డబ్బులు వచ్చాయి.. వెనక్కి వెళ్లాయి
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:36 PM
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మొదటి మూడేళ్లు మాత్రమే కొత్త పింఛన్లు మంజూరయ్యాయి.
- పంపిణీ కాని కొత్త వితంతు పింఛన్లు
- రెండు నెలలుగా ఇదే పరిస్థితి
- జిల్లాకు 3,824 పెన్షన్లు మంజూరు
టెక్కలిరూరల్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
టెక్కలి మండలం కిట్టలాపాడు గ్రామానికి చెందిన మోద లక్ష్మీనారాయణ కిడ్నీ వ్యాధితో ఏడాది కిందట మృతి చెందాడు. ఆయన భార్యకు కూటమి ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేసింది. గత నెలలో పింఛన్ సొమ్ము అందించాల్సి ఉన్నా ఇవ్వకపోవడంతో ఆమె ఆందోళన చెందుతోంది.
టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన దారపు జోగారావు మృతి చెంది ఏడాది దాటింది. ఆయన భార్య ప్రేమకు ఇటీవల వితంతు పింఛన్ మంజూరైంది. ఈ నెల డబ్బులు వచ్చినప్పటికీ ఆమెకు ఇవ్వలేదు. కారణం ఏమిటో తెలియదుగాని పింఛన్ సొమ్మును తిరిగి ప్రభుత్వానికి కార్యదర్శి జమచేశారు.
మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన కొంచడ దండాశి మృతి చెంది ఏడాది దాటింది. గతంలో దండాశికి పింఛన్ వచ్చేది. అతని మృతితో ఆ పింఛన్‌ను భార్య అప్పలమ్మకు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆమెకు ఇంతవరకు పింఛన్ అందలేదు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మొదటి మూడేళ్లు మాత్రమే కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. తరువాత రెండేళ్లు వాటిని ఇవ్వలేదు. అయితే, ఆ రెండేళ్లలో కొత్త పింఛన్ల కోసం అధిక దరఖాస్తులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, వితంతువుల పింఛన్ మొత్తాన్ని ఒకేసారి రూ.వెయ్యి పెంచి రూ.4వేలు చేశారు. అలాగే, 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య కాలంలో మృతి చెందిన పింఛన్‌దారులకు సంబంధించి వారి జీవిత భాగస్వాములకు కొత్త పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది మే నెలాఖరుకు అర్హుల జాబితాను ప్రకటించి, జూన్ 12 నుంచి పంపిణీ చేస్తామని చెప్పింది. కానీ, జూలై పూర్తవుతున్నా ఇంకా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో వితంతువులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో కొత్తగా స్పౌజ్ పింఛన్లు 3,824 మంజూరయ్యాయి. వీటికి సంబంధించి సుమారు రూ.1.52కోట్లు నిధులు వచ్చాయి. గత నెల 12న పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఏమైందో గానీ డబ్బులు పంపిణీ చేయకుండా తిరిగి ప్రభుత్వానికి జమచేశారు. ఈ నెలలో పంపిణీ చేసేందుకు మళ్లీ రూ.1.52కోట్లు మంజూరయ్యాయి. కానీ, ఈ నెల కూడా వితంతువులకు నిరాశే ఎదురైంది. వచ్చిన డబ్బులను కార్యదర్శులు తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమచేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తమ భాగస్వామ్య పార్టీలతో కలిసి అట్టహాసంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావించింది. అయితే, వివిధ కారణాలతో అది సాధ్యపడడం లేదు. మరోపక్క టీడీపీ నాయకులు సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. దీంతో కొత్త పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆదేశాలు రావాలి
కొత్తపింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అందుకే రెండు నెలల సొమ్ము వచ్చినా తిరిగి ప్రభుత్వానికి జమ చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం
-ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి
Updated Date - Jul 16 , 2025 | 11:36 PM