DSC: ప్రారంభమైన మెగా డీఎస్సీ
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:33 AM
Teacher recruitment ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. చాలా ఏళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ రావడం, పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తుండడంతో అభ్యర్థుల్లో ఆనందం కన్పించింది.
- నిర్దేశిత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
ఎచ్చెర్ల/ నరసన్నపేట, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. చాలా ఏళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ రావడం, పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తుండడంతో అభ్యర్థుల్లో ఆనందం కన్పించింది. నిర్దేశించిన సమయానికి రెండు గంటలు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల (చిలకపాలెం), శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల (ఎచ్చెర్ల), కోర్ టెక్నాలజీ(నరసన్నపేట), ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంటు(టెక్కలి)తోపాటు జీఎంఆర్ ఐటీ(రాజాం), ఎస్‌ఎం ఐటీ (ఒడిశా రాష్ట్రం బరంపూర్) కేంద్రాలను జిల్లా అభ్యర్థులకు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహించారు. తొలిరోజు శుక్రవారం శ్రీ వెంకటేశ్వర, కోర్ టెక్నాలజీస్, జీఎంఆర్ ఐటీ, బరంపూర్ కేంద్రాల్లో టీజీటీ కేటగిరి పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కేంద్రాన్ని డీఈవో డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య పరిశీలించారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కేంద్రంలో 100 మంది చొప్పున అభ్యర్థులకు ఉదయం షిఫ్ట్‌లో 90 మంది, మధ్యాహ్నం షిఫ్ట్‌లో 95 మంది హాజరయ్యారు.
నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రంలో 320 మంది చొప్పున అభ్యర్థులకుగానూ ఉదయం 295 మంది, మధ్యాహ్నం 278 మంది హాజరయ్యారని పరీక్షల పర్యవేక్షకుడు, ఎంఈవో పి.దాలినాయుడు తెలిపారు. శుక్రవారం పలువురు అభ్యర్థులు గుర్తింపు కార్డులు తీసుకురాకపోవడంతో నెట్ కేంద్రాలకు పరుగులు తీశారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డులు తీసుకురావాలని ఎంఈవో సూచించారు.
Updated Date - Jun 07 , 2025 | 12:33 AM