు వద్ద ప్రస్తావించగా.. ‘గ్రామీణ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు రైతులకు అన్నివిధాలా క్షేత్రస్థాయిలో సహాయపడేందుకు ఈ ప్రతిపాదనలు ఉపకరించనున్నాయి. ప్రతి వీఏఏకు 900 ఎకరాల విస్తీర్ణం పైబడి బాధ్యతలు అప్పగించనున్నామ’ని తెలిపారు.
Updated Date - May 14 , 2025 | 12:16 AM