Lift Irrigation Scheme: నిర్మాణం సరే.. నీరేదీ?
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:06 AM
Project Delay Inauguration Pending కొత్తూరు మండలం మాతల ఎత్తిపోతల పథకం పనులు పూర్తయినా.. ప్రారంభించేందుకు పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ప్రారంభానికి నోచుకోని మాతల ఎత్తిపోతలు
2018లో రూ.9.70 కోట్లతో పథకానికి శ్రీకారం
పనులు పూర్తయి ఆరేళ్లయినా దిష్టిబొమ్మలా..
వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే నిర్లక్ష్యం
ఏడు గ్రామాల రైతులకు అందని సాగునీరు
కొత్తూరు, జూన్ 12(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం మాతల ఎత్తిపోతల పథకం పనులు పూర్తయినా.. ప్రారంభించేందుకు పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వంశధార నీటిని సద్వినియోగించేలా.. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు రూ.కోట్ల వ్యయంతో 2018లో ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయి ఆరేళ్లు కావస్తున్నా.. దీనిని ప్రారంభించకపోవడంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది. రూ.కోట్లాది నిధులు వృథాగా మారాయి. తమకు సాగునీరు అందక ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంశధార నది ఎగువ భాగం, ఒడిశా సరిహద్దున ఉన్న కొత్తూరు మండలంలో బలద, మాతల, పెనుగోటవాడ, హంస, కుద్దిగాం, మాకవరం, వీరనారాయణపురం గ్రామాల రైతులు ఏటా సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల్లో సుమారు 1300 ఎకరాల పంట భూములకు నీరు అందక వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఈక్రమంలో రూ.వేలలో పెట్టుబడి పెట్టినా.. సాగునీరు పూర్తిస్థాయిలో లేక పంట కోల్పోయి.. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ ప్రభుత్వ హయంలో అప్పటి పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రైతులకు సాగునీటి సమస్య పరిష్కరించేలా.. కొత్తూరు మండలం మాతల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వంశధార నది నుంచి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించింది. అలాగే ఏడు గ్రామాల పరిధిలోని ఎనిమిది చెరువుల్లో ఎత్తిపోతల పథకం ద్వారా నీరు నింపితే రైతులకు పుష్కలంగా సాగునీరంది.. పంటలు సుభిక్షంగా పండుతాయని భావించింది. 2018లో నాబార్డు ఐఆర్‌డీఎఫ్ నుంచి రూ.9.70 కోట్లు నిధులతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాంట్రాక్టర్ నిర్ణీత కాలంలో ఏడాదిలోపే పనులు పూర్తిచేశారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రాగా.. ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ హయాంలో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే.. ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో వైసీపీ పాలనలో ఐదేళ్లూ.. అప్పటి ఎమ్మెల్యే రెడ్డిశాంతి నిర్లక్ష్యం చేశారు. కాంట్రాక్టర్‌కు పెండింగ్ బిల్లులు సైతం అందించలేదు. పనులు పూర్తయినా.. ఎత్తిపోతల పథకం ప్రారంభించకపోవడంతో సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత పాలకులు, అధికారులు స్పందించి.. ఈ పథకాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ విషయమై నీటిపారుదలశాఖ ఈఈ సుబ్రహ్మణ్యం వద్ద ప్రస్తావించగా.. ‘ఎత్తిపోతల పథకం పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారడంతో ఎవరూ ప్రారంభించలేదు. నదిలో వేసిన నీటిపంపు కూరుకుపోయింది. నది ప్రవాహం తక్కువగా ఉండడంతో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందడం లేదు. నదిలో మళ్లీ కొత్తగా కొంతదూరం పైపులు వేసి నీటిని మళ్లించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామ’ని తెలిపారు.
ఏడు గ్రామాలకు..
మాతల ఎత్తిపోతల పథకం ప్రారంభించి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తే ఏడు గ్రామాల రైతులకు పుష్కలంగా పంటలు పండుతాయి అధికారులు స్పందించి ఈ ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు అందించేలా ప్రయత్నం చేయాలి.
గండివలస తేజేశ్వరావు, రైతు, మాతల
..................
సాగునీరు అందించాలి
మాతల ఎత్తిపోతల పథకం నిర్మించి ఆరేళ్లు కావస్తున్నా.. నేటికి ప్రారంభించలేదు. పంట పొలాలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు దృష్టి సారించి సాగునీరు అందించాలని కోరారు.
రేగేటి మోహనరావు, రైతు, మాతల
..................
స్పందించాలి
మాతల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. అధికారులు, పాలకులు స్పందించి సాగునీటి సమస్య పరిష్కరించాలి.
- కొమరాపు వెంకటరావు, రైతు, హంస
Updated Date - Jun 13 , 2025 | 12:06 AM