Traffic problems: నగరం.. ట్రాఫిక్ దిగ్బంధం
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:36 PM
City traffic jam ‘శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తాం. సమస్యలు ఎక్కడున్నాయే గుర్తించి వాటిని పరిష్కరిస్తాం. ప్రజలకు ఇక్కట్లు లేకుండా చేస్తాం’.. జిల్లా ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పుడు చేసిన ప్రకటన ఇది. నెలలు గడిచిపోతున్నా కానీ, ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తొలగడం లేదు.
శ్రీకాకుళంలో ప్రతిరోజూ ఇదే సమస్య
వాహనాల రద్దీ.. ఇరుకురోడ్లతో ఇక్కట్లు
రోడ్లపైనే ప్రైవేటు వాహనాలు, ఆటోల పార్కింగ్
రహదారుల విస్తరణ ప్రతిపాదన బుట్టదాఖలు
‘శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తాం. సమస్యలు ఎక్కడున్నాయే గుర్తించి వాటిని పరిష్కరిస్తాం. ప్రజలకు ఇక్కట్లు లేకుండా చేస్తాం’.. జిల్లా ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పుడు చేసిన ప్రకటన ఇది. నెలలు గడిచిపోతున్నా కానీ, ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తొలగడం లేదు. ట్రాఫిక్‌కు ఇరుకు రోడ్లు ఒక కారణం కాగా.. ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు, ఆటోలు ఇష్టారాజ్యంగా రోడ్లపైనే నిలబెట్టడం.. నిబంధనలు పాటించక పోవడం మరో కారణం. పోలీసులు ప్రధానంగా వీటిపై దృష్టి పెట్టలేక పోతున్నారు. ఇక శాశ్వత పరిష్కారం మాత్రం రోడ్ల విస్తరణే. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధి చొరవ తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది.
శ్రీకాకుళం క్రైం, జూలై 15(ఆంధ్రజ్యోతి): పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది శ్రీకాకుళం నగరం పరిస్థితి. నగర జనాభాకు తోడు వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నా, అందుకు తగ్గట్టు రోడ్ల విస్తరణ మాత్రం జరగడం లేదు. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. ముఖ్యంగా బలగ ఆసుపత్రి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, డేఅండ్‌నైట్ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్, పొట్టి శ్రీరాములు కూడలి, ఏడురోడ్ల జంక్షన్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాలకొండ రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్, జిల్లా కోర్టు సముదాయం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఎస్పీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం ఇలా ఎన్నో సంస్థలు ఉన్నాయి. దీంతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అడుగు తీసి అడుగు వేయలేనంతగా పరిస్థితి ఉంటుంది. అయితే, ఇరుకైన రోడ్లతోపాటు ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రతిరోజూ గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి.
కార్పొరేషన్‌గా మారినా...
శ్రీకాకుళం మునిసిపాలిటీని దశాబ్ద కాలం కిందట నగరపాలక సంస్థగా మార్చారు. విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నప్పుడే నగరంలోనిప్రధాన జంక్షన్లను రూ.70కోట్లతో విస్తరించేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి దశలో డేఅండ్‌నైట్, ఏడురోడ్లు, రామలక్ష్మణ, పొట్టి శ్రీరాములు కూడళ్లను విస్తరించేందుకు టెండర్లు పిలిచారు. టెండర్లు ఖరారై కాంట్రాక్టర్లు కూడా ముందుకు వచ్చారు. కానీ, స్థల సేకరణ విషయంలో నగరపాలక సంస్థ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో టెండర్ల కాలపరిమితి పూర్తయింది. తర్వాత టీడీపీ ప్రభుత్వం మారడం, శ్రీకాకుళం నగరం.. సుడా పరిధిలోకి రావడం, నిధులు కొరత వంటి అంశాలతో ఈ పనులు ముందుకు సాగలేదు
పట్టించుకోని గత ప్రభుత్వం
శ్రీకాకుళం నగర అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రిగా వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు తన నియోజకవర్గ కేంద్రం శ్రీకాకుళంలో అభివృద్ధిని విస్మరించారనే విమర్శలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణలో భాగంగా జంక్షన్లను విస్తరించాలని పలుమార్లు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపినా గత ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. గతంలో నగర పాలకసంస్థలో పనిచేసిన అధికారుల చొరవతో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఒక సర్వే చేశారు. వారిచ్చిన ప్రతిపాదనలను సైతం అప్పటి వైసీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. నగరంలో రోడ్ల విస్తరణకు సంబంధించి పదేళ్లుగా ప్రతిపాదనలు చేయడం.. బుట్టదాఖలు కావడం పరిపాటిగా మారింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా ట్రాఫిక్ సమస్యపై దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుటే.. ప్రైవేటు బస్సుల దందా
శ్రీకాకుళం నగరంలో ప్రైవేటు బస్సుల దందా నడుస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ప్రైవేట్ వాహనాలను ఆపకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుటే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. మరికొన్ని ప్రైవేట్ బస్సుల సిబ్బంది నేరుగా కాంప్లెక్స్‌లోకే వెళ్లి ప్రయాణికులను తరలిస్తున్నారు. గంటల తరబడి రోడ్డుపై బస్సులను నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు, టాక్సీలు కొద్ది నిమిషాల పాటు రహదారిపై ఆపితే హడావుడి చేసే ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ప్రైవేట్ బస్సులపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
జిల్లాలో శ్రీకాకుళం-1, 2, పాలకొండ, టెక్కలి, పలాస ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. దాదాపు అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇటీవల ప్రైవేటు బస్సులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మారుమూల మండలాల నుంచి సైతం విశాఖ, రాజమండ్రి, విజయవాడ నగరాలకు సర్వీసులను నడుపుతున్నారు. వాటికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా అన్నది తెలియడం లేదు. జనాల అవసరాలను ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పండగలు, పర్వదినాల్లో రెట్టింపు ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. వారికి రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు అటు వైపు చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా ప్రైవేటు బస్సుల దందాను నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
దృష్టి సారించాం
ప్రైవేటు బస్సుల సిబ్బందిపై దృష్టిపెట్టాం. వారు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి అడుగు పెట్టకుండా నిఘా పెంచాం. ఇందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.
- ఆకాశపు విజయకుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి, శ్రీకాకుళం
Updated Date - Jul 15 , 2025 | 11:36 PM