10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:03 AM
జిల్లాలో ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
- విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్/సోంపేట, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయవచ్చన్నారు. ఆ రోజున అమ్మపేరుతో మొక్కలు నాటడం, ఆటలపోటీలు, సహపంక్తి భోజనాలు ఇలా పండుగ వాతావరణంలో సమావేశాలను నిర్వహించాలని అన్నారు. శ్రీకాకుళం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అవార్డు వచ్చిందని కలెక్టర్ వెల్లడించారు. రక్తదానం చేయడానికి రెడ్‌క్రాస్ సొసైటీ లేదా రిమ్స్‌కైనా వెళ్లవచ్చని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, డీఆర్వో ఎం. వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా, తదితరులు పాల్గొన్నారు.
మీటింగ్ ఇలా..
10వ తేదీ ఉదయం 9 గంటలకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రారంభమవుతాయి. తల్లిదండ్రులు, ఇతర ప్రముఖలను పాఠశాలలకు ఆహ్వానిస్తారు. అక్కడ ఏర్పాటు చేసే ఓపెన్‌హౌస్ ఫొటోబూత్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఫొటో దిగుతారు. అనంతరం తమ పిల్లలతో కలసి వారి తరగతి గదుల్లో తల్లిదండ్రులు కూర్చొనేలా, ఇతర ప్రముఖులు హెచ్‌ఎం గదిలో ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రతివిద్యార్థి తల్లిదండ్రులతో సంబంధిత క్లాస్ టీచర్ ప్రత్యేకంగా సమావేశమై పిల్లల సమగ్ర పురోగతి కార్డులు(పోగ్రస్), హెల్త్‌కార్డులు అందిస్తారు. అదేసమయంలో తల్లికి వందనం పథకం, గుడ్‌టచ్, బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంట్ మీటింగ్, మనబడి మేగజైన్ తదితర అంశాల గురించి అవగాహన కల్పిస్తారు. 11గంటలకు విద్యార్థులతో వారి తల్లులకు పుష్పాలు సమర్పించి పాదాలకు నమస్కరించే కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం తల్లిపేరుతో మొక్కను నాటుతారు. నోటూడ్రగ్స్, సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములం అవుతామంటూ సామూహిక ప్రతిజ్ఞ ఉంటుంది. చివరగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాకమిటీ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, ఆహ్వానితులు కలసి డొక్కా సీతమ్మ మఽధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యక్రమం ముగిస్తారు.
Updated Date - Jul 08 , 2025 | 12:03 AM